Shanti Bill : భారత్ లో అణు విప్లవం..రాష్ట్రపతి ఆమోదంతో మారిన చరిత్ర..ఇక ప్రైవేట్ కంపెనీలదే హవా
రాష్ట్రపతి ఆమోదంతో మారిన చరిత్ర..ఇక ప్రైవేట్ కంపెనీలదే హవా
Shanti Bill : భారతదేశ ఇంధన రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేచింది.అణుశక్తి రంగంలో ఇప్పటివరకు ప్రభుత్వానికే ఉన్న గుత్తాధిపత్యానికి తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందిన శాంతి బిల్లు 2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఆమోదముద్ర వేశారు. సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా(SHANTI) పేరుతో వచ్చిన ఈ బిల్లు, ప్రైవేట్ కంపెనీలకు అణుశక్తి రంగంలోకి ప్రవేశించేందుకు మార్గాన్ని సుగమం చేసింది. 2047 నాటికి 100 గిగావాట్ల అణుశక్తిని ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రైవేట్ భాగస్వామ్యం కీలకమని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతం అమల్లో ఉన్న 1962 నాటి అటామిక్ ఎనర్జీ చట్టం ప్రకారం.. కేవలం కేంద్ర ప్రభుత్వం లేదా దాని ఆధీనంలోని సంస్థలకు మాత్రమే అణు విద్యుత్ ప్లాంట్లను నిర్మించే, నడిపే అధికారం ఉంది. అయితే, ఇప్పుడు వచ్చిన కొత్త శాంతి బిల్లుతో పాత చట్టాలను రద్దు చేసి, ప్రైవేట్ పెట్టుబడులకు, అంతర్జాతీయ సాంకేతిక సహకారానికి తలుపులు తెరిచారు. దీనివల్ల భారీగా విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉండటమే కాకుండా, ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా పూర్తవుతుంది. క్లీన్ ఎనర్జీ దిశగా భారత్ అడుగులు వేస్తున్న తరుణంలో, ఇది పర్యావరణానికి కూడా మేలు చేసే నిర్ణయం.
ఈ కొత్త అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి అదానీ గ్రూప్ ఇప్పటికే సిద్ధమైంది. గౌతమ్ అదానీ నేతృత్వంలోని ఈ సంస్థ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ల అవసరాల కోసం అణుశక్తిని వాడాలని చూస్తోంది. డేటా సెంటర్లు ఏడాది పొడవునా, రోజుకు 24 గంటల పాటు నిరంతరాయంగా పనిచేయాల్సి ఉంటుంది. దీనికోసం భారీగా విద్యుత్ అవసరం. అదానీ గ్రూప్ చిన్న కుమారుడు జీత్ అదానీ వెల్లడించిన ప్రకారం.. గూగుల్ వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాల కోసం ఏర్పాటు చేసే AI డేటా సెంటర్ల కోసం దాదాపు 5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఈ డేటా సెంటర్లకు అవసరమైన బేస్‌లోడ్ పవర్ కోసం అణు విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పడం ద్వారా పర్యావరణ హితమైన విద్యుత్‌ను అందించవచ్చని వారి ప్లాన్.
అదానీ గ్రీన్ ఎనర్జీ ఇప్పటికే సౌర, పవన విద్యుత్ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉంది. ఇప్పుడు అణుశక్తి రంగంలోకి కూడా అడుగుపెట్టడం ద్వారా గ్లోబల్ టెక్ కంపెనీల అవసరాలను తీర్చాలని భావిస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా, అదానీ గ్రూప్ పవర్ ప్లాంట్ల యజమానిగా ఉంటూ వాటిని నిర్వహిస్తుంది, అయితే రియాక్టర్ల నిర్మాణాన్ని మాత్రం నైపుణ్యం కలిగిన అంతర్జాతీయ భాగస్వాములకు అప్పగిస్తుంది. ప్రైవేట్ కంపెనీల రాకతో అణుశక్తి రంగంలో పోటీ పెరుగుతుందని, తద్వారా విద్యుత్ ధరలు తగ్గడంతో పాటు దేశవ్యాప్తంగా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.