Gold Reserves Drop : దేశ ఖజానాలో బంగారం మాయం..ఒక్క వారంలోనే రూ.1.28 లక్షల కోట్లు డౌన్
ఒక్క వారంలోనే రూ.1.28 లక్షల కోట్లు డౌన్
Gold Reserves Drop : దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక కీలక వార్త వెలుగులోకి వచ్చింది. భారత రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, దేశ విదేశీ మారక నిల్వలు ఊహించని విధంగా భారీగా తగ్గాయి. ముఖ్యంగా దేశం దగ్గర ఉన్న బంగారం నిల్వలు ఒక్కవారంలోనే ఏకంగా రూ.1.28 లక్షల కోట్లు హరించుకుపోవడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. నాలుగు వారాల పాటు వరుసగా పెరుగుతూ వచ్చిన నిల్వలు ఇప్పుడు వెనక్కి తగ్గడం గమనార్హం. భారత విదేశీ మారక నిల్వల చరిత్రలో ఒక ఆశ్చర్యకరమైన మార్పు చోటుచేసుకుంది. ఫిబ్రవరి 6తో ముగిసిన వారం నాటికి దేశ మొత్తం నిల్వలు 6.711 బిలియన్ డాలర్లు తగ్గి 717.064 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత వారమే ఆల్ టైమ్ హై రికార్డు (723.774 బిలియన్ డాలర్లు) సృష్టించిన నిల్వలు, ఇప్పుడు ఆ స్థాయి నుంచి కిందకు పడిపోయాయి. బంగారం విలువ తగ్గడం వల్లే ఈ భారీ పతనం సంభవించినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
బంగారం నిల్వలలో భారీ కోత
ఆర్‌బీఐ డేటా ప్రకారం.. దేశ బంగారు నిల్వల విలువ ఒక్క వారంలోనే 14.208 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.28 లక్షల కోట్లు) తగ్గింది. దీంతో మొత్తం గోల్డ్ రిజర్వ్ విలువ 123.476 బిలియన్ డాలర్లకు పడిపోయింది. గత వారం ఇదే గోల్డ్ రిజర్వ్ ఏకంగా 14.595 బిలియన్ డాలర్లు పెరగడం విశేషం. అంటే గత వారం వచ్చిన లాభమంతా ఈ వారం తుడిచిపెట్టుకుపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరల్లో వచ్చిన మార్పులు లేదా అమ్మకాల వల్ల ఈ ప్రభావం పడి ఉండవచ్చని తెలుస్తోంది.
పెరిగిన కరెన్సీ ఆస్తులు
బంగారం తగ్గినప్పటికీ, విదేశీ కరెన్సీ ఆస్తులు మాత్రం ఆశాజనకంగా ఉన్నాయి. ఈ వారంలో కరెన్సీ ఆస్తులు 7.661 బిలియన్ డాలర్లు పెరిగి 570.053 బిలియన్ డాలర్లకు చేరాయి. యూరో, పౌండ్, యెన్ వంటి ఇతర దేశాల కరెన్సీల విలువ పెరగడం వల్ల భారత కరెన్సీ ఆస్తుల్లో వృద్ధి కనిపించింది. గత ఆరు వారాల్లో మూడుసార్లు తగ్గుతూ వచ్చిన ఈ ఆస్తులు, ఈసారి పెరగడం కాస్త ఊరటనిచ్చే అంశం.
కేవలం గోల్డ్ మాత్రమే కాకుండా, అంతర్జాతీయ ద్రవ్యనిధి దగ్గర ఉన్న నిల్వలు, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ కూడా తగ్గాయి. ఎస్‌డీఆర్‌లు 132 మిలియన్ డాలర్లు తగ్గి 18.821 బిలియన్ డాలర్లకు చేరుకోగా, ఐఎంఎఫ్ వద్ద ఉన్న రిజర్వ్ పొజిషన్ 32 మిలియన్ డాలర్లు తగ్గి 4.715 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అమెరికా, యూరోపియన్ యూనియన్‌తో జరుగుతున్న ట్రేడ్ డీల్స్ ప్రభావం ఈ నిల్వలపై పడుతున్నట్లు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.