Eli Lilly : గ్లోబల్ టెన్షన్ ఉన్నా ఇండియాకు గుడ్‌న్యూస్..ఫార్మా రంగంలో జోష్ నింపనున్న అమెరికన్ కంపెనీ
ఫార్మా రంగంలో జోష్ నింపనున్న అమెరికన్ కంపెనీ
Eli Lilly : భారతీయ షేర్ మార్కెట్‌కు సోమవారం ఎంతైతే సానుకూలంగా ఉందో, అమెరికా నుంచి మన దేశానికి అంతకంటే మంచి గుడ్ న్యూస్ వచ్చింది. అమెరికన్ ఫార్మా దిగ్గజ సంస్థ అయిన ఎలీ లిల్లీ అండ్ కంపెనీ భారతదేశంలో ఏకంగా 1 బిలియన్ అమెరికన్ డాలర్ల (సుమారు రూ.8,879 కోట్లు) భారీ పెట్టుబడిని ప్రకటించింది. భారతదేశంలో తమ ఉత్పత్తి, సప్లై చైన్ సామర్థ్యాలను బలోపేతం చేయడమే ఈ పెట్టుబడి ముఖ్య ఉద్దేశం అని కంపెనీ వెల్లడించింది.
ఎలీ లిల్లీ కంపెనీ తమ కొత్త సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కేంద్రం దేశవ్యాప్తంగా కంపెనీ ఉత్పత్తి నెట్‌వర్క్‌కు మెయిన్ హబ్‌గా పనిచేయనుంది. అంతేకాకుండా, ఇది హై క్వాలిటీ కలిగిన టెక్నాలజీ, ఇన్నోవేషన్ సేవలను అందించే వేదికగా రూపుదిద్దుకుంటుంది.
ఈ సంవత్సరం మొదట్లోనే కంపెనీ బరువు తగ్గించే, డయాబెటిస్ చికిత్సకు సంబంధించిన మౌంజారో అనే ఔషధాన్ని భారతదేశంలో విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఔషధానికి డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ పెట్టుబడి ఊబకాయం, డయాబెటిస్ ఔషధాల పెరుగుతున్న మార్కెట్‌లో పోటీని దృష్టిలో ఉంచుకొని చేసినట్లు నిపుణులు భావిస్తున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఎలీ లిల్లీ పెట్టుబడిపై సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం గ్లోబల్ హెల్త్ సర్వీస్ ఇన్నోవేషన్‌కు కేంద్రంగా మారిందనడానికి ఈ పెట్టుబడి ఒక నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు. ఈ పెట్టుబడి వల్ల రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు పెరగడమే కాకుండా, భారత దేశ బయోటెక్, ఫార్మా పరిశ్రమకు కూడా కొత్త దిశ లభిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఎలీ లిల్లీ కంపెనీ, తెలంగాణలోని స్థానిక ఔషధ కంపెనీలతో భాగస్వామ్యం చేసుకుంటామని తెలిపింది. దీని ద్వారా ఔషధాల ఉత్పత్తి, పంపిణీ సామర్థ్యాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చర్యల వలన ఊబకాయం, డయాబెటిస్‌కు సంబంధించిన ఔషధాలు భారతదేశంలో తక్కువ ధరలో అందుబాటులోకి వస్తాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.
లిల్లీ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా తమ ఉత్పత్తి, ఔషధ సరఫరా సామర్థ్యాన్ని పెంచడానికి ఈ 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి ఒక కీలక వ్యూహమని పేర్కొన్నారు.