UPI: ఉదయం లేచింది మొదలు ప్రతి చిన్న పనికీ సమయం సరిపోక సతమతమయ్యే ఉద్యోగులకు, గృహిణులకు ఎన్‌పీసీఐ అత్యంత తీపి కబురు అందించబోతోంది. రోజువారీ అవసరాలైన కూరగాయలు కొనుగోలు చేయడం నుంచి డిజిటల్ చెల్లింపులు చేసే వరకు అన్ని పనులను ఇకపై మీ స్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పూర్తి చేయనుంది. మారుతున్న సాంకేతిక ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాలలోకి వేగంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే భారతీయ చెల్లింపుల వ్యవస్థను నియంత్రించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) అత్యంత ఆధునిక ఏఐ టెక్నాలజీని యూపీఐకి అనుసంధానించే పనిలో పడింది. ప్రతిసారీ వినియోగదారులు స్క్రీన్ పై క్లిక్ చేసి, పిన్ నంబర్ నమోదు చేయాల్సిన అవసరం లేకుండానే ఏఐ ఏజెంట్లు మీ స్థానంలో లావాదేవీలను పూర్తి చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నారు.

కూరగాయల ధరలు తగ్గగానే ఆర్డర్ ఇచ్చే ఏఐ

సాధారణంగా నిత్యం మారే కూరగాయల ధరలను ఎప్పటికప్పుడు గమనించడం మనకు కష్టమైన పని. అయితే మీరు ఇచ్చే కమాండ్ల ఆధారంగా ఏఐ పనిచేస్తుంది. ఉదాహరణకు నిత్యం మనం కొనుగోలు చేసే కూరగాయల ధరలు మార్కెట్‌లో ఎప్పుడు తక్కువగా ఉంటాయో గమనించి, సరిగ్గా ఆ సమయంలో ఏఐ ఏజెంట్ మీకు కావలసిన సరుకులను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి కొనుగోలు చేస్తుంది. మీరు కేవలం ఎంత బడ్జెట్‌లో ఏమేం కొనాలో ఏఐకి ముందే చెబితే సరిపోతుంది.

పిన్ నమోదు చేయకుండానే యూపీఐ చెల్లింపులు

ప్రస్తుతం యూపీఐ ద్వారా ఎవరికైనా డబ్బులు పంపాలన్నా లేదా ఏమైనా వస్తువులు కొనాలన్నా సీక్రెట్ పిన్ నంబర్ తప్పనిసరి. కానీ ఎన్‌పీసీఐ రూపకల్పన చేస్తున్న ఈ కొత్త యూనిఫైడ్ ఏజెంట్ ప్రోటోకాల్ వ్యవస్థ ద్వారా ఒక పరిమితి వరకు పిన్ నంబర్ లేకుండే ఏఐ స్వయంగా లావాదేవీని పూర్తి చేస్తుంది. నెలకు లేదా రోజుకు ఎంత పరిమితి వరకు ఏఐ ఖర్చు చేయవచ్చో వినియోగదారులు ముందే సెట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

మొదటి విడతలో నిత్యావసర సరుకుల కొనుగోళ్లు

ఈ విధానాన్ని ప్రారంభ దశలో తక్కువ మొత్తం అయ్యే నిత్యావసర సరుకులు, కూరగాయలు, ఆన్‌లైన్ షాపింగ్ ఆర్డర్లకు వర్తింపజేయాలని యోచిస్తున్నారు. ఆ తర్వాత ఈ సాంకేతికతను క్రమంగా ఇతర సేవలకూ విస్తరించే అవకాశం ఉంది. భద్రతా ప్రమాణాలు, పరిమితులు స్పష్టంగా ఉండేలా బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలతో కలిసి ఎన్‌పీసీఐ ఈ మౌలిక వసతులను సిద్ధం చేస్తోంది.

Tags: