Cooking Oil: ఇంట్లో వంట చేయాలంటే బియ్యం, పప్పులు, కూరగాయలతో పాటు వంటనూనె కూడా తప్పనిసరి. అయితే ఇప్పుడు ఈ నూనె ధరలే సామాన్యులకు భారంగా మారుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం, రూపాయి విలువ బలహీనపడటం, దేశంలో నూనెగింజల పంటల దిగుబడి తగ్గడం వంటి పరిణామాలు కలిసి వంటనూనె ధరలపై ప్రభావం చూపుతున్నాయి. 2025-26 నూనె దిగుమతుల సంవత్సరంలో భారత్ విదేశాల నుంచి వంటనూనెలు కొనడానికి దాదాపు రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ భారం 24 శాతం పెరిగింది. మరి ఈ పరిస్థితికి అసలు కారణాలేంటి? ధరలు తగ్గాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

దిగుమతుల కోసం రూ.2 లక్షల కోట్ల ఖర్చు

భారత్‌లో వంటనూనె అవసరాలు ఎక్కువగా ఉండటంతో దేశీయ ఉత్పత్తి సరిపోవడం లేదు. అందుకే విదేశాల నుంచి పెద్ద మొత్తంలో నూనెలు కొనుగోలు చేయాల్సి వస్తోంది. సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEA) గణాంకాల ప్రకారం.. 2025 నవంబర్ నుంచి 2026 అక్టోబర్ వరకు ఉన్న నూనె సంవత్సరంలో భారత్ సుమారు 1.69 కోట్ల టన్నుల వంటనూనెలను దిగుమతి చేసుకుంది. ఇందుకోసం దాదాపు రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే దిగుమతుల పరిమాణం 6 శాతం పెరగ్గా, ఖర్చు మాత్రం 24 శాతం పెరిగింది. అంటే నూనె కొనుగోలు కోసం ఎక్కువ మొత్తంలో డబ్బు చెల్లించాల్సి వస్తోంది. ఈ దిగుమతి బిల్లు 2026-27 కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు కేటాయించిన రూ.1.63 లక్షల కోట్ల కంటే కూడా ఎక్కువ. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై విదేశీ దిగుమతుల భారం ఎంత ఉందో చూపిస్తోంది.

విదేశీ మార్కెట్లలో ధరల పెరుగుదభారత్ దిగుమతి చేసుకునే నూనెల్లో పామాయిల్ వాటా ఎక్కువ. ఇండోనేషియా, మలేషియా నుంచి పామాయిల్, అర్జెంటీనా, బ్రెజిల్ నుంచి సోయాబీన్ నూనె, రష్యా, ఉక్రెయిన్ నుంచి సన్‌ఫ్లవర్ ఆయిల్ ఎక్కువగా వస్తాయి. ఈ దేశాల్లో పంటల దిగుబడి, వాతావరణ పరిస్థితులు, రవాణా సమస్యలు, బయోఫ్యూయల్ తయారీకి నూనెల వినియోగం వంటి అంశాలు అంతర్జాతీయ సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా బయోఫ్యూయల్ తయారీకి సోయా, పామాయిల్ వినియోగం పెరగడం వల్ల ఆహార అవసరాలకు అందుబాటులో ఉండే సరఫరాపై ఒత్తిడి ఏర్పడుతోంది. ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) గణాంకాల ప్రకారం.. 2026 అక్టోబర్‌లో అంతర్జాతీయ వంటనూనెల ధరల సూచీ గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే గణనీయంగా ఎక్కువగా ఉంది. దీనికి తోడు రూపాయి విలువ తగ్గితే విదేశాల నుంచి నూనె కొనుగోలు చేయడానికి భారత్ మరింత ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తుంది. ఈ భారం చివరకు వినియోగదారులపై పడుతుంది.

దేశీయంగా తగ్గిన ఆవాలు, వేరుశెనగ పంటల దిగుబడి

విదేశీ మార్కెట్లలో ధరలు పెరగడమే కాకుండా దేశంలో పండే నూనెగింజల పంటలు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం మరో సమస్యగా మారింది. ముఖ్యంగా ఆవాలు, వేరుశెనగ పంటల సాగు, దిగుబడిపై వాతావరణ పరిస్థితులు ప్రభావం చూపుతున్నాయి. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం.. ప్రస్తుత రబీ సీజన్‌లో ఆవాల సాగు విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 8.4 శాతం తగ్గింది. మరోవైపు వేరుశెనగకు ప్రధానంగా పండించే గుజరాత్‌లో తక్కువ వర్షపాతం కారణంగా ఈ ఏడాది ఉత్పత్తి 20 శాతం వరకు తగ్గవచ్చని SEA అంచనా వేసింది. దీంతో దేశీయంగా తయారయ్యే నూనె పరిమాణం తగ్గి ధరలు పెరిగే అవకాశం ఉంది. వినియోగదారుల వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం.. నవంబర్ 20 నాటికి గత ఏడాదితో పోలిస్తే వంటనూనెల రిటైల్ ధరలు 13 నుంచి 16 శాతం వరకు పెరిగాయి. ఆవాల నూనె, వేరుశెనగ నూనె ధరలు లీటరుకు రూ.210 దాటడం గమనార్హం.

దిగుమతులపై ఆధారపడటమే అసలు సమస్య

భారత్ తన వంటనూనె అవసరాల్లో దాదాపు 60 శాతం విదేశాల నుంచే తెచ్చుకుంటోంది. చౌకగా లభించే పామాయిల్, సోయా నూనెల దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటంతో దేశీయంగా ఆవాలు, వేరుశెనగ వంటి పంటలు పండించే రైతులకు తగిన ప్రోత్సాహం లభించడం లేదని నిపుణులు చెబుతున్నారు. వరి, గోధుమల మాదిరిగా నూనెగింజల పంటలకు కూడా పంట కొనుగోలుపై భరోసా ఉంటే రైతులు సాగు పెంచే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దిగుబడి పెంచే కొత్త విత్తన రకాలు, సాగు పద్ధతులపై పరిశోధన అవసరం. దేశీయ పామాయిల్ ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం ఏడేళ్లలో రూ.10,103 కోట్లతో ప్రోత్సాహక కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఈ చర్యలతో పాటు మరింత పెట్టుబడి, రైతులకు మార్కెట్ భరోసా అవసరమని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ధరలు తగ్గాలంటే ఏం జరగాలి?

వంటనూనె ధరలు వెంటనే తగ్గుతాయని చెప్పడం కష్టం. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గడం, రూపాయి బలపడటం, దేశీయంగా నూనెగింజల దిగుబడి పెరగడం వంటి అంశాలు కలిసి పనిచేయాలి. ముఖ్యంగా రైతులకు మంచి విత్తనాలు, సాగునీరు, పంట కొనుగోలుపై భరోసా కల్పిస్తే దేశీయ ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు విదేశాల నుంచి కొనుగోలు చేయాల్సిన నూనె పరిమాణం తగ్గుతుంది. ప్రస్తుతం మాత్రం అంతర్జాతీయ ధరలు, దిగుమతి ఖర్చులు, దేశీయ పంటల పరిస్థితుల కారణంగా వంటనూనె ధరలపై ఒత్తిడి కొనసాగుతోంది. అందుకే రాబోయే రోజుల్లో వంటింటి బడ్జెట్‌ను ప్రభావితం చేసే అంశాల్లో వంటనూనె కూడా కీలకంగా మారనుంది.

Tags: