Income Tax: ట్యాక్స్ ఎగవేతదారుల ఆట కట్టించేందుకు ఆదాయ పన్ను శాఖ అత్యంత కఠినమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. పన్ను చెల్లింపుదారుల వార్షిక సమాచార నివేదిక (AIS) పరిధిని భారీగా పెంచుతూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నయా ఫ్రేమ్‌వర్క్ తీసుకొచ్చింది. ఇకపై విదేశీ పెట్టుబడులు, జీఎస్టీ రిటర్నులు, ఆఫ్‌మార్కెట్ షేర్ లావాదేవీలన్నీ ఐటీ శాఖ రడార్‌లో స్పష్టంగా కనిపించనున్నాయి.

ఏఐఎస్ పరిధి భారీగా పెంపు

పన్ను ఎగవేతలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో ఆదాయ పన్ను శాఖ ఆన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (AIS) వ్యవస్థను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దింది. ఇప్పటివరకు పన్ను శాఖ దృష్టికి రాకుండా తప్పించుకుంటున్న ఆర్థిక లావాదేవీలను సైతం ఇకపై నేరుగా ఏఐఎస్ రడార్ కిందికి తీసుకురానున్నారు. ఇందులో భాగంగా జీఎస్టీ రిటర్నులు, బ్యాంకింగ్ వ్యవస్థతో సంబంధం లేకుండా జరిగే విదేశీ పెట్టుబడులు, ఆఫ్‌మార్కెట్ షేర్ లావాదేవీల పూర్తి వివరాలను ఈ పోర్టల్‌లో కలపబోతున్నారు. తమ నిజమైన ఆదాయాన్ని, నిధులను దాచిపెట్టాలని చూసే వారికి ఈ కొత్త మార్పులు కోలుకోలేని దెబ్బ కానున్నాయి.

పన్ను తనిఖీలకు నయా ఫ్రేమ్‌వర్క్

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సేకరించే భారీ డేటాబేస్ ద్వారా పన్ను చెల్లింపుదారుల అసలు రాబడిని కచ్చితంగా లెక్కించడం ప్రభుత్వానికి ఎంతో సులువవుతుంది. కొత్త నిబంధనల ప్రకారం లభించిన సమాచారాన్ని ఆయా నెలల ముగింపు నుంచి మూడు నెలల వ్యవధిలోనే పోర్టల్‌లో అప్‌లోడ్ చేసేందుకు ఇన్కమ్ టాక్స్ డైరెక్టర్ జనరల్‌కు సర్వాధికారాలు కల్పించారు. ఈ నయా విధానం వల్ల కస్టమర్లు సమర్పించే పన్ను రిటర్నులను ఇతర ఆర్థిక డేటాతో సులభంగా సరిపోల్చి చూడవచ్చు. ఫైలింగ్‌లో ఏ చిన్న తేడా ఉన్నా ఐటీ శాఖ అధికారులు తక్షణమే గుర్తిస్తారు.

విదేశీ పెట్టుబడులు, ఇతర ఐటీఆర్ సమాచారంపై ప్రత్యేక దృష్టి

ఇప్పటివరకు సాధారణ బ్యాంకింగ్ ద్వారా జరిగే లావాదేవీలు TDS ద్వారా ఐటీ శాఖకు తెలిసేవి. అయితే చాలామంది విదేశీ బ్రోకర్లు లేదా ఏజెంట్ల ద్వారా విదేశీ డెరివేటివ్ మార్కెట్లు, అన్‌లిస్టెడ్ కంపెనీల్లో నిధులు మళ్లించేవారు. ఇటువంటి గుప్త పెట్టుబడులను పట్టుకోవడానికి ఏఐఎస్ పరిధిని విస్తరించారు. అంతేకాకుండా ఒక పన్ను చెల్లింపుదారు సమర్పించిన ఐటీఆర్ డేటా ఆధారంగా మరొకరి ఏఐఎస్‌లోని లావాదేవీలను సరిపోల్చే సరికొత్త విధానాన్ని అమలులోకి తెచ్చారు. డిపాజిటరీలు సేకరించే ఆఫ్‌మార్కెట్ షేర్ లావాదేవీల వివరాలు కూడా ఇకపై ఏఐఎస్‌లోనే ప్రత్యక్షమవుతాయి.

ఏఐఎస్‌లో తప్పులు ఉంటే ఫిర్యాదు చేసే వెసులుబాటు

ఒకవేళ మీ ఏఐఎస్ రికార్డుల్లో ఏదైనా తప్పు సమాచారం లేదా ఒకే లావాదేవీ రెండుసార్లు నమోదైనట్లు గమనిస్తే కంగారు పడాల్సిన అవసరం లేదని ఐటీ శాఖ స్పష్టం చేసింది. పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా ట్యాక్స్ పేయర్లు తమ ఏఐఎస్‌ను పరిశీలించుకుని సరైన ఫీడ్‌బ్యాక్ సమర్పించవచ్చు. ఆఫ్‌లైన్ యూటిలిటీ ద్వారా కూడా ఈ సవరణలు చేసుకునే సౌకర్యం కలదు. రాబోయే రోజుల్లో విరాళాల వివరాలను కూడా ఏఐఎస్‌లో చేర్చనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Tags: