Free Scooty Scheme : ఆధార్ కార్డు ఉంటే చాలు మహిళలకు స్కూటీ ఫ్రీ..ప్రధాని మోదీ ప్రకటించారా?

ప్రధాని మోదీ ప్రకటించారా?

Update: 2026-02-13 07:54 GMT

Free Scooty Scheme : సోషల్ మీడియా పుణ్యమా అని ఈ మధ్య కాలంలో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోవడం చాలా కష్టమైపోతోంది. తాజాగా ఆడబిడ్డలకు కేంద్ర ప్రభుత్వం ఉచిత స్కూటర్లు పంపిణీ చేస్తోందంటూ ఒక వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా స్కూటర్లు ఇస్తామని ప్రకటించినట్లు ఒక వీడియో వైరల్ అవుతోంది. అయితే ఈ వార్త వినడానికి ఎంత తీపిగా ఉన్నా, ఇందులో అస్సలు నిజం లేదని తేలిపోయింది. గత కొన్ని రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో rouankkumartalks అనే హ్యాండిల్ ద్వారా ఒక వీడియో తెగ షేర్ అవుతోంది. అందులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. దేశంలోని మహిళలందరికీ ఆధార్ కార్డు ప్రాతిపదికన ఉచితంగా స్కూటర్లు అందజేస్తామని చెబుతున్నట్లు కనిపిస్తోంది. ఇది చూసిన చాలా మంది మహిళలు నిజమేనని నమ్మి, దరఖాస్తులు ఎక్కడ చేసుకోవాలంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే ఈ వీడియోను జాగ్రత్తగా గమనిస్తే ప్రధాని గొంతు, పెదవుల కదలికలో తేడా కనిపిస్తుంది.

ఈ వైరల్ వీడియోపై కేంద్ర ప్రభుత్వ అధికారిక సంస్థ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. ఆ వీడియోలో ఉన్న సమాచారం పూర్తిగా ఫేక్ అని తేల్చిచెప్పింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి ప్రధాని మోదీ ముఖాన్ని, గొంతును మార్చి ఈ నకిలీ వీడియోను సృష్టించారని స్పష్టం చేసింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఆధార్ కార్డుపై ఉచిత స్కూటర్లు ఇచ్చే పథకం ఏదీ అమలు చేయడం లేదని, ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరింది.

ప్రభుత్వ పథకాల పేరుతో కేటుగాళ్లు ప్రజల వ్యక్తిగత వివరాలను, ఆధార్ నంబర్లను దొంగిలించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి కొత్త పథకాలు ప్రవేశపెట్టినా వాటి వివరాలు అధికారిక వెబ్‌సైట్ అయిన myscheme.gov.in లో అందుబాటులో ఉంటాయి. మీకు ఏదైనా వార్తపై అనుమానం ఉంటే వెంటనే పీఐబీ ఫ్యాక్ట్ చెక్ హ్యాండిల్‌కు ట్యాగ్ చేసి సమాచారాన్ని ధృవీకరించుకోవచ్చు.

ఈ రోజుల్లో ఫోటోలు, వీడియోలు మార్చడం చాలా సులభమైపోయింది. ప్రధాని వంటి పెద్ద నాయకుల గొంతును కూడా ఏఐ ద్వారా సులభంగా సృష్టించగలుగుతున్నారు. కాబట్టి, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి మెసేజ్‌ను ఫార్వర్డ్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఉచితం అనే వార్త రాగానే సంబరపడకుండా, అది అధికారికంగా ప్రకటించబడిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి.

Tags:    

Similar News