Rs.500 Note Ban : మళ్ళీ నోట్ల రద్దు? రూ.500 నోట్లు బ్యాన్ చేస్తున్నారా?

రూ.500 నోట్లు బ్యాన్ చేస్తున్నారా?

Update: 2026-01-20 05:12 GMT

Rs.500 Note Ban : దేశంలో మరోసారి నోట్ల రద్దు ప్రకంపనలు మొదలయ్యాయా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం కలిసి రూ.500 నోట్లను చెలామణి నుంచి రద్దు చేయబోతున్నాయా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను చూస్తుంటే సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పదేళ్ల క్రితం జరిగిన డీమోనిటైజేషన్ కష్టాలను గుర్తుచేసుకుంటూ జనం ఆందోళన చెందుతున్నారు. అయితే, ఈ గందరగోళానికి తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. అసలు రూ. 500 నోట్ల భవిష్యత్తు ఏంటి? ప్రభుత్వం ఏం చెప్పింది? అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.

గత కొద్ది రోజులుగా వాట్సాప్, ఫేస్‌బుక్, ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికల్లో ఒక వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది. కేంద్ర ప్రభుత్వం దేశంలో డీమోనిటైజేషన్ 2.0కి సిద్ధమవుతోందని, అందులో భాగంగా రూ.500 నోట్లను పూర్తిగా రద్దు చేయబోతోందని ఆ వార్తల సారాంశం. ఇకపై దేశంలో అతిపెద్ద నోటుగా కేవలం రూ.100 మాత్రమే ఉంటుందని, పెద్ద నోట్ల ద్వారా జరుగుతున్న నల్లధనం అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ప్రచారం జరుగుతోంది. 2016 నాటి నోట్ల రద్దు అనుభవాల దృష్ట్యా, ఈ వార్త వినగానే సామాన్యుల్లో కలవరం మొదలైంది.

ఈ తప్పుడు ప్రచారాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారిక సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో రంగంలోకి దిగింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ పచ్చి అబద్ధం అని తేల్చి చెప్పింది. రూ.500 నోట్లను రద్దు చేసే ఉద్దేశం ప్రస్తుతానికి ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ.. "కేంద్ర ప్రభుత్వం రూ.500 నోట్లను నిషేధించబోతోందని జరుగుతున్న ప్రచారం పూర్తిగా నకిలీది. అటువంటి ప్రకటన ఏదీ ప్రభుత్వం చేయలేదు" అని చెప్పింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా స్క్రీన్ షాట్‌లను క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారని హెచ్చరించింది.

ప్రభుత్వ విధానాలు లేదా ఆర్థిక పరమైన నిర్ణయాల గురించి తెలుసుకోవాలంటే కేవలం అధికారిక వెబ్‌సైట్లు లేదా నమ్మకమైన వార్తా సంస్థలనే అనుసరించాలని పిఐబి విజ్ఞప్తి చేసింది. ఆర్థిక వ్యవస్థలో అస్థిరతను సృష్టించడానికి, ప్రభుత్వంపై తప్పుడు అభిప్రాయాన్ని కల్పించడానికి కొందరు కావాలనే ఇలాంటి వదంతులను సృష్టిస్తున్నారని పేర్కొంది. బ్యాంకింగ్ నిబంధనల్లో కానీ, కరెన్సీ చెలామణిలో కానీ ఎటువంటి అత్యవసర మార్పులు లేవని, ప్రజలు తమ దగ్గరున్న రూ.500 నోట్ల గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది.

2016లో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసినప్పుడు ప్రజలు బ్యాంకుల వద్ద క్యూలు కట్టిన దృశ్యాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఆ తర్వాత రూ.2000 నోటును కూడా ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఏ వార్త వచ్చినా జనం భయపడుతున్నారు. అయితే ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ డిజిటల్ చెల్లింపుల దిశగా వేగంగా దూసుకుపోతోంది. ఇలాంటి సమయంలో కరెన్సీ నోట్ల రద్దు అనేది ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. అందుకే ప్రభుత్వం కూడా ప్రస్తుతానికి అటువంటి సాహసోపేత నిర్ణయాల జోలికి వెళ్లడం లేదని అర్థమవుతోంది.

Tags:    

Similar News