EPFO: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ప్రైవేట్ యాజమాన్యాలకు, సంస్థలకు ఊరటనిచ్చే సంచలన నిర్ణయం తీసుకుంది. ఏళ్ల తరబడి కోర్టుల్లో నలుగుతున్న పాత పీఎఫ్ బకాయిల వివాదాలను ముగించేందుకు విశ్వాస్ 2026 పేరుతో ప్రత్యేక పథకాన్ని తెచ్చింది. ఆలస్యంగా పీఎఫ్ చెల్లించిన సందర్భాల్లో విధించే పెనాల్టీలను భారీగా తగ్గిస్తూ ఒకేసారి వివాదాలు పరిష్కరించుకునేందుకు అవకాశం కల్పించింది. ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడటంతో పాటు సంస్థలు ఎదుర్కొంటున్న ఐటీ, చట్టపరమైన చిక్కులను తగ్గించడానికి ఈపీఎఫ్‌ఓ ముందడుగు వేసింది. పీఎఫ్ రహిత చెల్లింపులు, చందాలు జమ చేయడంలో జరిగిన ఆలస్యాల వల్ల ఏర్పడిన వివాదాలను తుదిదశకు చేర్చేందుకు విశ్వాస్ 2026 పథకాన్ని ప్రారంభించింది. అర్హత ఉన్న కంపెనీలు తమ పాత కేసులను తక్కువ జరిమానాతో ఏకకాలంలో పరిష్కరించుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ గోల్డెన్ ఆఫర్ ముగింపు గడువు డిసెంబర్ 28, 2026 కాగా ఈ గడువును పొడిగించే ప్రసక్తి లేదని సంస్థ స్పష్టం చేసింది.

భారీగా తగ్గిన జరిమానాలు

గతంలో పీఎఫ్ విరాళాలు జమ చేయడంలో ఆలస్యమైతే ఏడాదికి ఏకంగా 37 శాతం వరకు భారీ పెనాల్టీ పడేది. ఈ భారం వల్ల అనేక చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేది. నూతన స్కీమ్ కింద ఈ జరిమానాలను గణనీయంగా తగ్గించారు. రెండు నెలల వరకు ఆలస్యమైన చెల్లింపులపై నెలకు కేవలం 0.25 శాతం మాత్రమే జరిమానా విధిస్తారు. రెండు నుంచి నాలుగు నెలల ఆలస్యానికి నెలకు 0.50 శాతం, నాలుగు నెలలు దాటితే నెలకు 1 శాతం చొప్పున మాత్రమే పెనాల్టీ వసూలు చేస్తారు. ఈ నిబంధన వల్ల వేలాది సంస్థలకు భారీ ఆర్థిక ఉపశమనం కలగనుంది.

వేలాది కేసులకు విముక్తి

ఈపీఎఫ్‌ఓ తెచ్చిన ఈ పథకాన్ని బాంబే, మద్రాస్, కేరళ వంటి పలు హైకోర్టులు ప్రశంసించాయి. పాత కేసులను వెంటనే ముగించేందుకు ఈ స్కీమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని న్యాయస్థానాలు వ్యాఖ్యానించాయి. ఇప్పటికే కేరళ హైకోర్టు 19 విభిన్న కేసుల్లో యాజమాన్యాలు విశ్వాస్ 2026 ప్రయోజనాలు పొందాలని ఆదేశించింది. జూన్ 14, 2024 కంటే ముందు నమోదైన పీఎఫ్ ఆలస్య చెల్లింపు కేసులు, కోర్టులలో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లు, నోటీసులు అందిన రికవరీ కేసులకు ఈ పథకం వర్తిస్తుంది.

డిజిటల్ సెటిల్‌మెంట్ పత్రాలు

ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకునే ఎంప్లాయర్లు ముందుగా పీఎఫ్ ఆలస్యానికి సంబంధించిన అసలు వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం ఈపీఎఫ్‌ఓ ఎంప్లాయర్ పోర్టల్ వేదికగా ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలి. సిస్టమ్ ఆటోమేటిక్‌గా సవరించిన జరిమానాను లెక్కిస్తుంది. లెక్కింపు పూర్తయ్యాక సొమ్ము చెల్లించడానికి 15 రోజుల గడువు ఇస్తారు. అవసరాన్ని బట్టి మరో 15 రోజులు అదనపు సమయం ఇస్తారు. చెల్లింపు పూర్తయిన వెంటనే డిజిటల్ సంతకంతో కూడిన పరిష్కార పత్రాన్ని జారీ చేస్తారు. దీని ఆధారంగా న్యాయస్థానాల్లో ఉన్న కేసులను అధికారికంగా మూసివేయవచ్చు.

Tags: