India-US Deal : అమెరికా వ్యాపార ఒప్పందం నుంచి వ్యవసాయ రంగాన్ని ఎందుకు తప్పించారు

వ్యవసాయ రంగాన్ని ఎందుకు తప్పించారు

Update: 2026-02-04 08:10 GMT

India-US Deal : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత్ కుదుర్చుకున్న చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందంలో ఒక కీలక నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అగ్రరాజ్యంతో దోస్తీ చేస్తూనే, మన దేశ వెన్నెముక అయిన వ్యవసాయం, డైరీ (పాల ఉత్పత్తి) రంగాలను భారత్ ఈ డీల్ నుంచి దూరంగా ఉంచింది. కోట్లాది మంది రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టకూడదనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

భారతదేశం, అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం వల్ల అనేక రంగాలకు మేలు జరుగుతున్నప్పటికీ, వ్యవసాయం, డైరీ రంగాలను మాత్రం ఈ పరిధి నుంచి బయట ఉంచారు. దీని వెనుక బలమైన ఆర్థిక, సామాజిక కారణాలు ఉన్నాయి. మన దేశంలో దాదాపు 45 శాతం మంది ప్రజలు నేటికీ వ్యవసాయం పైనే ఆధారపడి బతుకుతున్నారు. ముఖ్యంగా డైరీ రంగం కోట్లాది మంది సన్నకారు రైతుల చేతుల్లో ఉంది. వీరికి ఒకటి లేదా రెండు పశువులు మాత్రమే ఉంటాయి. అదే అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో వ్యవసాయం పూర్తిగా కార్పొరేట్ కంపెనీల చేతుల్లో ఉంటుంది. అక్కడ వేల ఎకరాల్లో భారీ యంత్రాలతో సాగు చేస్తారు.

అమెరికాలో రైతులు తమ ఉత్పత్తులను చాలా తక్కువ ధరకే ఉత్పత్తి చేయగలరు. పైగా అక్కడి ప్రభుత్వం రైతులకు భారీగా సబ్సిడీలు ఇస్తుంది. ఒకవేళ వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఈ రంగాలపై పన్నులు తొలగిస్తే, అమెరికా నుంచి చౌకగా పాలు, వెన్న, పప్పులు, పండ్లు భారత మార్కెట్‌లోకి ముంచెత్తుతాయి. దీనివల్ల మన దేశీయ రైతులకు పోటీ కష్టమై, వారి ఆదాయం దారుణంగా పడిపోతుంది. కేవలం డైరీ రంగం మీదే ఆధారపడిన చిన్న రైతులు రోడ్డున పడే ప్రమాదం ఉంది. అందుకే వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని బృందం, ఈ సెన్సిటివ్ సెకటర్లను తాకకుండానే ఒప్పందాన్ని పూర్తి చేసింది.

ఒక అంచనా ప్రకారం..ఈ రంగాలను ఒప్పందంలో చేర్చి ఉంటే భారతీయ రైతులకు ఏటా దాదాపు రూ.1.03 కోట్ల కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉండేది. అమెరికా నుంచి వచ్చే మెకనైజ్డ్ ఉత్పత్తులతో మన సాధారణ రైతు పోరాడలేడు. అందుకే ఇక్కడి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ఉండేందుకు, ఫుడ్ సెక్యూరిటీని కాపాడేందుకు ప్రభుత్వం ఈ జాగ్రత్త పడింది. అమెరికాకు వెళ్లే భారతీయ వస్తువులపై సుంకాలను 25% నుంచి 18%కి తగ్గించుకోవడం ద్వారా ఎగుమతిదారులకు లాభం చేకూర్చారు, కానీ దిగుమతుల విషయంలో మాత్రం రైతుల రక్షణకే మొగ్గు చూపారు.

ఈ నిర్ణయంతో అటు ఐటీ, ఫార్మా, టెక్స్‌టైల్స్ రంగాలకు అమెరికా మార్కెట్ సులభం కావడమే కాకుండా, ఇటు దేశీయంగా పాలు, పంట పండించే రైతన్నకు కూడా భరోసా లభించింది. మన దేశ జనాభా అవసరాలకు సరిపడా పాలను ఉత్పత్తి చేస్తున్న మన డైరీ రంగంపై విదేశీ కంపెనీల నీడ పడకుండా ప్రభుత్వం వేసిన ఈ స్కెచ్‌ను ఆర్థిక నిపుణులు ప్రశంసిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశంగా మన ఆహార భద్రతలో స్వయం సమృద్ధి సాధించాలంటే ఇటువంటి కఠిన నిర్ణయాలు అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News