ForexReserves : విదేశీ డబ్బులతో నిండిన భారత ఖజానా.. బంగారం ఎన్ని టన్నులు ఉందంటే ?

బంగారం ఎన్ని టన్నులు ఉందంటే ?

Update: 2025-09-06 06:07 GMT

ForexReserves : ట్రంప్ టారీఫ్‎ల వల్ల ఏర్పడిన అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య కూడా భారత్‌కు ఒక శుభవార్త వచ్చింది. ఆగస్టు 29తో ముగిసిన వారంలో దేశ విదేశీ మారక నిల్వలు 3.51 బిలియన్ డాలర్లు పెరిగాయి. ఈ వారం చివరి నాటికి ఫారెక్స్ రిజర్వ్ 694.23 బిలియన్ డాలర్లకు చేరింది. ఆగస్టు 29తో ముగిసిన వారంలో భారతదేశ బంగారం నిల్వలు కూడా పెరిగాయి. అదే సమయంలో గత వారం పాకిస్థాన్ నిల్వలు కూడా పెరిగాయి.

విదేశీ కరెన్సీ నిల్వల్లో పెరుగుదల

భారతీయ రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం ఈ సమాచారాన్ని వెల్లడించింది. అంతకు ముందు వారం మొత్తం విదేశీ మారక నిల్వలు 4.39 బిలియన్ డాలర్లు తగ్గి 690.72 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. శుక్రవారం విడుదలైన గణాంకాల ప్రకారం.. ఆగస్టు 29తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 1.69 బిలియన్ డాలర్లు పెరిగి 583.94 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. డాలర్ల లెక్కల్లో, యూరో, పౌండ్, యెన్ వంటి అమెరికన్ డాలర్ కానటువంటి కరెన్సీల విలువ పెరగడం లేదా తగ్గడం కూడా విదేశీ కరెన్సీ ఆస్తులపై ప్రభావం చూపుతుంది.

బంగారం నిల్వల్లో కూడా వృద్ధి..

రిజర్వ్ బ్యాంక్ ప్రకారం, వారంలో బంగారం నిల్వల విలువ 1.77 బిలియన్ డాలర్లు పెరిగి 86.77 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రత్యేక డ్రాయింగ్ రైట్స్ (SDR) 40 మిలియన్ డాలర్లు పెరిగి 18.77 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ వారంలో IMF వద్ద ఉన్న భారతదేశ నిల్వలు కూడా 18 మిలియన్ డాలర్లు పెరిగి 4.75 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని కేంద్ర బ్యాంక్ డేటా చెబుతోంది.

పాకిస్థాన్ విదేశీ మారక నిల్వలు..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ విదేశీ మారక నిల్వలు 28 మిలియన్ అమెరికన్ డాలర్లు పెరిగాయి. ఆగస్టు 29తో ముగిసిన వారంలో ఎస్​బీపీ విదేశీ మారక నిల్వలు 14.30 మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉన్నాయి. వాణిజ్య బ్యాంకుల వద్ద ఉన్న నికర విదేశీ మారక నిల్వలు 5.35 మిలియన్ అమెరికన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీంతో దేశం మొత్తం ద్రవ్య విదేశీ నిల్వలు 19.65 మిలియన్ అమెరికన్ డాలర్లు అయ్యాయని ఎస్​బీపీ తెలిపింది.

Tags:    

Similar News