Career Growth : రూ.10 వేలతో మొదలై.. రూ.3.5 లక్షలకు చేరిన జీతం.. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇన్స్‌పిరేషనల్ జర్నీ

ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇన్స్‌పిరేషనల్ జర్నీ

Update: 2026-04-10 11:55 GMT

Career Growth : సాఫ్ట్‌వేర్ రంగంలో అడుగుపెట్టే ప్రతి యువకుడికి ఒక కల ఉంటుంది.. మంచి జీతం, విలాసవంతమైన జీవితం. కానీ ఈ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కథ మాత్రం అందుకు భిన్నం. కేవలం 10 వేల రూపాయల స్టైపండ్‌తో కెరీర్ మొదలుపెట్టి, నేడు నెలకు 3.5 లక్షల రూపాయలు సంపాదించే స్థాయికి ఎలా ఎదిగారో తన సక్సెస్ జర్నీని డెవలపర్స్ ఇండియా కమ్యూనిటీ వేదికగా పంచుకున్నారు. ఈ ఇంజనీర్ ప్రయాణం 2018లో కాలేజీ ముగిసిన వెంటనే మొదలైంది. అప్పట్లోనే ఆయనకు నెలకు రూ.25,000 జీతం వచ్చే ఉద్యోగం దొరికింది. కానీ, ఆయన దానిని కాదని కేవలం రూ.10,000 స్టైపండ్‌ ఇచ్చే బెంగళూరులోని ఒక స్టార్టప్‌లో ఇంటర్న్‌షిప్‌ను ఎంచుకున్నారు. కారణం ఒక్కటే.. డబ్బు కంటే పని నేర్చుకోవడం ముఖ్యం అని ఆయన భావించారు. ఆ నిర్ణయమే ఆయన భవిష్యత్తును మార్చేసింది. తక్కువ డబ్బుతో చిన్న రూమ్‌లో ఉంటూ, ఖర్చులను తగ్గించుకుంటూ కేవలం కోడింగ్‌పైనే దృష్టి సారించారు.

ఇంటర్న్‌షిప్ చేస్తున్నప్పుడే React, Node.js వంటి టెక్నాలజీలపై పట్టు సాధించారు. 2019లో అదే కంపెనీలో రూ.25,000 జీతంతో ఫుల్ టైమ్ ఉద్యోగంలో చేరారు. అక్కడి నుంచి ఆయన వేగం పుంజుకుంది. 2020లో ఫుల్ స్టాక్ డెవలపర్‌గా మారి రూ.35,000 సంపాదించారు. 2021 నాటికి ఆ జీతం రూ.80,000లకు చేరింది. అయితే ఆయన అక్కడితో ఆగలేదు. భవిష్యత్తు అవసరాలను గుర్తించి బ్లాక్‌చైన్ టెక్నాలజీని నేర్చుకున్నారు. గిట్‌హబ్ ప్రాజెక్టుల ద్వారా తన సత్తాను ప్రపంచానికి చాటిచెప్పారు.

2022లో ఆయన జీవితంలో పెద్ద మలుపు వచ్చింది. ఆయన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌ను చూసిన ఫ్రాన్స్‌కు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ నేరుగా సంప్రదించింది. ఇంటర్వ్యూ తర్వాత ఆయనకు నెలకు రూ.3.5 లక్షల జీతంతో రిమోట్ జాబ్ ఆఫర్ చేసింది. ఇది ఆయన పాత జీతం కంటే నాలుగు రెట్లు ఎక్కువ. ఆ కంపెనీలో పనిచేస్తూనే సొంతంగా Teckas Technologies అనే స్టార్టప్‌ను ప్రారంభించి, నేడు యూరప్, అమెరికా క్లయింట్లకు సేవలు అందిస్తున్నారు.

తన ప్రయాణంలో ఎదురైన లోటుపాట్లను కూడా ఆయన నిజాయతీగా పంచుకున్నారు. కెరీర్ మొదట్లో ఆర్థిక ప్రణాళిక లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడ్డానని చెప్పారు. అయితే, జీతం తక్కువైనా సరే పని నేర్చుకునే కంపెనీలనే ఎంచుకోవాలని ఆయన సూచిస్తున్నారు. టెక్నాలజీ మారుతున్న కొద్దీ మనం కూడా అప్‌డేట్ అయితేనే ఈ రంగంలో రాణించగలమని, ఓపికతో కష్టపడితే విజయం దానంతట అదే వస్తుందని ఆయన నిరూపించారు.

Tags:    

Similar News