India GDP: దేశ ఆర్థిక వృద్ధి రేటు లెక్కలపై రాజకీయ, ఆర్థిక వర్గాల్లో తీవ్ర స్థాయిలో రగడ రాజేసింది. గతేడాది తొలి త్రైమాసికం జీడీపీ బేస్ విలువను ఏకంగా రూ.86 లక్షల కోట్ల నుంచి రూ.80 లక్షల కోట్లకు తగ్గించడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ వివాదంపై కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ స్పందిస్తూ అసలు నిజాలను బహిర్గతం చేసింది. కేంద్ర ప్రభుత్వం గతేడాది ప్రవేశపెట్టిన పాత బేస్ ఇయర్ (2011-12) లెక్కల ప్రకారం తొలి త్రైమాసికంలో నామినల్ జీడీపీ విలువ రూ.86.05 లక్షల కోట్లుగా ఉండేది. అయితే కొత్తగా తీసుకొచ్చిన 2022-23 బేస్ ఇయర్ విధానం అమలులోకి వచ్చాక ఈ అంచనాలు క్రమంగా మారుతూ వచ్చాయి. పరిశ్రమల ఉత్పత్తి సూచీ (IIP), విక్రేతల ధరల సూచీ (PPI) నుంచి అందిన అధునాతన సమాచారం ఆధారంగా ఈ విలువను చివరికి రూ.80.11 లక్షల కోట్లకు సవరించారు. ఇది కేవలం సాంకేతిక మార్పు మాత్రమే తప్ప, ఈ ఏడాది వృద్ధి రేటును కృత్రిమంగా పెంచి చూపించడానికి చేసిన కుట్ర కాదని కేంద్రం తేల్చిచెప్పింది.

పాత సిరీస్.. కొత్త సిరీస్ సరిపోల్చడం సరికాదు

రెండు వేర్వేరు బేస్ ఇయర్ల ఆధారంగా లెక్కించిన గణాంకాలను నేరుగా పోల్చి చూడడం సరికాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. త్రైమాసిక జీడీపీ అంచనాల కోసం బెంచ్ మార్క్ ఇండికేటర్ పద్ధతిని ఉపయోగిస్తారని వివరించారు. పాత సిరీస్‌లోని రూ.86.05 లక్షల కోట్ల అంచనాలను, కొత్త సిరీస్‌లోని ఏప్రిల్-జూన్ త్రైమాసికపు 7.8 శాతం వృద్ధి రేటుతో నేరుగా పోల్చడం వల్ల గందరగోళం ఏర్పడిందని పేర్కొన్నారు. సమాచార సేకరణలో పారదర్శకత, మెరుగైన ఆపరేటింగ్ పద్ధతుల వల్లే ఈ వ్యత్యాసం వచ్చిందని స్పష్టత ఇచ్చారు.

మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి మైనస్ ద్రవ్యోల్బణం సవాళ్లు

తయారీ రంగంలో నూతన విధానం కింద ఉత్పత్తి కాస్ట్, ముడిసరుకుల వ్యయాలను వేర్వేరుగా లెక్కిస్తున్నారు. ముడిసరుకుల ధరలు తయారైన వస్తువుల సేల్స్ రేట్ల కంటే వేగంగా పెరిగినప్పుడు నామినల్ వృద్ధి కంటే రియల్ వృద్ధి ఎక్కువగా కనిపిస్తుందని అధికారులు వెల్లడించారు. టెక్స్‌టైల్స్, రబ్బర్, ప్లాస్టిక్ వంటి రౌ మెటీరియల్ ఆధారిత పరిశ్రమల్లో ఈ తరహా విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తుంటాయి. దీనివల్లే అక్కడ మైనస్ ఇంప్లిసిట్ ద్రవ్యోల్బణం రేటు నమోదైంది.

సిపిఐ, డబ్ల్యూపీఐకి జీడీపీకి సంబంధం ఉందా?

సాధారణ వినియోగదారుల ద్రవ్యోల్బణం (CPI), హోల్‌సేల్ ద్రవ్యోల్బణం (WPI) కన్నా జీడీపీ డిఫ్లేటర్ లెక్కలు పూర్తిగా భిన్నంగా ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. సీపీఐ కేవలం నిత్యావసర సరుకుల ధరలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది. జీడీపీ డిఫ్లేటర్ అనేది దేశ ఆర్థిక వ్యవస్థలోని కార్పొరేట్ పెట్టుబడులు, ప్రభుత్వ వ్యయాలు, ఎగుమతులు, సేవల రంగాలు సహా 300 రకాల విభిన్న సూచీల సమాహారంతో రూపుదిద్దుకుంటుంది. కాబట్టి ఈ మూడూ ఒకే దిశలో ప్రయాణించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

Tags: