Income Tax Refund Fraud : టాక్స్ పేయర్లకు అలర్ట్..రిఫండ్ పేరుతో కొత్త స్కామ్..ఒక్క క్లిక్‌తో ఖాతా ఖాళీ

ఒక్క క్లిక్‌తో ఖాతా ఖాళీ

Update: 2026-02-21 06:13 GMT

 Income Tax Refund Fraud : ఇన్కమ్ టాక్స్ రిఫండ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పన్ను చెల్లింపుదారుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రిఫండ్ రావడంలో ఆలస్యం అవుతోందన్న సాకుతో కొత్త రకం మోసాలకు తెరలేపారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులమంటూ ఫోన్లు చేస్తూ, మెసేజ్‌లు పంపిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులను అప్రమత్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా హెచ్చరికలు జారీ చేసింది.

ఈ స్కామ్ ఎలా జరుగుతుందంటే.. సాధారణంగా మీకు ఒక ఎస్ఎమ్ఎస్ లేదా ఈమెయిల్ వస్తుంది. అందులో మీ రిఫండ్ అగిపోయింది లేదా వెంటనే వెరిఫికేషన్ చేయకపోతే పెనాల్టీ పడుతుంది వంటి పదాలతో మిమ్మల్ని భయపెడతారు. ఆ మెసేజ్‌లో ఒక లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే అచ్చం ఇన్‌కమ్ టాక్స్ వెబ్‌సైట్ లాగే ఉండే నకిలీ సైట్‌కు మిమ్మల్ని తీసుకెళ్తారు. అక్కడ మీ పాన్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు, చివరకు మీ మొబైల్ కి వచ్చే ఓటీపీ అడుగుతారు. మీరు ఆ వివరాలు ఇచ్చారో.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవ్వడం ఖాయం!

నిజానికి ఆదాయపు పన్ను శాఖ ఎప్పుడూ వ్యక్తిగత వివరాలు లేదా ఓటీపీలను మెసేజ్ ద్వారా అడగదు. మీకు వచ్చే ఫేక్ మెసేజ్‌లలో స్పెల్లింగ్ తప్పులు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు Income కు బదులు Incom అని ఉండటం లేదా నకిలీ లింక్‌లు ఉండటం గమనించవచ్చు. పన్నుకు సంబంధించిన ఎలాంటి సమాచారమైనా సరే మీరు కేవలం అధికారిక వెబ్‌సైట్ www.incometax.gov.in లో మాత్రమే తనిఖీ చేసుకోవాలి. వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఒకవేళ మీకు ఇలాంటి అనుమానాస్పద మెసేజ్‌లు వస్తే వెంటనే ఆదాయపు పన్ను శాఖ దృష్టికి తీసుకెళ్లండి. webmanager@incometax.gov.in ఈమెయిల్ అడ్రస్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఒకవేళ పొరపాటున మీ వివరాలు షేర్ చేసి మోసపోయినట్లు అనిపిస్తే, వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయండి. లేదా హెల్ప్‌లైన్ నంబర్లు 1800 103 0025 లేదా 080-46122000 కు కాల్ చేసి సహాయం పొందవచ్చు.

Tags:    

Similar News