Gold Price : ఆకాశమే హద్దుగా పసిడి పరుగు..లక్షన్నర దిశగా గోల్డ్ రేట్లు..ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏం చేయాలి?

ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏం చేయాలి?

Update: 2026-01-16 15:18 GMT

Gold Price : ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. ఇన్వెస్టర్ల చూపు అంతా ఇప్పుడు పసిడి పరుగుపైనే ఉంది. 2026 సంవత్సరం ప్రారంభమైన కేవలం రెండు వారాల్లోనే ఈ విలువైన లోహాలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‎లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1.40 లక్షల మార్కుకు చేరువలో ఉండగా, కిలో వెండి ధర ఏకంగా రూ.2.60 లక్షలు దాటిపోయింది. ఈ స్థాయిలో ధరలు పెరగడంతో సామాన్యులు బెంబేలెత్తుతుంటే, ఇన్వెస్టర్లు మాత్రం లాభాల పంట పండుతుందని సంతోషిస్తున్నారు.

అసలు బంగారం ధరలు ఇంతలా ఎందుకు పెరుగుతున్నాయా అని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు. అమెరికా, ఇరాన్, వెనిజులా, చైనా, జపాన్ దేశాల మధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాలు గ్లోబల్ మార్కెట్‌లో అస్థిరతను పెంచాయి. ప్రపంచంలో ఎప్పుడు యుద్ధ మేఘాలు కమ్మినా లేదా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నా.. ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లలో ఉన్న తమ పెట్టుబడులను తీసి సురక్షితమైన బంగారంలో పెట్టడానికి మొగ్గు చూపుతారు. దీనినే సేఫ్ హెవెన్ ఇన్వెస్ట్‌మెంట్ అని అంటారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై భారీ టారిఫ్ విధిస్తామన్న హెచ్చరికలు కూడా మార్కెట్‌ను భయాందోళనకు గురిచేశాయి.

ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ నివేదిక ప్రకారం 2026 సంవత్సరం మొత్తం ఒడిదుడుకులతోనే సాగే అవకాశం ఉంది. అంటే బంగారం, వెండి ధరల్లో ఈ జోరు ఇప్పుడప్పుడే తగ్గే సూచనలు కనిపించడం లేదు. ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు నిరంతరం బంగారాన్ని కొనుగోలు చేస్తూ తమ నిల్వలను పెంచుకుంటున్నాయి. మరోవైపు కొత్తగా బంగారాన్ని వెలికితీసే గనులు పరిమితంగా ఉండటం, పాత బంగారం అమ్మకాలు ఆశించిన స్థాయిలో పెరగకపోవడం వంటి కారణాలు ధరలను మరింత పైకి నెడుతున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు పసిడి ఒక బలమైన ఆసరాగా నిలుస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

కొత్తగా కొనాలా? ఉన్నది అమ్మేయాలా?

ధరలు ఇంతలా పెరిగినప్పుడు లాభాలు స్వీకరించి బయటకు రావాలా? లేక ఇంకా పెరుగుతాయని వేచి చూడాలా? అన్నది పెద్ద ప్రశ్న. ఆనంద్ రాఠీ షేర్స్ కమోడిటీ నివేదికల ప్రకారం.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మొత్తం పెట్టుబడిని విక్రయించడం కంటే, ఒక 40 నుండి 50 శాతం వరకు లాభాలను బుక్ చేసుకోవడం (అమ్మడం) మంచిదని సూచిస్తున్నారు. దీనివల్ల లాభం సురక్షితంగా ఉంటుంది. ఒకవేళ ధరలు ఇంకా పెరిగితే మిగిలిన పెట్టుబడి మీద లాభం వస్తుంది. ఇక కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఒకేసారి భారీ మొత్తాన్ని పెట్టకుండా.. ఎస్ఐపీ పద్ధతిలో లేదా చిన్న చిన్న మొత్తాలలో కొనుగోలు చేయడం ద్వారా రిస్క్ తగ్గించుకోవచ్చు.

Tags:    

Similar News