FD Monthly Income: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితమైన మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తూనే, క్రమబద్ధమైన ఆదాయాన్ని కోరుకుంటారు. మీ దగ్గర ఒకేసారి రూ.10 లక్షల మొత్తం ఉంటే, ఫిక్స్డ్ డిపాజిట్ (FD) ఒక బెస్ట్ ఆప్షన్‎గా నిలుస్తుంది. బ్యాంకుల్లో ఈ విధంగా డిపాజిట్ చేసిన డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉండటమే కాకుండా, ప్రతి నెలా ఒక నిర్దిష్ట మొత్తం ఆదాయంగా అందుతుంది. అయితే ఈ నెలవారీ సంపాదన ఎంత ఉంటుందనేది పూర్తిగా ఆయా బ్యాంకులు అందించే వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది. బ్యాంక్ వడ్డీ శాతం పెరిగితే ప్రతినెలా వచ్చే లాభం కూడా అదే స్థాయిలో పెరుగుతుంది.

బ్యాంకుల వడ్డీ రేట్ల ఆధారంగా లాభాల అంచనా

దేశంలోని వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు కాలపరిమితిని బట్టి మారుతుంటాయి. ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి పెద్ద, ప్రముఖ బ్యాంకుల్లో సాధారణంగా 6 శాతం నుంచి 6.5 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. అదే సమయంలో చిన్న బ్యాంకులు లేదా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కస్టమర్లను ఆకర్షించేందుకు 7 శాతం నుంచి 8 శాతం వరకు భారీ వడ్డీని అందిస్తున్నాయి. ఉదాహరణకు, మీరు ఎస్‌బీఐ లేదా హెచ్‌డీఎఫ్‌సీలో రూ.10 లక్షలు డిపాజిట్ చేస్తే, 6 శాతం వడ్డీ లెక్కన ఏడాదికి రూ.60,000 వడ్డీ వస్తుంది. అంటే నెలవారీ చెల్లింపుల పద్ధతిలో మీ ఖాతాలో ప్రతి నెలా రూ.5,000 జమ అవుతాయి. ఒకవేళ వడ్డీ రేటు 6.5 శాతంగా ఉంటే నెలవారీ ఆదాయం రూ.5,417 వరకు ఉంటుంది.

చిన్న బ్యాంకులతో మరింత ఎక్కువ ప్రయోజనం

మరింత అధిక లాభం పొందాలనుకునే వారు చిన్న ఫైనాన్స్ బ్యాంకులను ఎంచుకోవచ్చు. అక్కడ వడ్డీ రేట్లు 7 శాతం నుంచి 8 శాతం వరకు ఉంటున్నాయి. ఉదాహరణకు, 7 శాతం వడ్డీ లభిస్తే ఏడాదికి రూ.70,000 చొప్పున నెలకు రూ.5,833 వస్తుంది. అదే వడ్డీ రేటు 7.5 శాతానికి చేరితే నెలకు రూ.6,250 సంపాదించవచ్చు. ఒకవేళ చిన్న బ్యాంకుల్లో 8 శాతం వరకు వడ్డీ లభిస్తే, ఏడాదికి రూ.80,000 వడ్డీ లభిస్తుంది. ఈ లెక్కన చూస్తే ప్రతి నెలా మీ ఖాతాలో సుమారు రూ.6,600 వరకు జమ అయ్యే అవకాశం ఉంది. సాధారణ సాధారణ వార్షిక వడ్డీ విధానం ఆధారంగా ఈ లెక్కింపు ఉంటుంది.

నెలవారీ ఆదాయం కోసం సరైన ఎఫ్‌డీ ఎంపిక

మీ ప్రధాన ఉద్దేశం ప్రతి నెలా గృహ అవసరాల కోసం లేదా ఇతర ఖర్చుల కోసం డబ్బు పొందడమే అయితే, ఎఫ్‌డీ ఖాతా తెరిచేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వడ్డీని క్రమం తప్పకుండా చెల్లించే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇందులో మీ అవసరాన్ని బట్టి నెలవారీ, త్రైమాసిక లేదా వార్షిక చెల్లింపుల విధానాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా క్యూములేటివ్ ఎఫ్‌డీని ఎంచుకుంటే మధ్యలో ఎలాంటి వడ్డీ చేతికి రాదు. మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత మాత్రమే అసలుతో కలిపి మొత్తం డబ్బు ఒకేసారి వస్తుంది. కాబట్టి రెగ్యులర్ ఇన్‌కోమ్ కావాల్సిన వారు కచ్చితంగా నెలవారీ వడ్డీ చెల్లింపు ఆప్షన్‌నే ఎంచుకోవడం ఉత్తమం.

పన్ను విధింపు, ముందస్తు విత్ డ్రా రూల్స్

మీరు ఎఫ్‌డీ నుంచి కేవలం వడ్డీ డబ్బును మాత్రమే నెలవారీగా తీసుకుంటున్నట్లయితే, మీ అసలు రూ.10 లక్షలు పూర్తిగా సురక్షితంగా ఉంటాయి. మెచ్యూరిటీ ముగిసిన తర్వాత ఆ అసలు మొత్తం మీకు తిరిగి లభిస్తుంది. అయితే ఒకవేళ గడువు తీరడానికి ముందే ఎఫ్‌డీని రద్దు చేసుకుంటే బ్యాంకులు కొన్ని నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తాయి. దీనివల్ల మీ లాభాలు తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎఫ్‌డీ ద్వారా వచ్చే వడ్డీ ఆదాయం మీ మొత్తం వార్షిక ఆదాయంలో కలుస్తుంది. మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం దీనిపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందే పన్ను పోను చేతికి ఎంత వస్తుందనే పూర్తి లెక్క వేసుకోవడం మంచిది.

Tags: