Savings Scheme: ఆడపిల్ల పుట్టిన క్షణం నుంచే వారి చదువు, పెళ్లి బాధ్యతల గురించి తల్లిదండ్రులు ఆలోచించడం ప్రారంభిస్తారు. అలాంటి వారి భయాలను పటాపంచలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సుకన్య సమృద్ధి యోజన ఒక వరంగా మారింది. ఏడాదికి రూ.1.5 లక్షల పొదుపుతో ఏకంగా రూ.70 లక్షల నిధిని సురక్షితంగా ఎలా రూపొందించవచ్చో తెలుసుకుందాం. ఆడపిల్లల ఆర్థిక భవిష్యత్తుకు గట్టి పునాది వేసేందుకు కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో, బేటీ పఢావో కార్యక్రమంలో భాగంగా ఈ పథకాన్ని రూపొందించింది. పాప పుట్టిన రోజు నుంచి 10 ఏళ్ల వయస్సు వచ్చే లోపు తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకులు ఈ ఖాతాను తెరవవచ్చు. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు కుమార్తెలకు మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. ఒకవేళ కవలలు లేదా ముగ్గురు ఆడపిల్లలు ఒకేసారి జన్మిస్తే, ప్రత్యేక మినహాయింపు కింద ఇద్దరి కంటే ఎక్కువ మందికి ఖాతాలు తెరిచే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది.

సౌకర్యవంతమైన పెట్టుబడి విధానం

ఈ పథకంలో సొమ్ము జమ చేసేందుకు ఎంతో సడలింపులు ఉన్నాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250 నుంచి పెట్టుబడి ప్రారంభించవచ్చు. గరిష్టంగా ఒక ఏడాదికి రూ.1.5 లక్షల వరకు దాచుకునే వీలుంది. ఈ మొత్తాన్ని ఒకేసారి కట్టాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు తమ వెసులుబాటును బట్టి విడతల వారీగా జమ చేయవచ్చు. ఖాతా ప్రారంభించిన తేదీ నుంచి కేవలం 15 సంవత్సరాలు మాత్రమే డబ్బులు కడితే సరిపోతుంది. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 21 ఏళ్లు. అంటే 15 ఏళ్ల తర్వాత మీరు ఎలాంటి డబ్బులు జమ చేయకపోయినా, మిగిలిన 6 ఏళ్లకు ప్రభుత్వం చక్రవడ్డీని జమ చేస్తూనే ఉంటుంది.

అత్యధిక వడ్డీ, పూర్తి పన్ను మినహాయింపు

ప్రస్తుతం అందుబాటులో ఉన్న చిన్న మొత్తాల పొదుపు పథకాలన్నింటికంటే సుకన్య సమృద్ధి యోజనలోనే ఎక్కువ వడ్డీ వస్తోంది. ప్రభుత్వం ఈ ఖాతాలపై వార్షికంగా 8.20 శాతం వడ్డీని అందిస్తోంది. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఇది ఎంతో మెరుగైనది. దీనికి తోడు ఈ పథకానికి EEE(ఎగ్జెంప్ట్-ఎగ్జెంప్ట్-ఎగ్జెంప్ట్) హోదా ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 80C కింద ఏడాదికి రూ.1.5 లక్షల వరకు డిపాజిట్లపై పన్ను మినహాయింపు పొందవచ్చు. ప్రతీ ఏటా వచ్చే వడ్డీతో పాటు 21 ఏళ్ల తర్వాత చేతికి అందే మెచ్యూరిటీ సొమ్ముపై ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన పనిలేదు.

రూ.70 లక్షల భారీ నిధి ఎలా తయారవుతుంది?

ఈ పథకం ద్వారా గరిష్ట ప్రయోజనం పొందాలంటే చిన్న లెక్క అర్థం చేసుకోవాలి. మీ పాప పేరు మీద ప్రతి సంవత్సరం గరిష్ట పరిమితి అయిన రూ.1.5 లక్షలు డిపాజిట్ చేస్తున్నారని అనుకుందాం. 15 ఏళ్ల కాలంలో మీరు కట్టే మొత్తం సొమ్ము రూ.22.50 లక్షలు అవుతుంది. ప్రస్తుతపు 8.20 శాతం వార్షిక చక్రవడ్డీ రేటు ప్రకారం, 21 ఏళ్ల మెచ్యూరిటీ సమయానికి మీ చేతికి సుమారు రూ.70 లక్షలకు పైగా నిధి అందుతుంది. అయితే మెచ్యూరిటీ సమయంలో అందే మొత్తం అనేది కాలక్రమేణా ప్రభుత్వం సమీక్షించే వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది.

Tags: