Vijay Mallya:బ్యాంకులను ముంచేసి లండన్ పారిపోయిన విజయ్ మాల్యా కేసులో రికవరీ వివాదం మళ్లీ రగిలింది. బొంబాయి హైకోర్టులో జరుగుతున్న విచారణ సందర్భంగా మాల్యా తరఫు న్యాయవాదులు ఒక విస్తుపోయే వాదనను తెరపైకి తెచ్చారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ద్వారా ఇప్పటికే రూ. 14,131.60 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుని ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల సమూహానికి అప్పగించినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. డెబ్ట్ రికవరీ ట్రిబ్యునల్ లెక్కించిన దాని ప్రకారం అసలు అప్పుతో పాటు వడ్డీ కలిపి తాము చెల్లించాల్సిన దానికంటే చాలా ఎక్కువ మొత్తాన్నే బ్యాంకులు వసూలు చేశాయని, కాబట్టి ఈ కేసును ఇక ముగించాలని వారు ప్రతిపాదించారు.

వేల కోట్ల ఆస్తుల వేలం.. పార్లమెంట్‌లోనూ అదే మాట

ముంబై విమానాశ్రయం సమీపంలోని కింగ్‌ఫిషర్ ఆఫీస్, గోవాలోని లగ్జరీ ప్రాపర్టీలతో పాటు బెంగళూరులోని ఇళ్లు, స్థలాలను ఈడీ వేలం వేసి ఈ నిధులను రాబట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా గతంలో పార్లమెంట్ సాక్షిగా ఇదే విషయాన్ని వెల్లడించారు. రూ.6,203 కోట్ల రుణానికి పరిహారంగా ఈడీ ద్వారా రూ. 14,131.60 కోట్లను బ్యాంకులకు అందజేసినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించిన ఈ లెక్కల ఆధారంగానే మాల్యా లాయర్లు తమ పిటిషన్‌పై విచారణ అవసరం లేదని, తమ నుంచి రాబట్టాల్సిన మొత్తం కంటే ఎక్కువ మొత్తమే రికవరీ అయిందని కోర్టులో గట్టిగా వాదిస్తున్నారు.

ఎస్‌బీఐ వేరు.. ఈడీ వేరు.. బ్యాంకు చెప్పే లెక్కే వేరు

ఈడీ వెల్లడించిన లెక్కలకు, బ్యాంకులు చెబుతున్న గణాంకాలకు అస్సలు పొంతన కుదరకపోవడమే ఇక్కడ అసలు చిక్కు ముడి. ఎస్‌బీఐ కన్సార్టియం కోర్టుకు అందించిన వివరాల ప్రకారం విజయ్ మాల్యా మొత్తం చెల్లించాల్సిన బకాయిలు రూ.17,471 కోట్లు. ఇందులో ఇప్పటివరకు రూ.10,814.54 కోట్లు మాత్రమే రికవరీ అయ్యాయని, ఇంకా రూ.6,656.96 కోట్లు వసూలు కావాల్సి ఉందని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. పార్లమెంట్‌లో కేంద్రం చెప్పిన రికవరీ రికార్డులకు, ఎస్‌బీఐ చెబుతున్న ఆక్యూరేట్ రికవరీ ఖాతాకు మధ్య ఐదు వేల కోట్లకు పైగా తేడా ఉండటం ఇప్పుడు తీవ్ర గందరగోళానికి దారితీసింది.

బొంబాయి హైకోర్టు సీరియస్.. ఈడీ, ఎస్‌బీఐలకు నోటీసులు

దాదాపు దశాబ్ద కాలంగా సాగుతున్న ఈ ఆర్థిక వివాదం దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోందని బొంబాయి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కేవలం వ్యాపారపరమైన తగాదా అని, దీనికి త్వరలోనే ముగింపు పలకాలని స్పష్టం చేసింది. స్వాధీనం చేసుకున్న ఆస్తులు, వేలం ద్వారా వచ్చిన నిజమైన సొమ్ము ఎంత అనే దానిపై పూర్తి నివేదిక సమర్పించాలని ఈడీకి విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఎస్‌బీఐ కూడా తమ రికవరీ ఖాతాల అసలు లెక్కలను సమర్పించాలని ఆదేశించింది. ఈ రెండు నివేదికలు చేతికందితేనే మాల్యా ఇంకా ఎంత చెల్లించాలి లేదా అప్పు తీరిపోయిందా అనే విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Tags: