Joint Accounts : ఉమ్మడి ఖాతా.. ఉచ్చులో పడకండి.. సంతకం చేసే ముందు ఇవి తెలుసుకోండి

సంతకం చేసే ముందు ఇవి తెలుసుకోండి

Update: 2026-02-18 05:22 GMT

Joint Accounts : బ్యాంకులో జాయింట్ అకౌంట్ ఉండటం అనేది వినడానికి చాలా బాగుంటుంది. భార్యాభర్తలు, తల్లిదండ్రులు-పిల్లలు లేదా బిజినెస్ పార్ట్‌నర్లు కలిసి లావాదేవీలు జరుపుకోవడానికి ఇది ఎంతో సౌకర్యంగా అనిపిస్తుంది. అయితే నాణేనికి రెండో పార్శ్వం ఉన్నట్టే, ఈ ఉమ్మడి ఖాతాల్లోనూ కొన్ని చిక్కులు ఉన్నాయి. బ్యాంకులు సాధారణంగా ఫారమ్ నింపేటప్పుడు మీకు చెప్పని కొన్ని ముఖ్యమైన అంశాలు, జాయింట్ అకౌంట్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఆపరేటింగ్ మోడ్

జాయింట్ అకౌంట్ తెరిచేటప్పుడు బ్యాంక్ మిమ్మల్ని ఆపరేటింగ్ మోడ్ గురించి అడుగుతుంది. చాలా మంది దీనిని కేవలం ఒక ఫార్మాలిటీగా భావిస్తారు. కానీ ఇక్కడే అసలు కథ ఉంటుంది. ఐదర్ ఆర్ సర్వైవర్ అంటే ఇద్దరిలో ఎవరైనా స్వతంత్రంగా డబ్బులు డ్రా చేయవచ్చు. ఇది సౌకర్యంగా ఉన్నప్పటికీ, మీ పార్ట్‌నర్ మీకు తెలియకుండానే మొత్తం డబ్బును ఖాళీ చేసే ప్రమాదం కూడా ఉంది. అదే జాయింట్లీ అని పెడితే, ఏ చిన్న లావాదేవీకైనా ఇద్దరి సంతకాలు తప్పనిసరి. ఇది భద్రతను ఇస్తుంది కానీ, అత్యవసర సమయాల్లో ఇబ్బంది కలిగిస్తుంది.

బాధ్యత ఇద్దరిదీ.. శిక్ష కూడా ఇద్దరికే

ఉమ్మడి ఖాతాలో లాభాలే కాదు, నష్టాలు కూడా ఇద్దరికీ సమానంగా వర్తిస్తాయి. ఖాతాకు సంబంధించి ఏదైనా లోన్ బకాయిలు ఉన్నా, చెక్ బౌన్స్ అయినా లేదా ఓవర్ డ్రాఫ్ట్ సమస్యలు తలెత్తినా బ్యాంక్ ఇద్దరినీ బాధ్యులను చేస్తుంది. డబ్బును ఎవరు వాడారు అనే దానితో సంబంధం లేకుండా ఇద్దరి క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది. ఒకరి పొరపాటు వల్ల మరొకరి ఆర్థిక ప్రతిష్ట మసకబారే అవకాశం ఇక్కడ పుష్కలంగా ఉంది.

ట్యాక్స్, వారసత్వ చిక్కులు

జాయింట్ అకౌంట్ అంటే డబ్బు మీద ఇద్దరికీ సమాన హక్కు ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ ఆదాయపు పన్ను శాఖ దృష్టిలో ఇది వేరు. ఖాతాలో జమ చేసిన డబ్బుపై వచ్చే వడ్డీకి, ఆ డబ్బును ఎవరు సంపాదించి వేశారో వారే పన్ను కట్టాల్సి ఉంటుంది. అలాగే, వారసత్వ విషయానికి వస్తే, ఖాతాలో సర్వైవర్ పేరు ఉన్నంత మాత్రాన చట్టబద్ధమైన వారసుల హక్కులు పోవు. కొన్నిసార్లు ఇతర కుటుంబ సభ్యులు చట్టపరంగా ఆ డబ్బుపై దావా వేసే అవకాశం ఉంటుంది.

ఖాతా క్లోజ్ చేయడం అంత ఈజీ కాదు

వ్యక్తిగత లేదా వ్యాపార సంబంధాల్లో తేడాలు వచ్చినప్పుడు జాయింట్ అకౌంట్‌ను మూసివేయడం పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఖాతా మూసివేయాలన్నా లేదా ఒకరి పేరు తొలగించాలన్నా ఇద్దరి అంగీకారం తప్పనిసరి. ఒకవేళ ఇద్దరి మధ్య గొడవలు జరిగి ఒకరు సంతకం చేయకపోతే, ఆ వివాదం తేలే వరకు బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేస్తుంది. దీనివల్ల అత్యవసర అవసరాలకు డబ్బు అందక ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే అన్ని పొదుపులను జాయింట్ అకౌంట్‌లో పెట్టకుండా, కొంత వ్యక్తిగత స్వేచ్ఛను ఉంచుకోవడం ఎప్పుడూ ఉత్తమం.

Tags:    

Similar News