Flight Service: న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ భారత్‌కు చేరుకుంటున్న వేళ రెండు దేశాల మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత న్యూఢిల్లీ నుంచి చైనాలోని ప్రధాన వాణిజ్య కేంద్రమైన గ్వాంగ్‌జౌ మధ్య నేరుగా విమాన సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. 2020లో తలెత్తిన కరోనా మహమ్మారి, గాల్వాన్ లోయ సరిహద్దు ఘర్షణల నేపధ్యంలో భారత్, చైనాల మధ్య నేరుగా రాకపోకలు సాగించే విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ సెప్టెంబర్ 21 నుంచి గ్వాంగ్‌జౌ-న్యూఢిల్లీ మార్గంలో క్రమం తప్పకుండా విమానాలను నడపనున్నట్లు వెల్లడించింది. ప్రారంభ దశలో బోయింగ్ 737-8 విమానం ద్వారా వారానికి 5 రోజులు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత అక్టోబర్ 26 నుంచి ప్రతిరోజూ విమానాలు నడపాలని సంస్థ నిర్ణయించింది.

వంద బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యానికి మహర్దశ

చైనాలో ప్రముఖ కాంటన్ ఫెయిర్‌కు ప్రవేశ ద్వారంగా ఉన్న గ్వాంగ్‌జౌ నగరానికి భారత్ నుంచి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం కావడం ఇరుదేశాల వ్యాపారులకు ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్న తరుణంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది భారత్, చైనాల మధ్య ఉన్న 100 బిలియన్ డాలర్లకు పైగా వ్యాపారానికి, ఎలక్ట్రానిక్స్ దిగుమతులకు, సప్లై చైన్ వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని విమాన సంస్థల సేవలు అందుబాటులోకి

ఇంతకుముందే ఎయిర్ చైనా సంస్థ బీజింగ్-ఢిల్లీ మార్గంలో సర్వీసులను పునరుద్ధరించగా, చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ కున్మింగ్ నుంచి కోల్‌కతాకు సర్వీసులు ప్రారంభించింది. భారతీయ విమానయాన దిగ్గజం ఇండిగో సైతం కోల్‌కతా నుంచి షాంఘై, గ్వాంగ్‌జౌ నగరాలకు నాన్‌స్టాప్ సర్వీసులను నడుపుతోంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్ధారణ తర్వాత రెండు దేశాల మధ్య రవాణా వ్యవస్థ మళ్లీ పాత రోజులను తలపిస్తూ వేగంగా పుంజుకుంటోంది.

బ్రిక్స్ సదస్సులో షి జిన్‌పింగ్ ప్రతిపాదనలు

ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు షి జిన్‌పింగ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం భారత్‌కు వచ్చింది. ఈ పర్యటనలో భాగంగా గ్లోబల్ సౌత్ దేశాల సహకారం, ఆర్థిక విధానాల్లో పురోగతి, ఫైనాన్స్, సాంకేతిక పరిజ్ఞానం, వ్యాపార భాగస్వామ్యాలపై కీలక చర్చలు జరగనున్నాయి. దౌత్యపరంగా, ఆర్థికంగా ఈ సమావేశం ఇరుదేశాల భవిష్యత్తు సంబంధాలను నిర్దేశించనుంది.

Tags: