Indian Space Economy: భారత అంతరిక్ష రంగం ఒక అద్భుతమైన చారిత్రాత్మక మార్పుకు వేదికగా మారుతోంది. జెఫరీస్ నివేదిక ప్రకారం.. భారత స్పేస్ ఎకానమీ 2030 నాటికి ఐదు రెట్లు పెరిగి 45 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. 2014లో కేవలం ఒక్కటిగా ఉన్న స్పేస్ స్టార్టప్‌ల సంఖ్య ఇప్పుడు 400 దాటడం విశేషం. గత ఆరు దశాబ్దాలుగా కేవలం ప్రభుత్వ పర్యవేక్షణలోనే ఉన్న అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ కంపెనీలకు తెరవడంతో భారత స్పేస్ స్టార్టప్ వ్యవస్థ రూపురేఖలు మారిపోయాయి. 2023లో 8.4 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత స్పేస్ మార్కెట్, ఈ దశాబ్దం ముగిసేసరికి 45 బిలియన్ డాలర్లకు, 2040 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ స్పేస్ ఎకానమీలో భారత్ వాటా 2 నుంచి 3 శాతం మాత్రమే ఉండగా, 2030 నాటికి దీనిని 8 శాతానికి పెంచడమే లక్ష్యంగా ప్రైవేట్ సంస్థలు దూసుకెళ్తున్నాయి.

బిలియన్ డాలర్ల క్లబ్‌ వైపు అడుగులు వేస్తున్న స్టార్టప్‌లు

ప్రైవేట్ రంగంలో స్కైరూట్ ఏరోస్పేస్, పిక్సెల్, అగ్నికుల్ కాస్మోస్, దిగంతర వంటి సంస్థలు తమ సత్తా చాటుతున్నాయి. స్కైరూట్ సంస్థ దాదాపు 160 మిలియన్ డాలర్ల నిధులను సేకరించి, విక్రమ్-1 ద్వారా కక్ష్యలోకి ఉపగ్రహాలను పంపిన తొలి ప్రైవేట్ భారతీయ కంపెనీగా చరిత్ర సృష్టించింది. పిక్సెల్ సంస్థ 95 మిలియన్ డాలర్ల ఫండింగ్ సాధించడమే కాకుండా, భూపరిశీలన ఉపగ్రహాల డేటా కోసం అమెరికాకు చెందిన నాసా నుంచే కాంట్రాక్ట్ దక్కించుకుంది. అగ్నికుల్ సంస్థ ప్రపంచంలోనే తొలిసారిగా సింగిల్-పీస్ 3డీ ప్రింటెడ్ ఇంజిన్ రాకెట్‌ను తయారు చేసి సంచలనం సృష్టించింది.

ప్రభుత్వ విధానాలు.. విదేశీ పెట్టుబడుల వరద

2020లో స్పేస్ వాల్యూ చైన్‌ను ప్రైవేట్ సంస్థలకు తెరవడం, 2023 స్పేస్ పాలసీని తేవడం ఈ రంగానికి కొండంత బలాన్ని ఇచ్చింది. సింగిల్ విండో ఏజెన్సీ ఇన్-స్పేస్ ద్వారా మంజూరు ప్రక్రియలు సులభతరమయ్యాయి. రూ. 1,000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్, రూ. 500 కోట్ల టెక్నాలజీ అడాప్షన్ ఫండ్‌లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఉపగ్రహ తయారీలో 74 శాతం, లాంచ్ వెహికల్స్‌లో 49 శాతం వరకు ఆటోమేటిక్ రూట్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) అనుమతులు ఇవ్వడం విశేషం.

చౌకైన స్పేస్ ఇంజనీరింగ్.. భారత్ ప్రత్యేకత

నాసా తన మావెన్ మిషన్ కోసం 671 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తే, భారత్ తన మంగళయాన్ మిషన్‌ను కేవలం 74 మిలియన్ డాలర్లతో పూర్తి చేసింది. అలాగే చంద్రయాన్-3 విజయం కూడా 72 మిలియన్ డాలర్లలోనే సాధ్యమైంది. తక్కువ ఖర్చుతో నాణ్యమైన టెక్నాలజీని అందించే ఇస్రో అనుభవాన్ని వాడుకుంటూ, భారత ప్రైవేట్ రంగాలు వాణిజ్య మార్కెట్‌లో గ్లోబల్ కాంట్రాక్టులను చేజిక్కించుకోవడానికి సిద్ధమవుతున్నాయి.

Tags: