Fuel Prices Update : పెట్రోల్, డీజిల్ రేట్లపై ఊరట.. 130 డాలర్లు దాటితేనే పెంచతామన్న కేంద్రం
130 డాలర్లు దాటితేనే పెంచతామన్న కేంద్రం
Fuel Prices Update : మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, సామాన్యుడిలో పెట్రో మంటపై ఆందోళన మొదలైంది. అయితే, దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక ఊరటనిచ్చే వార్త చెప్పింది. పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో ప్రస్తుతం ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదని, దేశంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ, మన దేశంలో వెంటనే రేట్లు పెంచే ఆలోచన లేదని తేల్చి చెప్పాయి.
న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ కథనం ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడిచమురు ధర 130 డాలర్లు దాటితే తప్ప, మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదు. ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధరలు 100 డాలర్ల దరిదాపుల్లోనే ఉండటంతో ఇప్పుడప్పుడే భారత్‌పై భారం పడదని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల్లో సరఫరా నిరంతరాయంగా సాగుతుందని, ఎక్కడా ఇంధన కొరత లేదని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రజలు అనవసరంగా భయపడి బంకుల వద్ద క్యూ కట్టాల్సిన అవసరం లేదని సూచించింది.
కేవలం వాహనదారులకే కాకుండా, విమానయాన రంగానికి కూడా ప్రభుత్వం భరోసా ఇచ్చింది. విమానాల్లో వాడే ఏటీఎఫ్ ఇంధన ఉత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా, ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తోందని అధికారులు తెలిపారు. యుద్ధ పరిస్థితుల వల్ల విమాన సర్వీసులకు ఎలాంటి ఆటంకం కలగదని స్పష్టం చేశారు. చిత్రమేమిటంటే, ప్రస్తుత సంక్షోభ సమయంలో ఇంధనం కోసం పలు దేశాలు భారత్‌ను సంప్రదిస్తుండటం విశేషం. గల్ఫ్ దేశాలలోని హోర్ముజ్ జలసంధిపై ఆధారపడకుండా, రష్యా వంటి ఇతర దేశాల నుంచి చమురు దిగుమతులను భారత్ ఇప్పటికే పెంచింది.
పెట్రోల్ విషయంలో ఊరట ఉన్నా, వంట గ్యాస్ వినియోగదారులకు మాత్రం ఒక కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. గ్యాస్ సిలిండర్లను ప్రజలు అనవసరంగా నిల్వ చేయకుండా అడ్డుకోవడానికి ప్రభుత్వం రీఫిల్ బుకింగ్ మధ్య ఉండాల్సిన కాలాన్ని పెంచింది. గతంలో ఒక సిలిండర్ తీసుకున్న 21 రోజుల తర్వాత రెండోది బుక్ చేసుకునే వీలుండగా, ఇప్పుడు ఆ గడువును 25 రోజులకు పెంచారు. అంటే, ఒక సిలిండర్ వచ్చిన 25 రోజుల తర్వాతే మీరు తదుపరి సిలిండర్‌ను బుక్ చేసుకోగలరు. యుద్ధ భయంతో కొందరు అవసరానికి మించి స్టాక్ పెట్టుకుంటున్నారని, అది మిగతా వారికి కొరతగా మారకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వివరించింది.