Trump Tariff : మందులు, కార్లు, కూరగాయలకు నో టెన్షన్.. ట్రంప్ టారిఫ్ లిస్టులో లేని సామాన్లు ఇవే
ట్రంప్ టారిఫ్ లిస్టులో లేని సామాన్లు ఇవే
Trump Tariff : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రపంచ వాణిజ్య వర్గాల్లో పెను సంచలనం రేపింది. సుప్రీంకోర్టు షాక్ ఇచ్చిన కొద్దిసేపటికే, ఆయన ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 10 శాతం అదనపు గ్లోబల్ టారిఫ్ విధిస్తూ సంతకం చేశారు. ఇది ఫిబ్రవరి 24, 2026 తెల్లవారుజామున 12:01 గంటల నుంచి అమల్లోకి రానుంది. అయితే ఈ పన్ను బాదుడు నుంచి అన్ని వస్తువులకు కాకుండా, కొన్ని అత్యవసర సామాగ్రికి మినహాయింపునిస్తూ ట్రంప్ ఊరటనిచ్చారు. అమెరికా ప్రయోజనాల దృష్ట్యా ఆ లిస్టులో ఏయే వస్తువులు ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.
పన్ను మినహాయింపు పొందిన వస్తువుల జాబితా ఇదే
అమెరికా తన అవసరాల కోసం విదేశాలపై ఎక్కువగా ఆధారపడే వస్తువులకు ఈ 10 శాతం పన్ను వర్తించదు. ముఖ్యంగా ఫార్మా, ఎనర్జీ, కొన్ని రకాల ఆహార ఉత్పత్తులకు ఈ వెసులుబాటు కల్పించారు.
ఔషధాలు, ముడి పదార్థాలు: ఫార్మాస్యూటికల్స్, మందుల తయారీలో వాడే కీలకమైన ఇంగ్రీడియంట్స్‌పై ఈ అదనపు పన్ను ఉండదు. అమెరికా మందుల కోసం ఇతర దేశాలపై ఎక్కువగా ఆధారపడుతుంది కాబట్టి ప్రజలపై భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎనర్జీ ప్రొడక్ట్స్: పెట్రోలియం, గ్యాస్ వంటి ఇంధన ఉత్పత్తులపై ఎటువంటి అదనపు టారిఫ్ ఉండదు. ఇంధన ధరలు పెరిగితే అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉండటమే దీనికి కారణం.
రేర్ మినిరల్స్ : అమెరికాలో దొరకని లేదా తక్కువగా ఉత్పత్తి అయ్యే ఖనిజాలు, ఎరువులు, సహజ వనరులకు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు.
ఆటోమొబైల్ రంగం: ప్యాసింజర్ కార్లు, లైట్ ట్రక్కులు, బస్సులు, వాటికి సంబంధించిన కొన్ని స్పేర్ పార్ట్స్‌పై ఈ 10 శాతం అదనపు భారం ఉండదు.
వ్యవసాయ ఉత్పత్తులు: బీఫ్ (గొడ్డు మాంసం), టమోటాలు, ఆరెంజ్ (నారింజ) వంటి కొన్ని రకాల ఆహార పదార్థాలకు కూడా ఈ పన్ను నుంచి మినహాయింపు లభించింది.
ఎలక్ట్రానిక్స్, ఎరోస్పేస్: కొన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు, విమానయాన రంగానికి చెందిన ఉత్పత్తులను కూడా ఈ పన్ను పరిధి నుంచి మినహాయించారు.
పుస్తకాలు, ఇతరాలు: సమాచార సంబంధిత మెటీరియల్ (పుస్తకాలు), విరాళాలు, ప్రయాణికులతో పాటు వచ్చే సామాగ్రికి కూడా ఈ పన్ను వర్తించదు.
ఎందుకు ఈ మినహాయింపులు?
ట్రంప్ పన్నులు విధించినా, అమెరికాలో నిత్యావసరాల ధరలు పెరగకూడదని భావిస్తున్నారు. ముఖ్యంగా చైనా, భారత్ వంటి దేశాల నుంచి వచ్చే మందులు, ఎలక్ట్రానిక్స్ పై పన్ను వేస్తే అమెరికా ప్రజలే ఇబ్బంది పడతారు. అందుకే అమెరికాలో కొరత ఉన్న వస్తువులను, అక్కడ పండించలేని ఆహార పదార్థాలను ఈ లిస్టులో చేర్చారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ట్రంప్ తన పంతాన్ని నెగ్గించుకోవడానికి సెక్షన్ 122 కింద ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, దేశీయంగా వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇది ప్రపంచ ఎగుమతిదారులకు ఒక రకంగా ఊరటనిచ్చే విషయమే.