EPFO : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..అప్లై చేయకపోయినా మీ డబ్బు మీ ఖాతాలోకి
అప్లై చేయకపోయినా మీ డబ్బు మీ ఖాతాలోకి
EPFO :ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఖాతాదారులకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ అదిరిపోయే శుభవార్త అందించింది. సంవత్సరాల తరబడి పీఎఫ్ ఖాతాల్లో మూలుగుతున్న మీ సొమ్మును తిరిగి మీ జేబుల్లోకి చేర్చేందుకు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై పీఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా, ఎలాంటి పేపర్ వర్క్ అవసరం లేకుండానే నేరుగా మీ బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బులు వచ్చేలా సరికొత్త వ్యవస్థను సిద్ధం చేసింది.
సాధారణంగా ఏదైనా పీఎఫ్ ఖాతాలో వరుసగా మూడేళ్ల పాటు ఎలాంటి లావాదేవీలు జరగకపోతే, దానిని ఇన్-ఆపరేటివ్ లేదా డీయాక్టివేట్ అకౌంట్ గా పరిగణిస్తారు. చాలామంది ఉద్యోగాలు మారినప్పుడు పాత కంపెనీకి చెందిన పీఎఫ్ ఖాతాలను పట్టించుకోరు. ముఖ్యంగా వెయ్యి రూపాయల కంటే తక్కువ ఉన్న ఖాతాల కోసం దరఖాస్తులు చేయడం, సంతకాలు పెట్టడం ఎందుకనే ఉద్దేశంతో వదిలేస్తుంటారు. ఇలాంటి వారి కోసమే ప్రభుత్వం ఈ ఆటోమేటిక్ రీఫండ్ ప్లాన్ తీసుకువచ్చింది.
ప్రస్తుతం ఈ పథకాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించారు. ఎవరి ఖాతాలో అయితే రూ.1000 లేదా అంతకంటే తక్కువ నగదు ఉందో.. వారి వివరాలను ఆధార్ కార్డు సహాయంతో ధృవీకరించి, నేరుగా వారి బ్యాంక్ ఖాతాకు ఆ మొత్తాన్ని పంపిస్తారు. మొత్తం 31 లక్షల డీయాక్టివేట్ అకౌంట్ను గుర్తించగా, తొలి విడతలో 6 లక్షల అకౌంట్లను ఈ ప్రక్రియ కోసం ఎంపిక చేశారు. ఈ ప్రయోగం విజయవంతమైతే.. మిగిలిన 25 లక్షల ఖాతాల్లో ఉన్న డబ్బును కూడా ఇదే పద్ధతిలో వెనక్కి ఇచ్చేస్తారు.
గణాంకాల ప్రకారం చూస్తే.. దేశవ్యాప్తంగా వివిధ పీఎఫ్ ఖాతాల్లో సుమారు రూ.10,903 కోట్ల భారీ మొత్తం వాడుకలో లేకుండా పడి ఉంది. ఇందులో రూ.1000 లోపు ఉన్న ఆరు లక్షల ఖాతాల్లోనే సుమారు రూ.30.52 కోట్లు ఉన్నాయి. కొన్ని అకౌంట్లలో గత 20 ఏళ్లుగా ఒక్క రూపాయి కూడా అటు ఇటు కదలలేదు. ఇలాంటి డెడ్ అకౌంట్లకు పరిష్కారం చూపడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఆధార్ లింక్ అయి ఉన్నవారికి ఈ ప్రక్రియ అత్యంత వేగంగా పూర్తవుతుంది.
ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది సామాన్య ఉద్యోగులకు ఊరట లభించనుంది. చిన్న మొత్తమే కదా అని వదిలేసిన వారు ఇప్పుడు ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా, దరఖాస్తులు చేసే తలనొప్పి లేకుండా తమ సొమ్మును తిరిగి పొందవచ్చు. పీఎఫ్ డబ్బుల కోసం ఇన్నాళ్లూ ఉన్న సంక్లిష్టమైన నిబంధనలను సడలించి, టెక్నాలజీ సాయంతో ఈ సమస్యను పరిష్కరిస్తున్న తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.