Rare Earth Materials : ఎలక్ట్రానిక్స్, వాహన పరిశ్రమలకు గుడ్‌న్యూస్.. చైనాకు ప్రత్యామ్నాయంగా ఆస్ట్రేలియా!
చైనాకు ప్రత్యామ్నాయంగా ఆస్ట్రేలియా!;
Rare Earth Materials : ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ వంటి రంగాలకు అత్యంత కీలకమైనవి రేర్ ఎర్త్ మెటీరియల్స్. వీటి సరఫరాలో దాదాపు 80% ప్రపంచ అవసరాలను తీరుస్తున్న చైనా, గతేడాదిగా వీటి ఎగుమతులపై ఆంక్షలు విధించింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా పరిశ్రమలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి భారత్ ఇప్పుడు ఆస్ట్రేలియా వైపు చూస్తోంది. ఆస్ట్రేలియా నుంచి ఈ కీలక ఖనిజాలను పొందడానికి భారత్ ప్రయత్నిస్తోందని, ఈ విషయంలో రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని ఆస్ట్రేలియా అధికారి ఒకరు తెలిపారు.
న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కమిషనర్ మాలిని దత్ మాట్లాడుతూ.. "రేర్ ఎర్త్ ఖనిజాల గురించి భారత్, ఆస్ట్రేలియా మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ బ్లాక్‌లు అందుబాటులో ఉన్నాయి. భారత్ ముందుగానే ఈ బ్లాక్‌లను పొంది, కొన్ని కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది" అని చెప్పారు. ఈ ఒప్పందాలు భారత్‌కు అరుదైన ఖనిజాల సరఫరాలో స్థిరత్వాన్ని అందిస్తాయి.
అరుదైన భూ ఖనిజాలు ఎందుకు ఇంత కీలకం?
లాంతేనం, సెరియం, నియోడియం, ప్రోమెథియం, లూటేషియం, గాడోలినియం వంటి 17 రకాల మూలకాలను అరుదైన భూ ఖనిజాలుగా వర్గీకరించారు. వీటిలో ప్రత్యేకమైన అయస్కాంత, ఎలక్ట్రోకెమికల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చాలా చిన్న పరిమాణంలో ఉంటాయి. కానీ శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేయడానికి అత్యవసరం. అలాగే, శక్తివంతమైన లేజర్‌లు, కెపాసిటర్‌లు వంటి ఆధునిక పరికరాల తయారీకి కూడా ఈ అరుదైన ఖనిజాలు తప్పనిసరి. ఆటోమొబైల్ పరిశ్రమలో ఎలక్ట్రిక్ వాహనాల మోటార్లు, పునరుత్పాదక శక్తిలో విండ్ టర్బైన్‌లు, సోలార్ ప్యానెల్‌ల తయారీలో వీటి వినియోగం చాలా ఎక్కువ.
అవి భూమిపై చాలా చోట్ల లభిస్తాయి. అయితే, బంగారం, బొగ్గు వంటివి ఒకే చోట గుట్టలుగా దొరకనట్లుగా, ఇవి భూమిలో అక్కడక్కడా విస్తరించి ఉంటాయి. అందుకే వీటిని వెలికి తీయడం చాలా కష్టం. కష్టం మాత్రమే కాదు, ఈ ప్రక్రియ వల్ల గణనీయమైన పర్యావరణ కాలుష్యం కూడా జరుగుతుంది. చైనా చాలా సంవత్సరాలుగా ఈ ఖనిజాలను వెలికి తీసే పనిలో ఉంది. ఈ రంగంలో వారికి మంచి సాంకేతిక పరిజ్ఞానం, పెద్ద ఎత్తున ఖనిజాలను తీయగల సామర్థ్యం ఉన్నాయి. అందుకే, ప్రపంచానికి అవసరమైన 80% పైగా అరుదైన భూ ఖనిజాలు చైనా నుంచే సరఫరా అవుతున్నాయి. ఏడాది కాలంగా, ముఖ్యంగా కొన్ని నెలలుగా చైనా వీటి ఎగుమతులపై ఆంక్షలు కఠినతరం చేయడంతో, భారతదేశంలోని వాహన పరిశ్రమతో సహా అనేక పరిశ్రమలు ఉత్పత్తిని నిలిపివేసే స్థాయికి వచ్చాయి. అందుకే భారత్ ఇప్పుడు చైనాకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.