6G Technology : 6జీ టెక్నాలజీలో మనమే టాప్.. 2035 కల్లా 1.2 ట్రిలియన్ డాలర్ల వృద్ధి
2035 కల్లా 1.2 ట్రిలియన్ డాలర్ల వృద్ధి
6G Technology : 6జీ టెక్నాలజీలో భారతదేశం త్వరలోనే ప్రపంచానికి నాయకత్వం వహించబోతోందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు. ఈ కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసి, అమలు చేయడం ద్వారా 2035 నాటికి జీడీపీలో ఏకంగా 1.2 లక్షల కోట్ల డాలర్లు (1.2 ట్రిలియన్ డాలర్లు) అదనపు వృద్ధి నమోదు కావచ్చని ఆయన అంచనా వేశారు. గత దశాబ్దంలో భారతదేశం టెలికం రంగం చాలా మారిపోయిందని ఆయన అంతర్జాతీయ 6జీ సదస్సులో తెలిపారు.
గతంలో 4జీ టెక్నాలజీ విషయంలో మనం ప్రపంచం కంటే వెనుకబడి ఉన్నామని, 5జీ విషయంలో ప్రపంచంతో సమానంగా పయనించామని మంత్రి సింధియా గుర్తు చేశారు. కానీ 6జీ విషయంలో మాత్రం భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని ఆయన స్పష్టం చేశారు. "భారత్ ఇప్పుడు కేవలం టెక్నాలజీని వినియోగించే దేశం కాదు, దానిని తయారుచేసే దేశంగా ఎదగడానికి ప్రయత్నిస్తోంది" అని ఆయన అన్నారు. ప్రభుత్వం దేశీయంగా టెక్నాలజీలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టింది.
6జీ టెక్నాలజీ కేవలం వేగవంతమైన కమ్యూనికేషన్ వరకే పరిమితం కాకుండా, మన జీవితంలోని ప్రతి రంగాన్ని మారుస్తుందని మంత్రి తెలిపారు. వ్యవసాయం, స్మార్ట్ నగరాలు, ఆరోగ్య సేవలు, విపత్తుల నిర్వహణ వంటి కీలక రంగాలపై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని ఆయన వివరించారు. ఈ లక్ష్యాన్ని వేగవంతం చేయడానికి, పరిశ్రమలు, విద్యా సంస్థలు దేశీయ ప్రమాణాలు అభివృద్ధి చేయడానికి భారత్ 6జీ అలయన్స్ కింద కలిసి పనిచేస్తున్నాయి.
6జీ పేటెంట్లలో 10 శాతం వాటా సాధించడమే తమ లక్ష్యమని సింధియా పేర్కొన్నారు. దీనితో పాటు ప్రభుత్వం శాటిలైట్ కమ్యూనికేషన్ పైనా దృష్టి సారించింది. ప్రస్తుతం 4 బిలియన్ డాలర్లుగా ఉన్న శాటిలైట్ కమ్యూనికేషన్ మార్కెట్, 2033 నాటికి మూడు రెట్లు పెరిగి 15 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఆయన అంచనా వేశారు. రాబోయే రోజుల్లో భారత్ ప్రపంచంలోనే అత్యంత పెద్ద డిజిటల్ నైపుణ్యం కలిగిన శక్తిగా మారుతుందని సింధియా ఆశాభావం వ్యక్తం చేశారు.
భారతదేశం కేవలం సేవలు అందించే దేశం కాకుండా, మాన్యుఫ్యాక్చరింగ్ చేసే దేశంగా మారుతోందని మంత్రి తెలిపారు. పీఎల్ఐ స్కీమ్ అమలు వల్ల ఇప్పటికే దాదాపు రూ.91,000 కోట్ల విలువైన కొత్త ఉత్పత్తి జరిగిందని, రూ.18,000 కోట్ల ఎగుమతులు, 30,000 కొత్త ఉద్యోగాలు సృష్టించబడిందని ఆయన వివరించారు. ఈ మార్పు ద్వారా భవిష్యత్తులో ప్రపంచం భారతదేశంపై ఆధారపడుతుందని ప్రజలు చెప్పే రోజు ఎంతో దూరంలో లేదని ఆయన అన్నారు.