TDS Rules : వడ్డీ మీద ఆశ పడితే.. టీడీఎస్ మీద కోత పడుతుంది భయ్యా.. ఐటీ శాఖ రూల్స్ మామూలుగా లేవు
ఐటీ శాఖ రూల్స్ మామూలుగా లేవు
TDS Rules : బ్యాంకులో లేదా పోస్టాఫీసులో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసే వారికి ఆదాయపు పన్ను శాఖ కీలక సమాచారాన్ని అందించింది. డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం ఒక పరిమితి దాటితే బ్యాంకులు కచ్చితంగా టీడీఎస్ (టాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) కోత విధిస్తాయని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి బ్యాంకింగ్ కంపెనీ నిర్వచనంపై నెలకొన్న సందిగ్ధతను తొలగిస్తూ ఐటీ శాఖ సోమవారం అధికారికంగా వివరణ ఇచ్చింది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో మీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా సేవింగ్స్ ఖాతాల ద్వారా వచ్చే వడ్డీ ఆదాయం నిర్దేశించిన పరిమితిని దాటితే బ్యాంకులు టీడీఎస్ కోస్తాయి. సాధారణ పౌరులకు ఈ పరిమితి రూ.50,000గా ఉంది. అదే సీనియర్ సిటిజన్లకు (60 ఏళ్లు దాటిన వారికి) మాత్రం ఈ పరిమితి రూ.1,00,000 వరకు ఉంటుంది. అంటే ఈ మొత్తాల కంటే తక్కువ వడ్డీ వచ్చే వారిపై ఎలాంటి టీడీఎస్ కోత ఉండదు. ఈ నిబంధనలు బ్యాంకులు, పోస్టాఫీసులకు సమానంగా వర్తిస్తాయి.
బ్యాంకింగ్ కంపెనీ అంటే ఎవరు?
కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025లోని సెక్షన్ 402 ప్రకారం బ్యాంకింగ్ కంపెనీ అంటే ఎవరో ఆదాయపు పన్ను శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X ద్వారా క్లారిటీ ఇచ్చింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 పరిధిలోకి వచ్చే ప్రతి బ్యాంకు లేదా బ్యాంకింగ్ సంస్థ ఈ పరిధిలోకి వస్తుందని తెలిపింది. కొన్ని సంస్థల పేర్లు స్పష్టంగా చట్టంలో పేర్కొనకపోయినా, అవి బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తుంటే ఈ నిబంధనలు పాటించాల్సిందేనని ఐటీ శాఖ తేల్చి చెప్పింది. తద్వారా టీడీఎస్ అమలులో ఎక్కడా గందరగోళానికి తావులేకుండా చేసింది.
నిబంధనల మినహాయింపు
సెక్షన్ 393(1) కింద నిర్దేశించిన పరిమితి (సాధారణ పౌరులకు రూ.50 వేలు, సీనియర్లకు రూ.లక్ష) కంటే తక్కువ వడ్డీ వచ్చే ఖాతాదారులకు ఆదాయపు పన్ను కోత నుంచి మినహాయింపు ఉంటుంది. బ్యాంకులు లేదా బ్యాంకింగ్ సంస్థలు ఈ తక్కువ మొత్తంపై టీడీఎస్ కట్ చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, మీ ఆదాయం పన్ను పరిధిలోకి రాకపోయినా, వడ్డీ మాత్రం ఈ పరిమితి దాటితే.. టీడీఎస్ కట్ కాకుండా ఉండటానికి మీరు సకాలంలో ఫామ్ 15G లేదా ఫామ్ 15H (సీనియర్ సిటిజన్లు) బ్యాంకులో సమర్పించాల్సి ఉంటుంది.
సామాన్యులకు కలిగే ప్రయోజనం
ప్రభుత్వం ఇచ్చిన ఈ స్పష్టత వల్ల ఖాతాదారులకు తమ వడ్డీ ఆదాయంపై పన్ను ఎంత పడుతుందో ముందే అంచనా వేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రిటైర్డ్ వ్యక్తులు తమ పొదుపు మొత్తాల ద్వారా వచ్చే ఆదాయంపై ఆధారపడతారు కాబట్టి, వారికి రూ. లక్ష వరకు టీడీఎస్ మినహాయింపు ఉండటం పెద్ద ఊరట. బ్యాంకులు కూడా నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, చట్టంలో పేరు లేదనే సాకుతో టీడీఎస్ నిబంధనలను అతిక్రమించకూడదని ఐటీ శాఖ గట్టిగా హెచ్చరించింది.