Modi-Trump Meeting: మోదీ-ట్రంప్ సమావేశమే భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి కీలకం?

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి కీలకం?

Update: 2025-10-09 09:27 GMT

Modi-Trump Meeting: భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఎప్పటి నుంచో చర్చలు సాగుతున్నాయి. ఇరు దేశాల అధికారులు అనేకసార్లు సమావేశమైనప్పటికీ, ఇంతవరకు ఏకాభిప్రాయం కుదరలేదు. అయితే, ఈ ప్రతిష్టంభనను తొలగించి వాణిజ్య ఒప్పందాన్ని (ఇండియా-యూఎస్ ట్రేడ్ డీల్) సాకారం చేయాలంటే ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సమావేశం అవసరమని అమెరికా భావిస్తోంది. ఇందుకు సంబంధించి వాషింగ్టన్ నుంచి భారత్‌కు సూచనలు వచ్చినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను ఉటంకిస్తూ ఒక ఆంగ్ల దినపత్రికలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

‘‘వాణిజ్య ఒప్పందం ప్రకటనకు ముందే ప్రధాని మోదీతో సమావేశం కావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరియు ఆయన బృందం కోరుకుంటోంది. కానీ, భారత్‌లోని విధానాల ప్రకారం అది సాధ్యమయ్యేది కాకపోవచ్చు. ఎందుకంటే, ఒప్పందం కుదిరిన తర్వాతే ఇరు దేశాధినేతలు చర్చలు జరుపుతారు. అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో పరిస్థితులు మారవచ్చు. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడూ సాంప్రదాయ ప్రోటోకాల్‌లను పక్కన పెట్టేవారు’’ అని అధికారులు తెలిపినట్లు ఆ కథనం పేర్కొంది.

అమెరికాతో వాణిజ్య చర్చలకు భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వం వహిస్తున్నారు. ఇటీవల గోయల్ బృందం అమెరికా వెళ్లి అక్కడి వాణిజ్య ప్రతినిధి జెమీసన్ గ్రోర్‌తో అనేకసార్లు సమావేశాలు నిర్వహించారు. అయితే, ఇప్పుడు ట్రంప్-మోదీలు కూడా ఈ విషయంపై చర్చించాలని అమెరికా కోరుకుంటోంది. భారత్‌కు కొత్త యూఎస్ రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్ ఈ అంశంపై మన ప్రభుత్వంతో మాట్లాడే అవకాశాలున్నాయి.

ఇదిలావుండగా, అక్టోబరు 26 నుంచి 28 వరకు మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో ఆసియాన్ మరియు తూర్పు ఆసియా నేతల సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్ సందర్భంగా మోదీ-ట్రంప్ సమావేశం జరిగే అవకాశాలున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. అయితే, మోదీ మలేసియా పర్యటన ఇంకా ఖరారు కాలేదు. దీనిపై చర్చలు జరుగుతున్నట్లు కేంద్ర అధికారులు వెల్లడించారు. మోదీ మలేసియా వెళ్తే, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇరు నేతలు మొదటిసారి కలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్‌పై అమెరికా 50 శాతం టారిఫ్‌లు కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News