India Economy: చైనా రికార్డును తిరగరాయనున్న భారత్.. 2036 నాటికి $20 ట్రిలియన్ల జీడీపీ సాధించేలా పక్కా ప్లాన్
2036 నాటికి $20 ట్రిలియన్ల జీడీపీ సాధించేలా పక్కా ప్లాన్
India Economy: భారతదేశ ఆర్థిక వ్యవస్థ రాబోయే దశాబ్ద కాలంలో ఊహించని రీతిలో దూసుకెళ్లనుంది. రాబోయే 2036 నాటికి మన దేశం ఏకంగా 20 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఈక్విరస్ తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. అయితే ఈ మైలురాయిని చేరుకోవడానికి 20 కీలక సంస్కరణలు అమలు చేయడం ఎంతో అవసరం. ప్రస్తుతం భారత్ దాదాపు 3.7 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంది. ఈ పరిమాణాన్ని 2036 నాటికి 20 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలంటే మన ఆర్థిక వ్యవస్థ దాదాపు 5.5 రెట్లు పెరగాల్సి ఉంటుంది. డాలర్ విలువ ప్రాతిపదికన ఏటా దాదాపు 18 శాతం చొప్పున వృద్ధి నమోదు కావాలి. గతంలో చైనా దాదాపు 1.7 ట్రిలియన్ డాలర్ల స్థాయి నుంచి వరుసగా 11 ఏళ్ల పాటు ఏటా 18 శాతం వృద్ధి సాధించి చూపించింది. అదే బాటలో భారత్ కూడా మౌలిక వసతులు, మూలధన రంగాలు, మానవ వనరుల అభివృద్ధిపై దృష్టి సారిస్తే ఈ లక్ష్య సాధన అసాధ్యమేమీ కాదని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
సొంతంగా సోవరిన్ ఫండ్ ఏర్పాటు ప్రతిపాదన
ఈ బృహత్తర ప్రణాళికలో భాగంగా సింగపూర్ టెమాసెక్ నమూనాలో భారత్ సొంతంగా ఒక సోవరిన్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని ఈక్విరస్ సిఫార్సు చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలలో ఉన్న వాటాలను ఈ నిధి కిందకు తీసుకురావడం ద్వారా ఆరంభంలోనే దాదాపు 249 బిలియన్ డాలర్ల సీడ్ క్యాపిటల్ అందుబాటులోకి వస్తుంది. ఈ నిధులను మౌలిక సదుపాయాల కల్పనకు, ఇతర అత్యవసర ప్రాజెక్టులకు నిరంతరం ఉపయోగించుకోవచ్చు. ఇంధనాన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం, రాష్ట్రాలు తమ క్యాపిటల్ వ్యయాన్ని నూటికి నూరు శాతం వినియోగించుకునేలా చూడడం ద్వారా ఖజానాపై భారం పడకుండానే జీడీపీకి అదనంగా రూ. 5.2 ట్రిలియన్ల వరకు సమకూర్చవచ్చని నివేదిక పేర్కొంది.
సేవా రంగం విస్తరణతో 2.5 కోట్ల ఉద్యోగాలు
లక్ష్య సాధనలో సేవా రంగం పాత్ర అత్యంత కీలకమైనది. ప్రస్తుతం జీడీపీలో 54 శాతంగా ఉన్న సేవా రంగాన్ని 65 శాతానికి పైగా పెంచాల్సి ఉంటుంది. దీనివల్ల సేవా రంగ ఆర్థిక విలువ 2 ట్రిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 11 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జిసిసి) సంఖ్యను ప్రస్తుతం ఉన్న 1,800 నుంచి 5,000 కు పెంచేందుకు జాతీయ విధానాన్ని రూపొందించాలి. ఈ ఒక్క సంస్కరణ ద్వారానే 470 నుంచి 600 బిలియన్ డాలర్ల లబ్ధితో పాటు 2 కోట్ల నుంచి 2.5 కోట్ల వరకు కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆకర్షించడంలో టూరిజం రంగాన్ని మరింత బలోపేతం చేయాల్సి ఉంది.
పరిశోధనలు, ఆవిష్కరణలకు పెద్దపీట
దేశంలో ఉత్పాదకత, ఆవిష్కరణల సామర్థ్యాన్ని పెంచడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ప్రస్తుతం పరిశోధన రంగానికి (R&D) జీడీపీలో కేవలం 0.8 శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నారు. పేటెంట్ల నమోదులో మన దేశం ఇతర అభివృద్ధి చెందిన దేశాల కంటే వెనుకబడి ఉంది. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ రంగానికి ఇచ్చే రాయితీలను పునరుద్ధరించడం, విద్యారంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచడం, అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్‌లను భారీగా విస్తరించడం వల్ల వృద్ధి రేటు వేగవంతమవుతుంది. ఈ 20 సంస్కరణల ప్యాకేజీ వల్ల తొలి ఏడాదే ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ. 4.5 లక్షల కోట్ల నికర ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు.