Gas Cylinder : గ్యాస్ కస్టమర్లకు అలర్ట్..బుక్ చేసినా సిలిండర్ రాకపోయే ఈ నంబర్‎కు కాల్ చేయండి

బుక్ చేసినా సిలిండర్ రాకపోయే ఈ నంబర్‎కు కాల్ చేయండి

Update: 2026-03-14 09:50 GMT

Gas Cylinder : మధ్యప్రాచ్యంలో యుద్ధం ముదురుతుండటంతో మన దేశంలో వంటగ్యాస్ కొరత ఏర్పడుతుందేమోనని సామాన్యుల్లో ఆందోళన మొదలైంది. యుద్ధం కారణంగా సరఫరా నిలిచిపోతే సిలిండర్లు దొరకవేమోనన్న భయంతో చాలామంది గ్యాస్ బుకింగ్‌ల కోసం క్యూ కడుతున్నారు. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గృహ వినియోగదారులకు గ్యాస్ సరఫరాలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని భరోసా ఇచ్చింది. దేశంలో సరిపడా నిల్వలు ఉన్నాయని, వదంతులను నమ్మవద్దని కోరింది.

యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల బుకింగ్ గడువులో ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. సాధారణంగా రెండు బుకింగ్‌ల మధ్య ఉండాల్సిన సమయాన్ని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. అంటే ఒక సిలిండర్ తీసుకున్న తర్వాత మరో 25 రోజుల వరకు రెండో సిలిండర్ బుక్ చేయడానికి వీలుండదు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ గడువును 45 రోజులుగా నిర్ణయించారు. దీనివల్ల గ్యాస్ నిల్వలను అందరికీ సమానంగా పంపిణీ చేయడానికి వీలవుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఇదే సమయంలో కొంతమంది డీలర్లు గ్యాస్ కొరత ఉందని సాకులు చెబుతూ అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి.

ఒకవేళ మీరు గ్యాస్ బుక్ చేసినా డీలర్ సకాలంలో డెలివరీ చేయకపోయినా లేదా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినా, మీరు మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. ప్రముఖ గ్యాస్ కంపెనీలు తమ వినియోగదారుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచాయి. హెచ్‌పీ గ్యాస్ కస్టమర్లు 1800-2333-555 లేదా 9493602222 నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. భారత్ గ్యాస్ వినియోగదారులు 1800-22-4344 లేదా 7715012345 నంబర్లను సంప్రదించవచ్చు. అలాగే ఇండియన్ గ్యాస్ కస్టమర్లు 1800-2333-555 లేదా 7718955555 నంబర్ల ద్వారా తమ సమస్యలను తెలియజేయవచ్చు.

యుద్ధం వల్ల హోర్ముజ్ జలసంధి గుండా చమురు సరఫరా ఆగిపోయినా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకున్నామని భారత్ స్పష్టం చేసింది. అంతేకాకుండా, దేశీయ రిఫైనరీ కంపెనీలు గ్యాస్ ఉత్పత్తిని మరో 25 శాతం పెంచాయి. దీనివల్ల గృహ అవసరాలకు ఎక్కడా ఆటంకం కలగదని మంత్రిత్వ శాఖ ధీమా వ్యక్తం చేస్తోంది. కాబట్టి వినియోగదారులు కంగారు పడి ముందుగానే సిలిండర్లను బుక్ చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ జాగ్రత్తలు చూస్తుంటే యుద్ధం ప్రభావం మన వంటిళ్లపై పడకుండా గట్టిగానే ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది.

Tags:    

Similar News