Nirmala Sitharaman : బ్యాంకులకు నిర్మలమ్మ వార్నింగ్.. ఇన్సూరెన్స్ పేరుతో కస్టమర్లను పీడిస్తే ఊరుకోం
ఇన్సూరెన్స్ పేరుతో కస్టమర్లను పీడిస్తే ఊరుకోం
Nirmala Sitharaman :బ్యాంకులకు వెళ్లి ఏదైనా లోన్ తీసుకోవాలన్నా లేదా ఖాతా తెరవాలన్నా.. అక్కడ సిబ్బంది మనకు అనవసరమైన ఇన్సూరెన్స్ పాలసీలను అంటగడుతున్నారా? అయితే మీకు శుభవార్త. బ్యాంకులు తమ అసలు పని అయిన డిపాజిట్లు సేకరించడం, రుణాలు ఇవ్వడంపై దృష్టి పెట్టాలే తప్ప, కస్టమర్లకు అక్కర్లేని ఆర్థిక ఉత్పత్తులను బలవంతంగా అమ్మకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోమవారం ఆర్‌బీఐ బోర్డు సమావేశం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, బ్యాంకులు ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా మారడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
చాలా సందర్భాల్లో కస్టమర్లకు ఇప్పటికే ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ, బ్యాంకులు కేవలం తమ కమిషన్ల కోసం అదనపు పాలసీలు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. ముఖ్యంగా హోమ్ లోన్ కోసం ఆస్తులు తాకట్టు పెట్టినప్పుడు కూడా అదనపు ఇన్సూరెన్స్ అడగడం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఇంతకాలం ఆర్‌బీఐ, ఐఆర్‌డీఏఐ మధ్య ఉన్న నిబంధనల లొసుగుల వల్ల కస్టమర్లు నష్టపోయారని, ఇకపై అలాంటి మిస్ సెల్లింగ్ అస్సలు సహించబోమని ఆమె స్పష్టం చేశారు.
దీనిపై ఆర్‌బీఐ కూడా కఠినమైన నిబంధనలను సిద్ధం చేసింది. ఫిబ్రవరి 11న విడుదల చేసిన ముసాయిదా ప్రకారం.. ఒకవేళ బ్యాంకులు కస్టమర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి ఏదైనా ప్రొడక్ట్ అమ్మితే, కస్టమర్ చెల్లించిన మొత్తం సొమ్మును వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయాలి. అంతేకాకుండా కస్టమర్‌కు జరిగిన నష్టానికి పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త రూల్స్ జూలై 1 నుండి అమల్లోకి రానున్నాయి. బ్యాంకులు తమ కాసా (CASA - సేవింగ్స్, కరెంట్ అకౌంట్) బేస్‌ను పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు.
మరోవైపు వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 2025లో రెపో రేటును 1.25 శాతం తగ్గించి 5.25 శాతానికి చేర్చినట్లు ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తులో వడ్డీ రేట్ల తగ్గింపు అనేది దేశ ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. వచ్చే ఏప్రిల్ 6న జరిగే మానిటరీ పాలసీ సమావేశంలో వడ్డీ రేట్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లో నగదు లభ్యత తక్కువ కాకుండా ఆర్‌బీఐ అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.