Solar Energy: వేసవి కాలం వస్తే చాలు దేశంలో కరెంట్ డిమాండ్ ఆకాశాన్ని తాకుతుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో గృహ వినియోగం పెరగడం, పొలాలకు నీళ్లు తోడేందుకు వ్యవసాయ పంపులు నడవడంతో గ్రిడ్లపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. సరిగ్గా ఇక్కడే ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. పగటిపూట విపరీతంగా సౌర విద్యుత్ అందుబాటులో ఉన్నప్పటికీ, దాన్ని స్వీకరించేందుకు మన గ్రిడ్ల సామర్థ్యం సరిపోవడం లేదు. ఫలితంగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తులను నిలిపివేయాలని కంపెనీలకు ఆదేశాలు వెళ్తున్నాయి. ఒక నివేదిక ప్రకారం.. గత 15 నెలల్లో భారత్ దాదాపు 11 టెరావాట్-గంటల సోలార్ పవర్‌ను అస్సలు వినియోగించుకోలేకపోయింది. ఈ మొత్తం విద్యుత్‌తో కోటి కుటుంబాల వెలుగులు నింపవచ్చు.

భారత్‌లో 300 గిగావాట్లకు పైగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఉంది. మన దేశ మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో ఇది సగానికి పైగా కావడం విశేషం. అయినా సరే మనం నేటికీ బొగ్గు ఆధారిత ప్లాంట్లపైనే ఆధారపడుతున్నాం. దీనికి ప్రధాన కారణం కర్‌టైల్‌మెంట్ (కోత). పగటివేళ సోలార్ పవర్ పీక్ స్టేజ్‌కు చేరుకున్నప్పుడు థర్మల్ ప్లాంట్లలో ఉత్పత్తిని తగ్గించడం సాంకేతికంగా తీవ్రమైన సవాలుగా మారింది. ఎంబర్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, నడుస్తున్న బొగ్గు విద్యుత్ కేంద్రాలను సోలార్ ఎనర్జీకి తగ్గట్లుగా క్షణాల్లో అడ్జస్ట్ చేయడం ఏనుగుతో డ్యాన్స్ చేయించడం కంటే కష్టమైన పని. దీంతో సోలార్ పవర్‌ను పక్కన పెట్టి థర్మల్ ప్లాంట్ల విద్యుత్‌నే వాడాల్సి వస్తోంది.

విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయడం వల్ల పునరుత్పాదక ఇంధన సంస్థలు తీవ్రంగా నష్టపోతున్నాయి. గ్రిడ్‌కు చేరిన విద్యుత్‌కు మాత్రమే ఆయా సంస్థలకు చెల్లింపులు జరుగుతాయి. పశ్చిమ భారతంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి దేశానికి అవసరమైన 50 శాతం సోలార్ పవర్ లభిస్తోంది. పగటిపూట ఈ ప్రాంతాల నుంచి విద్యుత్‌ను ఇతర ప్రాంతాలకు పంపడానికి తగినన్ని ట్రాన్స్‌మిషన్ లైన్లు లేవు. విద్యుత్ లైన్ల రద్దీ వల్ల మెరుగైన ఆప్షన్లు ఉన్నా వాడలేకపోతున్నారు. ఇది కాలుష్యాన్ని పెంచడమే కాకుండా చవకైన క్లీన్ ఎనర్జీ నిరుపయోగంగా మారడానికి దారితీస్తోంది.

పగలు ఉత్పత్తయ్యే అదనపు సోలార్ పవర్‌ను నిల్వ చేసి రాత్రి వేళల్లో వాడుకోవడానికి బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ అత్యంత కీలకం. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధన ప్రకారం, బ్యాటరీ స్టోరేజ్‌తో కూడిన గ్రీన్ ఎనర్జీ.. కొత్తగా నిర్మించే థర్మల్ ప్లాంట్ల కరెంట్ కంటే కూడా చాలా చవక. అయితే భారత్‌లో బ్యాటరీ స్టోరేజ్ రంగం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. 2032 నాటికి దేశానికి 74 గిగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ అవసరం కాగా, ప్రస్తుతం కేవలం 3 గిగావాట్లు మాత్రమే అందుబాటులో ఉంది. ట్రాన్స్‌మిషన్ లైన్ల నిర్మాణానికి మూడేళ్లకు పైగా సమయం పడుతుంది, కానీ బ్యాటరీ వ్యవస్థలను వేగంగా ఏర్పాటు చేయవచ్చు.

Tags: