IRCTC New Rules : రైల్వే టికెట్ బుకింగ్‌లో భారీ మార్పు.. నేటి నుండే కొత్త రూల్స్ అమలు
నేటి నుండే కొత్త రూల్స్ అమలు
IRCTC New Rules : మీరు రైలు ప్రయాణం ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ కొత్త రూల్ తెలుసుకోకపోతే మీకు సీటు దొరకడం కష్టమే, ఐఆర్‌సీటీసీ తన వెబ్‌సైట్, యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికుల కోసం సరికొత్త నిబంధనను తీసుకువచ్చింది. దీని ప్రకారం తమ ఐఆర్‌సీటీసీ అకౌంట్‌ను ఆధార్ కార్డుతో లింక్ చేసుకున్న వారికి మాత్రమే ఇకపై ప్రాధాన్యత లభిస్తుంది. ముఖ్యంగా అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ ప్రారంభమయ్యే మొదటి రోజున టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి. సాధారణ ప్రయాణికులకు సీట్లు దక్కకుండా చేస్తున్న దళారులకు చెక్ పెట్టడమే రైల్వే శాఖ ప్రధాన ఉద్దేశ్యం.
సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధన ప్రకారం.. ఆధార్ వెరిఫైడ్ యూజర్లకు రైల్వే శాఖ వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తోంది. గతంలో టికెట్ బుకింగ్ ఓపెన్ అయిన కొద్ది నిమిషాల్లోనే సీట్లు అయిపోయేవి. కానీ ఇప్పుడు ఆధార్ వెరిఫైడ్ యూజర్లు బుకింగ్ ప్రారంభమైన రోజున అర్థరాత్రి వరకు ఎప్పుడైనా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అంటే సర్వర్ బిజీగా ఉన్నా లేదా ఉదయం పూట ఖాళీ లేకపోయినా.. వెరిఫైడ్ యూజర్లకు ప్రత్యేక సమయాన్ని కేటాయించారు. ఇది సామాన్య ప్రయాణికులకు ఒక రకమైన బంపర్ ఆఫర్ అని చెప్పాలి.
రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాన్ని స్పష్టం చేసింది. సాధారణంగా టికెట్ బుకింగ్ ఓపెన్ అవ్వగానే దళారులు, సాఫ్ట్‌వేర్ ఏజెంట్లు సెకన్ల వ్యవధిలో సీట్లను బ్లాక్ చేసేవారు. దీనివల్ల సామాన్యులకు వెయిటింగ్ లిస్ట్ తప్ప ఏమీ మిగిలేది కాదు. ఇప్పుడు ఆధార్ వెరిఫికేషన్ ఉండటం వల్ల టికెట్ బుక్ చేసే వ్యక్తి అసలైన ప్రయాణికుడా కాదా అనేది ఈజీగా తెలిసిపోతుంది. కేవలం ఆన్‌లైన్ యూజర్లకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. రైల్వే స్టేషన్‌లోని కౌంటర్లలో టికెట్లు తీసుకునే వారికి పాత పద్ధతే కొనసాగుతుంది.
తొలుత బుకింగ్ ప్రారంభమైన మొదటి 15 నిమిషాలకే ఆధార్ వెరిఫికేషన్ పరిమితం చేశారు. ఆ తర్వాత డిసెంబర్ 29 నుంచి దీనిని మధ్యాహ్నం 12 గంటల వరకు పొడిగించారు. జనవరి 5న ఈ సమయాన్ని సాయంత్రం 4 గంటల వరకు పెంచిన రైల్వే శాఖ.. నేటి నుంచి అంటే జనవరి 12 నుంచి పూర్తిగా అర్థరాత్రి వరకు బుక్ చేసుకునే వెసులుబాటును కేవలం ఆధార్ వెరిఫైడ్ యూజర్లకు మాత్రమే కల్పించింది. కాబట్టి మీరు కూడా కన్ఫర్మ్ సీటు కావాలనుకుంటే వెంటనే మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేసుకోవడం మర్చిపోకండి.