EPF ఖాతాదారులకు గుడ్‌న్యూస్? ఇకపై మొత్తం డబ్బు తీసుకోవచ్చు!
ఇకపై మొత్తం డబ్బు తీసుకోవచ్చు!;
EPF: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల భవిష్య నిధి నిబంధనలను మార్చేందుకు సిద్ధమవుతోంది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి EPF ఖాతాదారులు తమ జమా చేసిన డబ్బులో ఎక్కువ భాగాన్ని లేదా మొత్తాన్ని విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించే ప్రతిపాదనపై ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పు వస్తే, పదవీ విరమణ వరకు వేచి చూడాల్సిన అవసరం ఉండదు.
ప్రస్తుతం, EPF డబ్బు మొత్తాన్ని రెండు సందర్భాల్లో మాత్రమే తీసుకోవచ్చు. పదవీ విరమణ (58 సంవత్సరాలు) చేసినప్పుడు, రెండు నెలల కంటే ఎక్కువ కాలం నిరుద్యోగిగా ఉన్నప్పుడు మాత్రమే విత్ డ్రా చేసుకోవచ్చు. ఇవి కాకుండా, ఇల్లు కొనడం, వైద్య ఖర్చులు, పెళ్లి లేదా పిల్లల చదువు వంటి కొన్ని ప్రత్యేక అవసరాల కోసం మాత్రమే కొంత మొత్తాన్ని తీసుకోవడానికి అనుమతి ఉంది. అయితే, కొత్త ప్రతిపాదనతో ఈ నియమాలను సడలించే అవకాశం ఉంది. 30 లేదా 40 ఏళ్ల వయసులో కూడా EPF డబ్బు తీసుకోవచ్చు. అయితే, ప్రభుత్వం మొత్తం మొత్తానికి బదులుగా 60శాతం వరకు విత్ డ్రా పరిమితిని విధించే అవకాశం ఉందని ఒక ప్రభుత్వ అధికారి తెలిపారు.
EPF నిబంధనలను సడలించడం ద్వారా ఖాతాదారులు తమ డబ్బును తమ అవసరాలకు అనుగుణంగా వాడుకునే స్వేచ్ఛను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి డబ్బు తీసుకునే అవకాశం ఇవ్వాలనే ఆలోచన దీనిలో భాగమే. కొంతమంది నిపుణులు ఈ మార్పు పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. EPF ప్రధాన ఉద్దేశ్యం పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించడమేనని, తరచుగా డబ్బు తీసుకోవడానికి అనుమతిస్తే ప్రజలు భవిష్యత్తు కోసం పొదుపు చేయడాన్ని తగ్గించుకోవచ్చని వారు అంటున్నారు.
అయితే, మరికొందరు నిపుణులు ఇది రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో పెట్టుబడులను పెంచి, ఆర్థిక వ్యవస్థకు లాభం చేకూరుస్తుందని భావిస్తున్నారు. కానీ, తరచుగా డబ్బు తీసుకోవడం వల్ల పదవీ విరమణ పొదుపులు తగ్గిపోతాయనే ఆందోళన వారిలోనూ ఉంది. ఎక్కువ మంది డబ్బు తీసుకోవడానికి ముందుకు వస్తే EPFO ఐటీ సిస్టమ్ పై భారం పడుతుందని నిపుణులు హెచ్చరించారు. ప్రస్తుత సిస్టమ్ అన్ని అభ్యర్థనలను నిర్వహించడానికి సిద్ధంగా లేదని, ఒకవేళ సిస్టమ్‌లో సమస్యలు వస్తే మోసాలు పెరిగే ప్రమాదం ఉందని వారు తెలిపారు.
EPFO ఇటీవల కొన్ని నిబంధనలను సడలించింది. జూలై 2025 నుండి ఖాతాదారులు ఇల్లు కట్టుకోవడానికి లేదా స్థలం కొనడానికి తమ EPF డబ్బులో 90శాతం వరకు తీసుకోవచ్చు. గతంలో దీనికి 5 సంవత్సరాల కంట్రిబ్యూషన్ అవసరం కాగా, ఇప్పుడు అది 3 సంవత్సరాలకు తగ్గించబడింది. అలాగే, ఆటో-సెటిల్‌మెంట్ పరిమితిని లక్ష నుండి 5 లక్షలకు పెంచారు, దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో డబ్బు తీసుకోవచ్చు.