Home Loan : రిటైర్మెంట్ తర్వాత హోమ్ లోన్ కావాలా? 60 ఏళ్లు దాటినా లోన్ పొందే ఛాన్స్.. పెన్షనర్ల కోసం అదిరిపోయే టిప్స్

60 ఏళ్లు దాటినా లోన్ పొందే ఛాన్స్.. పెన్షనర్ల కోసం అదిరిపోయే టిప్స్

Update: 2026-03-31 10:36 GMT

Home Loan : రిటైర్మెంట్ తర్వాత సొంత ఇల్లు కట్టుకోవాలనే కల చాలా మందికి ఉంటుంది. అయితే, 60 ఏళ్లు దాటిన తర్వాత, పెన్షన్ మీద ఆధారపడే వారికి హోమ్ లోన్ రావడం కాస్త కష్టమైన పని అనిపిస్తుంది. బ్యాంకులు కూడా వయస్సు, ఆరోగ్య పరిస్థితులు, లోన్ తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రుణాలు ఇవ్వడానికి వెనకాడుతుంటాయి. కానీ, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పెన్షనర్లు కూడా సులభంగా హోమ్ లోన్ పొందవచ్చు.

పెన్షనర్లకు లోన్ రావడం ఎందుకు కష్టం?

సాధారణంగా బ్యాంకులు లోన్ ఇచ్చేటప్పుడు సదరు వ్యక్తికి వచ్చే నెలవారీ ఆదాయాన్ని ప్రధానంగా చూస్తాయి. రిటైర్ అయిన వారికి వచ్చే పెన్షన్ అనేది జీతం కంటే తక్కువగా ఉండటం, అలాగే వయస్సు రీత్యా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో బ్యాంకులు రిస్క్ తీసుకోవడానికి భయపడతాయి. అయితే, మీ క్రెడిట్ హిస్టరీ బాగుండి, మీరు క్రమశిక్షణతో ఆర్థిక వ్యవహారాలు నిర్వహిస్తే లోన్ పొందే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

క్రెడిట్ స్కోర్ ఎందుకు ముఖ్యం?

వయస్సు పైబడిన వారికి క్రెడిట్ స్కోర్ అనేది ఒక సర్టిఫికెట్ లాంటిది. మీరు గతంలో తీసుకున్న అప్పులను ఎంత బాధ్యతగా చెల్లించారో ఇది తెలియజేస్తుంది. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే బ్యాంకులు మీకు లోన్ ఇవ్వడానికి మొగ్గు చూపుతాయి. అంతేకాకుండా, తక్కువ వడ్డీ రేటును పొందడానికి, లోన్ నిబంధనల విషయంలో బ్యాంకుతో బేరమాడటానికి కూడా ఇది సహాయపడుతుంది.

పెన్షనర్లు లోన్ పొందడానికి 5 సులభమైన మార్గాలు

పెద్ద అప్పులను ముందే తీర్చేయండి: హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసే ముందే మీపై ఉన్న ఇతర చిన్న లేదా పెద్ద అప్పులను క్లియర్ చేయండి. దీనివల్ల మీ ఆర్థిక ప్రొఫైల్ బలంగా మారుతుంది.

క్రమం తప్పకుండా ఈఎంఐ చెల్లించండి: మీ క్రెడిట్ కార్డు బిల్లులు లేదా మరేదైనా ఇన్‌స్టాల్‌మెంట్లు ఉంటే వాటిని నిర్ణీత సమయం కంటే ముందే చెల్లించండి. ఒక్క నెల ఆలస్యమైనా అది మీ స్కోర్‌ను దెబ్బతీస్తుంది.

జాయింట్ హోమ్ లోన్ తీసుకోండి: ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గం. మీ కొడుకు లేదా కూతురుని కో-అప్లికెంట్‌గా చేర్చుకోండి. వారి వయస్సు తక్కువగా ఉండి, క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటే లోన్ ఆమోదం పొందే అవకాశాలు 100 శాతం పెరుగుతాయి.

అన్ని బ్యాంకుల్లో దరఖాస్తు చేయకండి: ఒకేసారి నాలుగైదు బ్యాంకుల్లో లోన్ కోసం అప్లై చేయకండి. మీరు ప్రతిచోటా అడుగుతున్నారంటే మీకు డబ్బు అవసరం ఎక్కువగా ఉందని బ్యాంకులు భావించి మీ అప్లికేషన్‌ను తిరస్కరించే ప్రమాదం ఉంది.

తక్కువ కాలపరిమితిని ఎంచుకోండి: 20 లేదా 30 ఏళ్ల కాలపరిమితి కాకుండా, 10 ఏళ్ల లోపు లోన్ తీర్చుకునేలా ప్లాన్ చేసుకోండి. ఈఎంఐ కాస్త ఎక్కువగా ఉన్నా, బ్యాంకుల రిస్క్ తగ్గుతుంది కాబట్టి లోన్ త్వరగా మంజూరవుతుంది.

నిపుణుల మాట

బేసిక్ హోమ్ లోన్ సీఈఓ అతుల్ మోంగా అభిప్రాయం ప్రకారం... సీనియర్ సిటిజన్లు తమ క్రెడిట్ ప్రొఫైల్‌ను మెరుగుపరుచుకోవడం ద్వారా అసాధ్యం అనుకున్న హోమ్ లోన్‌ను సులభంగా సాధించవచ్చు. యువ భాగస్వామితో కలిసి లోన్ తీసుకోవడం వల్ల రీపేమెంట్ గ్యారెంటీ పెరుగుతుందని, తద్వారా బ్యాంకులు నిశ్చింతగా రుణాలు ఇస్తాయని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News