Rupee : డాలర్‌తో ఢీ.. వరుసగా మూడో రోజు పుంజుకున్న రూపాయి
వరుసగా మూడో రోజు పుంజుకున్న రూపాయి
Rupee : అమెరికన్ డాలర్ ముందు భారతీయ రూపాయి విలువ వరుసగా మూడవ రోజు కూడా బలం పుంజుకుంది. రికార్డు కనిష్ట స్థాయి నుండి బయటపడుతూ వారం చివరి ట్రేడింగ్ రోజు అంటే శుక్రవారం రూపాయి ఏకంగా 21 పైసలు పెరిగి రూ.87.75 వద్ద డాలర్‌తో ట్రేడ్ అయ్యింది. విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరగడం, ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు తగ్గడం వంటి కారణాలు పెట్టుబడిదారుల ఆలోచనలను బలంగా మార్చాయి. దీంతో రూపాయికి కొత్త జోష్ వచ్చింది.
ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్‌లో రూపాయి శుక్రవారం రూ.87.91 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో వేగంగా పుంజుకొని రూ.87.75 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. ఇది అంతకుముందు రోజు ముగింపు ధర కంటే 21 పైసలు ఎక్కువ. గురువారం కూడా రూపాయి 12 పైసలు బలపడి రూ.87.96 వద్ద ముగిసింది. అంటే, రూపాయికి డాలర్‌కు వ్యతిరేకంగా వరుసగా బలం పెరుగుతోందని ఈ లెక్కలు చూపిస్తున్నాయి.
హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ ప్రకారం.. రూపాయిలో స్థిరమైన పెరుగుదలకు కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.
* ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువ తగ్గడం.
* రిస్క్‌తో కూడిన పెట్టుబడి వైపు మదుపరులు మొగ్గు చూపడం.
* విదేశీ పెట్టుబడులు (FPIలు) భారత మార్కెట్లోకి పెరగడం.
* కేంద్ర బ్యాంకులు (ఆర్‌బీఐ వంటివి) మార్కెట్‌లో వ్యూహాత్మకంగా జోక్యం చేసుకోవడం.
* ముడి చమురు ధరలు, డాలర్ ఇండెక్స్ పతనం
రూపాయికి బలం చేకూర్చిన మరో ముఖ్యమైన విషయం అంతర్జాతీయ మార్కెట్‌లో జరిగింది. ఆరు ప్రధాన కరెన్సీలతో అమెరికన్ డాలర్ బలాన్ని చూపించే డాలర్ ఇండెక్స్ 0.16% తగ్గి 98.17 వద్దకు చేరుకుంది. అదేవిధంగా, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర కూడా 0.26% తగ్గి ఒక బ్యారెల్‌కు 60.90డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ముడి చమురు ధరలు తగ్గడం భారతదేశానికి చాలా మంచిది. ఎందుకంటే ఇది దిగుమతి బిల్లును తగ్గిస్తుంది.
హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాబోయే సెలవుల కారణంగా రూపాయి పరిమిత పరిధిలో స్థిరంగా ఉండవచ్చు. అయితే డాలర్ ప్రవాహం, ప్రపంచ రాజకీయ పరిస్థితుల ఆధారంగా దీని దిశ మారుతుంది. త్వరలో డాలర్-రూపాయి జతకు రూ.87.60 వద్ద మద్దతు, రూ.88.70 వద్ద రెసిస్టెన్స్ కనిపించే అవకాశం ఉంది. మార్కెట్ డేటా ప్రకారం.. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గురువారం రూ.997.29 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.