Gold-Silver ETF : బంగారం, వెండి ఈటీఎఫ్‌లలో కాసుల వర్షం..5 నెలల్లోనే 3 రెట్లు పెరిగిన పెట్టుబడులు

5 నెలల్లోనే 3 రెట్లు పెరిగిన పెట్టుబడులు

Update: 2026-02-11 05:26 GMT

Gold-Silver ETF : బంగారం, వెండి అంటే భారతీయులకు ఎప్పుడూ ఇష్టమే. అయితే ఇప్పుడు జనం భౌతిక రూపంలో బంగారం కొనడమే కాకుండా, ఇన్వెస్ట్‌మెంట్ పరంగా డిజిటల్ గోల్డ్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి నిదర్శనమే గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‎లలో వెల్లువెత్తుతున్న పెట్టుబడులు. కేవలం 5 నెలల కాలంలోనే వీటి విలువ ఏకంగా మూడు రెట్లు పెరిగి 3 లక్షల కోట్ల రూపాయల మార్కును దాటేసింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, మార్కెట్లలో అనిశ్చితి నేపథ్యంలో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడి, వెండి వైపు పరుగులు తీస్తున్నారు.

రికార్డు స్థాయిలో పెరిగిన ఆస్తుల విలువ

గత ఏడాది ఆగస్టు 2025లో గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్ ల కింద ఉన్న మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.లక్ష కోట్లుగా ఉండేది. కానీ, జనవరి 2026 నాటికి ఇది ఊహించని విధంగా రూ.3 లక్షల కోట్లకు పైగా పెరిగింది. అంటే కేవలం ఐదు నెలల్లోనే 300 శాతం వృద్ధి నమోదైంది. దీనికి ప్రధాన కారణం గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఆర్థిక అనిశ్చితి. ఇలాంటి సమయంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షితంగా ఉంచుకోవడానికి బంగారం, వెండిని ఉత్తమ మార్గంగా ఎంచుకుంటున్నారు.

ఈక్విటీలను మించిన పెట్టుబడులు

సాధారణంగా భారతీయ ఇన్వెస్టర్లు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో ఎక్కువగా పెట్టుబడులు పెడతారు. కానీ జనవరి 2026లో పరిస్థితి తారుమారైంది. ఈ నెలలో గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి రూ.24,039 కోట్లు, సిల్వర్ ఈటీఎఫ్‌లలోకి రూ.9,463 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆశ్చర్యకరంగా, ఈక్విటీ ఫండ్లలో వచ్చిన పెట్టుబడులు (రూ. 24,029 కోట్లు) గోల్డ్ ఈటీఎఫ్ కంటే తక్కువగా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఇన్వెస్టర్లు ప్రస్తుతానికి స్టాక్ మార్కెట్ కంటే బంగారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అర్థమవుతోంది.

పెరిగిన ఫోలియోల సంఖ్య

పెట్టుబడిదారుల భాగస్వామ్యం ఎంత పెరిగిందో ఫోలియోల సంఖ్యను చూస్తే తెలుస్తుంది. గోల్డ్ ఈటీఎఫ్ ఫోలియోల సంఖ్య 80 లక్షల నుంచి 1.14 కోట్లకు (43% వృద్ధి) చేరగా, వెండి ఈటీఎఫ్ ఫోలియోలు ఏకంగా 11 లక్షల నుంచి 47 లక్షలకు పైగా పెరిగాయి. అంటే వెండిలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య 323 శాతం పెరిగింది. వెండిని ఒక సురక్షిత పెట్టుబడిగా మాత్రమే కాకుండా, పారిశ్రామికంగా కూడా డిమాండ్ ఉండటంతో ఇన్వెస్టర్లు దీనిపై ఆసక్తి చూపుతున్నారు.

నిపుణుల హెచ్చరిక

ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ సీఈఓ అజయ్ గార్గ్ అభిప్రాయం ప్రకారం.. గోల్డ్-సిల్వర్ లో పెట్టుబడులు పెరగడం అంటే స్టాక్ మార్కెట్ కుప్పకూలుతుందని కాదు. ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోను సమతుల్యం చేసుకోవడానికి కొంత భాగాన్ని సురక్షితమైన అసెట్స్ లోకి మళ్లిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే, ఏ ఒక్క దానిపైనే అతిగా ఆధారపడకుండా, పోర్ట్‌ఫోలియోలో బంగారానికి 10 నుంచి 15 శాతం మాత్రమే కేటాయించడం క్షేమమని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News