Indian Banking History : 1770 నుంచి 2025 వరకు.. భారత బ్యాంకింగ్ ప్రయాణంలో వింతలు, విశేషాలివే

భారత బ్యాంకింగ్ ప్రయాణంలో వింతలు, విశేషాలివే

Update: 2026-02-24 07:19 GMT

 Indian Banking History : ఒకప్పుడు బ్యాంకుకు వెళ్లడమంటే ఒక పెద్ద యుద్ధం చేసినట్లే ఉండేది. ఉదయాన్నే క్యూలో నిలబడటం, టోకెన్ కోసం గంటల కొద్దీ నిరీక్షణ, పాస్‌బుక్ ఎంట్రీ కోసం సిబ్బంది బ్రతిమిలాడటం.. ఇవన్నీ సగటు మనిషికి నిత్యకృత్యం. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. మీ అరచేతిలో ఉండే స్మార్ట్‌ఫోనే ఇప్పుడు ఒక నడిచే బ్యాంకుగా అవతరించింది. 1770లో కలకత్తాలో బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ ప్రారంభం నుంచి నేటి యూపీఐ విప్లవం వరకు భారత బ్యాంకింగ్ వ్యవస్థ ఒక అద్భుతమైన ప్రయాణాన్ని సాగించింది. 1955లో ఎస్బీఐ ఏర్పాటు, 1969లో బ్యాంకుల జాతీయీకరణ వంటి కీలక ఘట్టాలను దాటుకుని నేడు హైటెక్ హంగులతో మన ముందుకు వచ్చింది. అయితే, ఈ డిజిటల్ సౌలభ్యం వెనుక సామాన్యుడి జేబుకు చిల్లు పడే చేదు నిజాలు కూడా దాగి ఉన్నాయి.

క్యూలైన్ల నుంచి విముక్తి లభించిన మాట వాస్తవమే కానీ, బ్యాంకింగ్ అనేది ఇప్పుడు ఖరీదైన వ్యవహారంగా మారింది. 1987లో ముంబైలో తొలి ఏటీఎం ఏర్పాటుతో మొదలైన మార్పు, 1991 ఆర్థిక సంస్కరణలతో ప్రైవేటు బ్యాంకుల రాకతో మరింత వేగవంతమైంది. ముఖ్యంగా 2016 తర్వాత వచ్చిన యూపీఐ విప్లవం నగదుతో పనిలేకుండా చేసింది. టీ కొట్టు నుంచి షాపింగ్ మాల్ వరకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు.. సెకన్లలో పేమెంట్ అయిపోతుంది. ప్రభుత్వం కూడా బ్యాంకులను మరింత బలోపేతం చేయడానికి విలీన ప్రక్రియను చేపట్టింది. జన్ ధన్, ఆధార్, మొబైల్ త్రిమూర్తుల కలయికతో పల్లెల్లో కూడా బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల బ్యాంకుల మొండి బకాయిలు తగ్గి, 2025 నాటికి బ్యాంకులు భారీ లాభాల బాటలో పయనిస్తున్నాయి.

అయితే బ్యాంకుల ఈ లాభాల వెనుక ఖాతాదారుల నుంచి వసూలు చేస్తున్న హిడెన్ ఛార్జీల దెబ్బ గట్టిగానే ఉంది. ఇప్పుడు బ్యాంకులో డబ్బులు దాచుకోవడం కూడా భారంగా మారుతోంది. అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే జరిమానాలు విధిస్తున్నారు. ఏటీఎం నుంచి నెలలో నిర్ణీత పరిమితికి మించి డబ్బులు డ్రా చేస్తే బాదుడు మొదలవుతుంది. మే 1, 2025 నుంచి ఏటీఎం ఛార్జీలను రూ.21 నుంచి రూ.23కి పెంచి దానికి తోడు జీఎస్టీ కూడా వసూలు చేస్తున్నారు. గతంలో ఉచితంగా వచ్చే ఎస్ఎంఎస్ అలర్ట్లకు ఇప్పుడు ప్రతి మూడు నెలలకోసారి ఛార్జీలు కట్టాల్సిందే. చెక్ బుక్ తీసుకోవాలన్నా, డూప్లికేట్ స్టేట్‌మెంట్ కావాలన్నా, చివరికి కేవైసీ అప్‌డేట్ కోసం కూడా బ్యాంకులు ఏదో ఒక రూపంలో సామాన్యుడి సొమ్మును పిండేస్తున్నాయి.

భవిష్యత్తులో ఈ పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. 2025లో వచ్చిన కొత్త బ్యాంకింగ్ సవరణల ప్రకారం, బ్యాంకులు ఇప్పుడు కేవలం సామాజిక సేవకే పరిమితం కాకుండా కార్పొరేట్ స్థాయిలో లాభాలే పరమావధిగా పనిచేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెటావర్స్ వంటి టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్న కొద్దీ.. సైబర్ సెక్యూరిటీ పేరుతో ఖాతాదారులపై మరిన్ని ఛార్జీల భారం పడే ప్రమాదం ఉంది. బ్యాంకులు నేషనల్ ఛాంపియన్స్ గా ఎదుగుతున్న ఈ తరుణంలో ఆ ఎదుగుదలకు అయ్యే ఖర్చును సామాన్యుడి ఖాతా నుంచే మళ్లించడం ఎంతవరకు సమంజసమనే చర్చ మొదలైంది.

Tags:    

Similar News