India Exports: పశ్చిమాసియాలో తీవ్రమవుతున్న సైనిక ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి పరిధిలోని ఆటంకాల వల్ల ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలు చిన్నభిన్నమయ్యాయి. సముద్ర మార్గాల్లో రవాణా ఛార్జీలు విపరీతంగా పెరిగినప్పటికీ భారతీయ ఎగుమతిదారులు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ వస్తువులకు ప్రపంచ మార్కెట్‌లో ఊహించని డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా జులై నెలలో భారత వస్తువుల ఎగుమతులు ఏటా పోలిస్తే 19.63 శాతం పెరిగి 44.24 బిలియన్ డాలర్ల ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి.

పెరిగిన దిగుమతులు.. వాణిజ్య లోటుపై ప్రభావం

ఎగుమతుల్లో కొత్త చరిత్ర సృష్టించినప్పటికీ, మరోవైపు దిగుమతులు కూడా భారీగా పెరగడంతో వాణిజ్య లోటు పెరిగింది. ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులు, బొగ్గు, ఎలక్ట్రానిక్స్ దిగుమతులు పెరగడంతో మొత్తం దిగుమతుల విలువ 76.22 బిలియన్ డాలర్లకు చేరింది. గత ఏడాది జులైలో 27.88 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు ఈసారి 31.98 బిలియన్ డాలర్లకు వ్యాపించింది. బంగారంపై కస్టమ్స్ డ్యూటీ పెంచడం వల్ల పసిడి దిగుమతులు 4.16 బిలియన్ డాలర్ల వద్ద పరిమితం కాగా, వెండి దిగుమతులు ఏకంగా 66.1 శాతం తగ్గి 171.68 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.

ఎగుమతుల రేసులో అగ్రస్థానంలో అమెరికా

భారత ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో అమెరికా అగ్రస్థానంలో నిలవగా, మన దేశానికి సరుకులను పంపడంలో చైనా మొదటి స్థానంలో ఉంది. తీవ్ర ఆటంకాలు ఉన్నప్పటికీ పశ్చిమాసియా దేశాలకు జరిగిన ఎగుమతుల్లో 8.62 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. సింగపూర్, ఆస్ట్రేలియా, స్పెయిన్, మలేషియాతో పాటు ఆసియాన్ దేశాలకు ఎగుమతులు ఊపందుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జులై వరకు మొదటి నాలుగు నెలల కాలంలో మొత్తం ఎగుమతులు 17.04 శాతం పెరిగి 173.78 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటాయి.

ఆరేళ్ల తర్వాత తెరుచుకున్న నాథూ లా సరిహద్దు

వాణిజ్య రంగానికి మరింత ఊతమిస్తూ సిక్కిం సరిహద్దులోని చారిత్రాత్మక నాథూ లా మార్గం ద్వారా సరిహద్దు వాణిజ్యం ఆగస్టు 1 నుంచి పునఃప్రారంభమైంది. ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ మార్గం తెరుచుకోవడంతో రాబోయే రోజుల్లో ప్రాంతీయ వాణిజ్యం మరింత పుంజుకోనుంది. సవాళ్లను అవకాశాలుగా మలచుకోవడంలో భారతీయ వాణిజ్య వేత్తలు సఫలమయ్యారని కేంద్ర వాణిజ్య శాఖ అధికారులు ప్రశంసించారు.

Tags: