Gold-Silver Crash : వెండి వెలవెల.. బంగారం బెంబేలు..2026 లో పసిడి మార్కెట్ అల్లకల్లోలం
2026 లో పసిడి మార్కెట్ అల్లకల్లోలం
Gold-Silver Crash : బంగారం అంటే భారతీయులకు కేవలం ఒక లోహం కాదు, అది ఒక సెంటిమెంట్.. ఒక ఆస్తి. కానీ 2026 ఏడాది మాత్రం పసిడి ప్రియులకు, సామాన్యులకు ఒక పీడకలలా మిగిలిపోయేలా ఉంది. ఇంట్లో పెళ్లి పెట్టుకుని, ఒంటిపై బంగారంతో మెరిసిపోవాలని కలలు కన్న మధ్యతరగతి కుటుంబాలకు ఈ ఏడాది రేట్ల హెచ్చుతగ్గులు చుక్కలు చూపిస్తున్నాయి. జనవరిలో ఆకాశాన్ని తాకిన ధరలు, ఫిబ్రవరిలో ఒక్కసారిగా పాతాళానికి పడిపోవడంతో మార్కెట్లో తీవ్ర గందరగోళం నెలకొంది. 2026 ఏడాది ప్రారంభం మార్కెట్లో పెను సంచలనం రేపింది. జనవరి నెలలో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 2 లక్షల మార్కును తాకింది. ఇక వెండి పరిస్థితి చెప్పక్కర్లేదు.. ఎంసీఎక్స్‌లో కిలో వెండి ధర రూ.4.20 లక్షల పైనే పలికింది. ఈ ధరలు చూసి ఇన్వెస్టర్లు ఖుషీ అయినా, సాధారణ ప్రజలు మాత్రం బెంబేలెత్తిపోయారు. అయితే, ఫిబ్రవరి వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. అంతర్జాతీయ పరిణామాల వల్ల ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో మార్కెట్లో తీవ్ర భయాందోళనలు మొదలయ్యాయి. నిన్నటి వరకు లాభాల పంట పండుతుందనుకున్న వారు, ఇప్పుడు భారీ నష్టాలను చవిచూస్తున్నారు.
వెలవెలబోతున్న జ్యువెలరీ హబ్స్
భారతదేశంలో రాజకోట్, ముంబై వంటి నగరాలు జ్యువెలరీ వ్యాపారానికి గుండెకాయ లాంటివి. కానీ ప్రస్తుత ధరల అస్థిరత వల్ల అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్థితి ఉండటంతో వ్యాపారులు కొత్త స్టాక్ తీసుకోవడానికి భయపడుతున్నారు. కేవలం కస్టమర్ ఆర్డర్ ఇచ్చి డబ్బులు కడితేనే నగలు తయారు చేస్తున్నారు. దీనివల్ల వ్యాపారం భారీగా తగ్గిపోయింది. మునుపటిలా షాపుల్లో రద్దీ కనిపించడం లేదు. ఎప్పుడు రేటు తగ్గుతుందో అని కస్టమర్లు వేచి చూస్తుంటే, నష్టం వస్తుందని వ్యాపారులు వణికిపోతున్నారు.
కళాకారుల బతుకులు బుగ్గిపాలు
ధరల హెచ్చుతగ్గుల ప్రభావం నేరుగా స్వర్ణకారుల మీద పడింది. డిమాండ్ పడిపోవడంతో వేలాది మంది కళాకారులకు పని లేకుండా పోయింది. చాలా మంది వర్క్‌షాప్‌లు మూతపడటంతో తమ సొంత ఊర్లకు తిరిగి వెళ్ళిపోతున్నారు. తరతరాలుగా వస్తున్న ఈ కళ ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. గంటల కొద్దీ కష్టపడి నగిషీలు చెక్కే చేతులు ఇప్పుడు కూలి పనులకు వెళ్లాల్సి రావడం విషాదకరం. ఇది కేవలం ఆర్థిక నష్టం మాత్రమే కాదు, భారతీయ సాంప్రదాయక కళకు కూడా ఒక పెద్ద ముప్పు.
పెళ్లిళ్లలో వెలుగు తగ్గిన పసిడి
ఒకప్పుడు పెళ్లి అంటే 30 నుంచి 40 తులాల బంగారం కొనేవారు. కానీ 2026 నాటి ధరల దెబ్బకు ఇప్పుడు 5 నుండి 10 గ్రాములతోనే సరిపెట్టుకుంటున్నారు. భారీ నగల స్థానంలో లైట్ వెయిట్ జ్యువెలరీకి డిమాండ్ పెరిగింది. చూడ్డానికి పెద్దగా కనిపించినా, బరువు తక్కువగా ఉండే డిజైన్ల కోసం జనం ఎగబడుతున్నారు. కొత్త బంగారం కొనే స్థోమత లేక చాలా కుటుంబాలు పాత నగలను కరిగించి కొత్తవి చేయించుకుంటున్నారు. దీనివల్ల మార్కెట్లోకి కొత్త డబ్బు రావడం తగ్గిపోయింది. ధరలు స్థిరంగా లేకపోవడం వల్ల పెళ్లి ఇళ్లలో సంతోషం కంటే ఆందోళనే ఎక్కువగా కనిపిస్తోంది.