Post Office: అకౌంట్ హోల్డర్ చనిపోతే పోస్టాఫీస్ డబ్బులు ఎవరికి వెళ్తాయి?
డబ్బులు ఎవరికి వెళ్తాయి?
Post Office: పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS)లో పెట్టుబడి పెట్టిన వ్యక్తి హఠాత్తుగా మరణిస్తే ఆ డిపాజిట్ సొమ్ము ఏమవుతుందనే ఆందోళన చాలామందిలో ఉంటుంది. ఖాతాదారుడు చనిపోయినంత మాత్రాన ఆ సొమ్ము వృథా కాదు. సరైన ఆధారాలు సమర్పించి నామినీలు లేదా చట్టబద్ధ వారసులు ఆ డబ్బును సులభంగా క్లెయిమ్ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం అందించే చిన్న మొత్తాల పొదుపు పథకాలలో పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అత్యంత ప్రజాదరణ పొందింది. ప్రతీ నెలా స్థిరమైన ಆದాయం కోరుకునే వారికి ఇది ఒక అద్భుతమైన మార్గం. ఐదేళ్ల కాలపరిమితి ఉండే ఈ పథకంపై ప్రస్తుతం ఏడాదికి 7.4 శాతం వడ్డీని చెల్లిస్తున్నారు. ఇందులో ఒక వ్యక్తి తన పేరిట గరిష్టంగా రూ.9 లక్షలు, ఉమ్మడి ఖాతా అయితే రూ.15 లక్షల వరకు డిపాజిట్ చేసుకునే వెసులుబాటు ఉంది. షేర్ మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా సురక్షితమైన రాబడి రావడం వల్ల మిడిల్ క్లాస్ ప్రజలు దీనిపై ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు.
ఖాతాదారుడు మరణిస్తే సొమ్ము ఎవరికి దక్కుతుంది?
దురదృష్టవశాత్తు ఖాతాదారుడు మరణించినప్పుడు ఆ సొమ్ము సురక్షితంగా నామినీకి చేరుతుంది. అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో నమోదు చేసిన నామినీలు క్లెయిమ్ ఫారం నింపి, అవసరమైన పత్రాలను పోస్టాఫీసులో సమర్పించాల్సి ఉంటుంది. డెత్ సర్టిఫికేట్ అసలు ప్రతి, పాస్‌బుక్, చిరునామా ఆధారాలు, కేవైసీ పత్రాలు అందించడం ద్వారా సొమ్మును పొందే వీలుంది. ఒకరి కంటే ఎక్కువ మంది నామినీలు ఉంటే, ఖాతాదారుడు కేటాయించిన వాటా ప్రకారం ఆ మొత్తాన్ని పంచుతారు. ఒకవేళ వాటాల కేటాయింపు లేకపోతే, జీవించి ఉన్న నామినీలకు ఆ సొమ్ము సమానంగా దక్కుతుంది.
నామినీ లేకపోతే క్లెయిమ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
ఖాతాకు నామినీని జోడించకపోతే, చట్టబద్ధమైన వారసులు ఆ సొమ్ముపై హక్కు పొందవచ్చు. డిపాజిట్ మొత్తం రూ. 5 లక్షలలోపు ఉన్న సందర్భాల్లో కొన్ని అఫిడవిట్లు, బాండ్లు, డిస్క్లైమర్ పత్రాలను పరిశీలించి అధికారులు సొమ్మును అందిస్తారు. ఒకవేళ ఆ మొత్తం రూ. 5 లక్షలు దాటినా, లేదా వారసత్వంలో ఏవైనా వివాదాలు తలెత్తినా కోర్టు నుంచి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ పొందడం తప్పనిసరి. కోర్టు ఉత్తర్వుల ఆధారంగానే క్లెయిమ్ పరిష్కారం జరుగుతుంది కాబట్టి ప్రక్రియ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
జాయింట్ అకౌంట్ హోల్డర్లకు ఉన్న వెసులుబాటు
ఒకవేళ ఇది జాయింట్ ఎంఐఎస్ ఖాతా అయితే, అందులోని ఒక వ్యక్తి మరణించినా ఖాతా రద్దు కాకుండా కొనసాగుతుంది. జీవించి ఉన్న మరొక ఖాతాదారుడు ఈ పథకం నిబంధనలకు లోబడి ఆ ఖాతాను యథాతథంగా నిర్వహించుకోవచ్చు. ఖాతాదారుడి మరణం వల్ల పోస్టాఫీస్‌లో దాచుకున్న సొమ్ము ఎట్టిపరిస్థితుల్లోనూ కోల్పోయే ప్రమాదం లేదు. కస్టమర్లు తమ ఖాతాలో ఎప్పటికప్పుడు సరైన నామినీ వివరాలు నవీకరించుకోవడం వల్ల భవిష్యత్తులో కుటుంబ సభ్యులకు శ్రమ తగ్గుతుంది.