Rupee Vs Dollar : రూపాయికి మరో ఎదురుదెబ్బ..90 మార్కును దాటినా ఆగని పతనం
90 మార్కును దాటినా ఆగని పతనం
Rupee Vs Dollar : యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఇటీవల వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ భారత రూపాయి పతనం మాత్రం ఎక్కడా ఆగడం లేదు. ప్రపంచ మార్కెట్లలో పెరుగుతున్న అనిశ్చితులు, విదేశీ పెట్టుబడులు నిరంతరం వెనక్కి వెళ్లిపోవడం, దిగుమతిదారులు నుంచి అమెరికన్ డాలర్‌కు పెరుగుతున్న డిమాండ్ రూపాయిపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. ఈ కారణంగా గురువారం రోజున ఇంటర్‌బ్యాంక్ విదేశీ మారక మార్కెట్‌లో రూపాయి మరోసారి 17 పైసలు నష్టపోయి, డాలర్‌కు రూ.90.11 అనే కనిష్ఠ స్థాయికి పడిపోయింది.
ఫారెక్స్ వ్యాపారుల అభిప్రాయం ప్రకారం.. మార్కెట్‌లో రిస్క్-ఆఫ్ సెంటిమెంట్ బలంగా ఉంది. దీని అర్థం ప్రపంచ పెట్టుబడిదారులు ఇప్పుడు సురక్షితమైన పెట్టుబడి ఆప్షన్ల వైపు వేగంగా మొగ్గు చూపుతున్నారు. అమెరికన్ డాలర్, బంగారం వంటి సురక్షిత ఆస్తుల వైపు మళ్లడం వల్ల డాలర్ డిమాండ్ మరింత పెరిగింది. ఈ పెరిగిన డిమాండ్ భారత కరెన్సీపై అదనపు ఒత్తిడిని సృష్టిస్తోంది. దీనికి తోడు దేశీయ స్టాక్ మార్కెట్‌లో బలహీనత, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిరంతరం అమ్మకాలు చేపట్టడం రూపాయి పతనాన్ని మరింత పెంచుతున్నాయి. బుధవారం రోజున కూడా విదేశీ పెట్టుబడిదారులు భారత స్టాక్ మార్కెట్ నుంచి రూ.1,651.06 కోట్లను ఉపసంహరించుకున్నారు.
గురువారం నాడు ఇంటర్‌బ్యాంక్ విదేశీ మారక మార్కెట్‌లో రూపాయి రూ.89.95 స్థాయిలో ప్రారంభమైంది. అయితే, ప్రారంభ ట్రేడింగ్‌లోనే మరింత బలహీనపడి రూ.90.11 స్థాయికి చేరుకుంది. ఇది మునుపటి ముగింపు ధర రూ.89.87 తో పోలిస్తే 17 పైసల నష్టాన్ని సూచిస్తుంది. ఇదిలా ఉండగా ప్రపంచంలోని ఆరు ప్రధాన కరెన్సీలతో పోలిస్తే అమెరికన్ డాలర్ బలాన్ని కొలిచే డాలర్ ఇండెక్స్ 0.15% తగ్గి 98.63 వద్ద ట్రేడ్ అవుతోంది. అయినప్పటికీ డాలర్ బలహీనత నుంచి కూడా భారత రూపాయికి ఎలాంటి ఉపశమనం లభించకపోవడం గమనార్హం.
గురువారం రోజున దేశీయ స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ ప్రారంభంలో కొంత పెరుగుదల కనిపించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 80.15 పాయింట్ల లాభంతో 84,471.42 వద్ద,ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 34.40 పాయింట్ల లాభంతో 25,792.40 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అయినప్పటికీ విదేశీ మూలధనం బయటకు వెళ్లడం కొనసాగుతున్నందున, ఈక్విటీ మార్కెట్ బలం కూడా రూపాయికి మద్దతు ఇవ్వడంలో విఫలమైంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 0.22% స్వల్ప లాభంతో బ్యారెల్‌కు $62.35 వద్ద ఉంది. సాధారణంగా ముడి చమురు ధరల్లో స్థిరత్వం రూపాయికి సానుకూల సంకేతం. కానీ ప్రస్తుత ప్రపంచ అనిశ్చితులు, బలహీనమైన పెట్టుబడి సెంటిమెంట్ కారణంగా ఈ సానుకూలత కూడా రూపాయిని నిలబెట్టలేకపోతోంది. ప్రస్తుతం పెట్టుబడిదారులు అమెరికా-భారత్ వాణిజ్య చర్చలపై దృష్టి సారించారని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఈ చర్చల నుంచి సానుకూల సంకేతాలు లభిస్తే, రాబోయే రోజుల్లో రూపాయిలో కొంత బలం కనిపించవచ్చు. అయితే విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు, డాలర్ డిమాండ్, ప్రపంచ అస్థిరత కొనసాగినంత వరకు, భారత కరెన్సీపై ఒత్తిడి కొనసాగుతూనే ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.