Gold Price : పెరగడంలోనే కాదు తగ్గడంలో కూడా రికార్డు క్రియేట్ చేస్తున్న బంగారం.. ఇప్పుడు కొనచ్చా ?
ఇప్పుడు కొనచ్చా ?
Gold Price : గత రెండు వారాల్లో బంగారం ధరలు దాదాపు 10 శాతం తగ్గాయి. దేశీయ మార్కెట్ అయిన మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో బంగారం ధరలు అత్యధిక స్థాయి నుండి పది గ్రాములకు దాదాపు రూ. 13,000 వరకు పడిపోయాయి. ఇప్పుడు బంగారం ధరలు మరింత తగ్గుతాయా, లేక మళ్లీ పెరుగుతాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ రెండు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే, బంగారం ధరలను ప్రభావితం చేసే అంశాలు ప్రస్తుతం ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి.
ఒకవైపు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమావేశంలో వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం బంగారం ధరలకు మద్దతుగా నిలవవచ్చు. మరోవైపు, అమెరికా-చైనా మధ్య కుదిరే వాణిజ్య ఒప్పందం బంగారం ధరలు మరింత తగ్గుతాయని సూచిస్తుంది. వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గితే, సురక్షిత పెట్టుబడిగా బంగారం ఆకర్షణ తగ్గుతుంది. అయితే, బుధవారం మార్కెట్‌లో ప్రారంభంలో పతనం తర్వాత, బంగారం ధరలు వెయ్యి రూపాయలకు పైగా పెరిగాయి.
ఆగ్‌మోంట్ రీసెర్చ్ హెడ్ రేనిషా చైనామి ప్రకారం.. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం కుదిరితే బంగారం ధరలు తగ్గుతాయి. కానీ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే, తక్కువ వడ్డీ రేట్ల వాతావరణం బంగారానికి డిమాండ్‌ను పెంచుతుంది. పృథ్వీ ఫినామార్ట్ కమోడిటీ రీసెర్చ్‌కు చెందిన మనోజ్ కుమార్ జైన్ ప్రకారం.. ఫెడ్ పాలసీ, అమెరికా-చైనా పరిణామాలను బట్టి ఈ వారం బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతాయని ఆయన అంచనా వేశారు.
ప్రస్తుతం విశ్లేషకులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మరింత తగ్గుదల వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, రూ. 1,17,000 వద్ద మద్దతు లభించే అవకాశం ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఈ పతనాన్ని కొనుగోలు చేయడానికి మంచి అవకాశంగా చూడవచ్చు. అయితే ఫెడ్ నిర్ణయం, అమెరికా-చైనా శిఖరాగ్ర సమావేశంపై క్లారిటీ వచ్చే వరకు వేచి చూడాలని సలహా ఇస్తున్నారు. ప్రస్తుతానికి బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతూనే ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు తమ పొజిషన్లను కొనసాగించాలని మనోజ్ జైన్ సూచించారు.