Smartphone Exports : మేక్ ఇన్ ఇండియా మ్యాజిక్.. మొబైల్ తయారీలో భారత్ విశ్వరూపం

మొబైల్ తయారీలో భారత్ విశ్వరూపం

Update: 2026-04-02 07:44 GMT

Smartphone Exports : భారతదేశం మొబైల్ ఫోన్ల తయారీలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకప్పుడు విదేశాల నుంచి ఫోన్లను దిగుమతి చేసుకునే స్థితి నుంచి, ఇప్పుడు ప్రపంచానికే స్మార్ట్‌ఫోన్లను ఎగుమతి చేసే స్థాయికి మన దేశం ఎదిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఊహించిన దానికంటే అద్భుతమైన ఫలితాలను ఇచ్చిందని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ పార్లమెంటుకు వెల్లడించారు. మొబైల్ ఫోన్ల తయారీని పెంచేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన పీఎల్ఐ స్కీమ్ ద్వారా ఆశించిన దానికంటే రెట్టింపు పెట్టుబడులు వచ్చాయి. ప్రభుత్వం రూ.17,519 కోట్ల పెట్టుబడులను ఆకర్షించగా, ఉత్పత్తి మాత్రం అంచనాల కంటే 36 శాతం ఎక్కువగా నమోదైంది. అంటే మొత్తం రూ.8.12 లక్షల కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు మన దేశంలో తయారయ్యాయి. 2014లో కేవలం కొన్ని తయారీ యూనిట్లు మాత్రమే ఉండగా, నేడు దేశవ్యాప్తంగా 300కు పైగా మొబైల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు పనిచేస్తున్నాయి. 2025 క్యాలెండర్ ఇయర్ లో దాదాపు 28 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.62 లక్షల కోట్లు) విలువైన స్మార్ట్‌ఫోన్లను భారత్ ఇతర దేశాలకు ఎగుమతి చేయడం విశేషం.

ఎగుమతుల్లో నంబర్ వన్

మొబైల్ ఫోన్లు ఇప్పుడు భారతదేశం నుండి అత్యధికంగా ఎగుమతి అయ్యే వస్తువుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచాయి. లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కింద మొత్తం ఎగుమతులు రూ.6.2 లక్షల కోట్లు దాటాయి, ఇది ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం కంటే 27 శాతం ఎక్కువ. అయితే, పెట్టుబడులు మరియు ఉత్పత్తిలో దూసుకుపోతున్న ఈ స్కీమ్, ఉద్యోగ కల్పనలో మాత్రం స్వల్పంగా వెనుకబడింది. ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకోగా, ఫిబ్రవరి 2026 నాటికి 1.85 లక్షల మందికి మాత్రమే ఉపాధి లభించింది. ఈ పథకం కింద ఇప్పటివరకు 32 కంపెనీలకు అనుమతులు లభించగా, రూ.15,473 కోట్ల ప్రోత్సాహకాలను ప్రభుత్వం పంపిణీ చేసింది.

సెమీకండక్టర్లు మరియు ఐటీ హార్డ్‌వేర్ పై ఫోకస్

కేవలం స్మార్ట్‌ఫోన్లే కాకుండా ఐటీ హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీలోనూ భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. ఐటీ హార్డ్‌వేర్ పీఎల్ఐ స్కీమ్ ద్వారా రూ.18,863 కోట్ల ఉత్పత్తి సాధ్యమైంది. అలాగే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్ కింద కొరియా, తైవాన్, జపాన్ వంటి గ్లోబల్ దిగ్గజాలతో భారత కంపెనీలు జాయింట్ వెంచర్లు (JV) కుదుర్చుకుంటున్నాయి. ఇప్పటివరకు ఈ పథకం కింద 12 రాష్ట్రాల్లో 75 దరఖాస్తులకు ఆమోదం లభించింది. వీటి ద్వారా రూ.61,671 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, తద్వారా 65 వేల మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి వివరించారు.

పదేళ్లలో 5 రెట్ల ఉత్పత్తి పెంపు

సెమీకండక్టర్ల తయారీలో ఉన్న ఇబ్బందులను తొలగించేందుకు 2020లో ప్రారంభించిన SPECS పథకం కూడా మంచి ఫలితాలనిస్తోంది. దీని ద్వారా ఇప్పటివరకు రూ.18,609 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం మీద 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2024-25 నాటికి దేశీయ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి ఐదు రెట్లు పెరగగా, ఎగుమతులు ఏకంగా ఎనిమిది రెట్లు పెరగడం గమనార్హం. ఒకప్పుడు చైనా, వియత్నాం వైపు చూసిన మొబైల్ కంపెనీలు, ఇప్పుడు తమ ఫ్యూచర్ ఫ్యాక్టరీల కోసం భారత్‌ను ఎంచుకుంటున్నాయి. ఇది నిజంగా మేక్ ఇన్ ఇండియా సాధించిన గొప్ప విజయం.

Tags:    

Similar News