Gas Cylinder : సామాన్యులకు గుడ్ న్యూస్.. వరుసగా ఐదో నెల తగ్గిన సిలిండర్ ధరలు
వరుసగా ఐదో నెల తగ్గిన సిలిండర్ ధరలు;
Gas Cylinder : ఆగస్టు నెల తొలిరోజున గ్యాస్ సిలిండర్ వాడేవారికి గుడ్ న్యూస్. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు వరుసగా ఐదోసారి తగ్గాయి. ఈసారి ఒక్కో సిలిండర్‌పై సగటున రూ.34 తగ్గింది. ఈ ధరల తగ్గుదల మార్చి నెల నుంచి మొదలైంది. ఇప్పటివరకు కమర్షియల్ సిలిండర్ ధరలు రూ.170కి పైగా తగ్గాయి. అయితే, ఇంటి అవసరాలకు వాడే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. చివరిసారిగా ఏప్రిల్ 8న దీని ధర రూ.50 పెరిగింది. ఈ ధరల తగ్గుదలకు ముఖ్య కారణం అంతర్జాతీయ మార్కెట్‌లో సహజ వాయువు ధరలు తగ్గడం. దీనివల్ల చమురు కంపెనీలకు ఖర్చులు తగ్గుతాయి. ఈ మార్పుల వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వ్యాపార సంస్థలకు చాలా ఉపశమనం లభించింది.
ఐఓసీఎల్ విడుదల చేసిన కొత్త ధరల ప్రకారం, దేశంలోని ముఖ్య నగరాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు ఇలా ఉన్నాయి:
ఢిల్లీ: రూ.33.5 తగ్గి, ఇప్పుడు ధర రూ.1,631.50.
ముంబై: రూ.34 తగ్గి, ధర రూ1,582.50.
కోల్‌కతా: రూ.34.5 తగ్గి, ధర రూ.1,734.50.
చెన్నై: రూ.34.5 తగ్గి, ధర రూ.1,789.
హైదరాబాద్: రూ.34.5 తగ్గి, ఇప్పుడు ఒక సిలిండర్ ధర రూ.1,852కి చేరింది.
ఐదు నెలల్లో భారీగా తగ్గిన ధరలు
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు వరుసగా తగ్గుతున్నందున, గత ఐదు నెలల్లో ధరలలో పెద్ద తేడా వచ్చింది. ఢిల్లీలో ఈ ఐదు నెలల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర మొత్తం మీద రూ.171.5 తగ్గింది. కోల్‌కతాలో రూ.178.5, ముంబైలో రూ.173, చెన్నైలో రూ.176 తగ్గింది.
వంట గదిలో వాడే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలలో మాత్రం ఏప్రిల్ తర్వాత ఎలాంటి మార్పు లేదు. చివరిసారిగా ఏప్రిల్ 8న దీని ధర రూ.50 పెరిగింది. ప్రస్తుతం ప్రధాన నగరాల్లో డొమెస్టిక్ గ్యాస్ ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో రూ. 853, కోల్‌కతాలో రూ.879, ముంబైలో రూ.852.50, చెన్నైలో రూ. 868.50, హైదరాబాద్లో రూ. 905. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గుతున్నందున, త్వరలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.