ITR Refund : ఇంకా ఐటీ రిఫండ్ రాలేదా? మీ ఖాతాలో డబ్బులు పడకపోవడానికి అసలు కారణాలు ఇవే
మీ ఖాతాలో డబ్బులు పడకపోవడానికి అసలు కారణాలు ఇవే
ITR Refund : ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి నెలలు గడుస్తున్నా.. ఇంకా మీ బ్యాంక్ ఖాతాలో రిఫండ్ డబ్బులు పడలేదా? అయితే మీరు ఒక్కరే కాదు, దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఇదే సమస్యతో ఎదురుచూస్తున్నారు. సాఫ్ట్‌వేర్ సమస్యల వల్లనో లేదా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకనో ఆలస్యం అవుతోందని అనుకుంటే పొరపాటే. ఆదాయపు పన్ను శాఖ ఈసారి నిబంధనలను చాలా కఠినతరం చేసింది. మీ రిఫండ్ ఎందుకు ఆగిపోయిందో క్లియర్ గా తెలుసుకుందాం.
చాలామంది పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ ఫైల్ చేయగానే తమ పని అయిపోయిందని, ఇక డబ్బులు అవే వస్తాయని భావిస్తారు. కానీ, ఐటీఆర్ ఫైల్ చేయడం అనేది కేవలం మొదటి మెట్టు మాత్రమే. మీరు ఫైల్ చేసిన రిటర్న్స్‌ను ఆదాయపు పన్ను శాఖ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. మీరు ఇచ్చిన సమాచారం, వారి దగ్గర ఉన్న రికార్డులు సరిపోలితేనే ప్రాసెసింగ్ పూర్తవుతుంది. ఈ ప్రాసెసింగ్ దశలో ఏదైనా తేడా కనిపిస్తే, మీ ఫైల్ అక్కడే ఆగిపోతుంది. ఫలితంగా రిఫండ్ రావడానికి నెలల సమయం పడుతుంది.
ఈ ఏడాది ఆదాయపు పన్ను శాఖ ముఖ్యంగా ఒక విషయంలో చాలా సీరియస్‌గా ఉంది. మీ ఐటీఆర్ లో మీరు చూపించిన ఆదాయానికి, మీ పాన్ కార్డ్ ద్వారా నమోదైన ఇతర లావాదేవీలకు ఏమాత్రం తేడా ఉన్నా రిఫండ్ ఆపేస్తున్నారు. ఐటీ శాఖ మీ వివరాలను Form 26AS, AIS , TIS లతో సరిపోల్చి చూస్తుంది. ఉదాహరణకు మీరు షేర్ మార్కెట్ లాభాలు లేదా బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీని ఐటీఆర్ లో చూపించకపోయి ఉంటే, అది AIS లో కనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో మీ ఆదాయం మిస్ మ్యాచ్ అయినట్లు పరిగణించి రిఫండ్ ఆపేస్తారు.
మీరు రిటర్న్స్ ఫైల్ చేసినా, దానిని 30 రోజులలోపు ఈ-వెరిఫై చేయకపోతే మీరు వేసిన రిటర్న్ అసలు చెల్లుబాటు కాదు. అంటే మీరు ఐటీఆర్ వేయలేదనే అర్థం. ఆధార్ ఓటీపీ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. చాలామంది ఫైలింగ్ తోనే పని అయిపోయిందని అనుకుని వెరిఫికేషన్ మర్చిపోతారు. ఇలాంటి వారికి రిఫండ్ రాదు సదా కదా, చివరికి పెనాల్టీలు కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే పోర్టల్ లో లాగిన్ అయ్యి మీ వెరిఫికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి.
రిఫండ్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలోకే నేరుగా వస్తాయి. కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ తప్పుల్లేకుండా ఉండాలి. వీటన్నింటికంటే ముఖ్యంగా, మీ బ్యాంక్ ఖాతా ఇన్కమ్ టాక్స్ పోర్టల్ లో వాలిడేట్ అయ్యి ఉండాలి. ఒకవేళ మీ ఖాతాలో పేరు, పాన్ కార్డులో పేరు చిన్న తేడా ఉన్నా వాలిడేషన్ ఫెయిల్ అవుతుంది. అలాగే మీ బ్యాంక్ ఖాతాకు పాన్ లింక్ అయ్యి ఉండటం తప్పనిసరి. ఇవన్నీ సవ్యంగా ఉంటేనే మీ ఖాతాలోకి డబ్బులు జమ అవుతాయి.
మీకు రిఫండ్ రావాల్సి ఉన్నా, గతంలో మీరు ఏదైనా టాక్స్ బాకీ పడి ఉంటే.. ఆదాయపు పన్ను శాఖ ఆ రిఫండ్ నుంచి పాత బాకీని కట్ చేసుకుంటుంది. సెక్షన్ 143(1) కింద మీకు ఈ సమాచారం మెయిల్ ద్వారా వస్తుంది. ఈ ప్రాసెస్ వల్ల కూడా రిఫండ్ ఆలస్యం అవ్వవచ్చు. కాబట్టి మీకు ఇంకా రిఫండ్ రాకపోతే, ముందుగా ఐటీ పోర్టల్ లో లాగిన్ అయ్యి మీ స్టేటస్ ఏమిటో చూడండి. ఏవైనా తప్పులు ఉంటే రివైజ్డ్ రిటర్న్ దాఖలు చేయడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు.