Gold Loan : గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా.. ఏయే బ్యాంక్ ఎంత వడ్డీ వసూలు చేస్తాయంటే ?
ఏయే బ్యాంక్ ఎంత వడ్డీ వసూలు చేస్తాయంటే ?
Gold Loan : గోల్డ్ లోన్ అనేది మీకు అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు ఉపయోగపడే ఒక మంచి మార్గం. వైద్య ఖర్చులైనా, చదువుకైనా, వ్యాపారానికైనా, లేదా ఇంటి పనులకైనా దీనిని తీసుకోవచ్చు. దీనికి పెద్దగా డాక్యుమెంట్లు అవసరం లేదు, అందుకే చాలా తక్కువ సమయంలో డబ్బు చేతికి వస్తుంది. ఈ రుణంలో మీరు మీ బంగారు నగలు లేదా నాణేలను బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీ వద్ద తాకట్టు పెట్టి, డబ్బు తీసుకుంటారు. ఈ లోన్ గడువు కొన్ని నెలల నుంచి ఒక సంవత్సరం వరకు ఉంటుంది. మీరు వాయిదాలలో లేదా ఒకేసారి మొత్తం చెల్లించే అవకాశం ఉంటుంది.
బంగారంపై రుణం తీసుకునే ముందు వడ్డీ రేట్లు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అక్టోబర్ 2025 నాటికి వివిధ బ్యాంకులు, సంస్థలలో ఉన్న సుమారు వడ్డీ రేట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రభుత్వ బ్యాంకులు: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (8.35%), ఇండియన్ బ్యాంక్ (8.75%), కెనరా బ్యాంక్ (8.90%), భారతీయ స్టేట్ బ్యాంక్ (10.00%) వంటి బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తున్నాయి.
ప్రైవేట్ బ్యాంకులు: కోటక్ మహీంద్రా బ్యాంక్ (9.00%), ICICI బ్యాంక్ (9.15%), HDFC బ్యాంక్ (9.30%) వంటివి ఇంచుమించుగా ప్రభుత్వ బ్యాంకులతో సమానమైన రేట్లలో లోన్ ఇస్తున్నాయి.
ఎన్‌బీఎఫ్‌సీలు: మణప్పురం ఫైనాన్స్ (15.00%), ముత్తూట్ ఫైనాన్స్ (22.00%) వంటి సంస్థల్లో వడ్డీ రేట్లు కొంచెం ఎక్కువగా ఉండవచ్చు, కానీ లోన్ వేగంగా లభిస్తుంది.
గోల్డ్ లోన్ పొందడానికి మీ వద్ద కనీసం 18 క్యారెట్ల నుండి 22 క్యారెట్ల వరకు ఉన్న బంగారు ఆభరణాలు ఉండాలి. కొన్ని బ్యాంకులు 24 క్యారెట్ల కాయిన్స్ కూడా స్వీకరిస్తాయి. కానీ ఒక్కొక్కరికి 50 గ్రాముల వరకు మాత్రమే పరిమితి ఉంటుంది. అయితే, బంగారు విగ్రహాలు, పాత్రలు, వైట్ గోల్డ్, 18 క్యారెట్ల కంటే తక్కువ క్వాలిటీ గల నగలు, బంగారు పూత ఉన్న వాటిని మాత్రం అంగీకరించరు. మీ నగలపై రత్నాలు ఉంటే, ఆ రత్నాల విలువను తగ్గించి, బంగారం బరువును మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.
మీరు తాకట్టు పెట్టే బంగారం క్వాలిటీ, బరువుపై లోన్ మొత్తం ఆధారపడి ఉంటుంది. సాధారణంగా బ్యాంకులు బంగారం మొత్తం విలువలో 75% నుంచి 90% వరకు ఇస్తాయి. ఉదాహరణకు, 22 క్యారెట్ల 20 గ్రాముల బంగారం విలువ మార్కెట్‌లో రూ.1,10,000 అనుకుంటే, మీకు దాదాపు రూ.82,500 నుండి రూ.99,000 వరకు రుణం లభించే అవకాశం ఉంటుంది.