RBI New Rules: ఇక మీ బ్యాంక్ ఖాతాపై మీకే పూర్తి కంట్రోల్.. పేమెంట్ లిమిట్ మీరే పెట్టుకోవచ్చు
| పేమెంట్ లిమిట్ మీరే పెట్టుకోవచ్చు
RBI New Rules: సైబర్ మోసాలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక మార్పులను ప్రతిపాదించింది. బ్యాంకు ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నాయని భావిస్తే వెంటనే డబ్బులు బయటకు వెళ్లకుండా ఆపేలా స్టాప్ స్విచ్ సదుపాయం తీసుకురావాలని సూచించింది. కస్టమర్లే తమ పేమెంట్ పరిమితులు నిర్ణయించుకోవడం, పెద్ద మొత్తంలో డబ్బు పంపేటప్పుడు నమ్మకమైన వ్యక్తి అనుమతి తీసుకోవడం వంటి మార్పులు కూడా ఇందులో ఉన్నాయి. ఇవి ప్రస్తుతం ముసాయిదా ప్రతిపాదనలు మాత్రమే. వీటిపై ప్రజలు, సంబంధిత సంస్థలు డిసెంబర్ 14, 2026 వరకు తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చు.
ఒక్క క్లిక్‌తో డిజిటల్ పేమెంట్స్ నిలిపివేయొచ్చు
ఖాతాలో మోసం జరుగుతోందని అనుమానం వస్తే స్టాప్ స్విచ్ ఆన్ చేయడం ద్వారా కొత్తగా కస్టమర్ ప్రారంభించే డెబిట్ లావాదేవీలను నిలిపివేయవచ్చు. కొత్త పేమెంట్ ఆదేశాలు, కొత్త స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్లు, కొత్త థర్డ్ పార్టీ యాప్‌లలో యూపీఐ నమోదు కూడా ఆగిపోతాయి. అయితే ఖాతాలోకి డబ్బులు జమ కావడం కొనసాగుతుంది. ఇప్పటికే అమల్లో ఉన్న ఈఎంఐలు, ఆటోమేటిక్ చెల్లింపులు, బ్యాంకు ఛార్జీలు మాత్రం కొనసాగుతాయి. మళ్లీ డిజిటల్ లావాదేవీలు ప్రారంభించాలంటే బ్యాంకు ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేయాలి.
పేమెంట్ పరిమితులు మీరే నిర్ణయించుకోవచ్చు
కొత్త ప్రతిపాదనల ప్రకారం ఒక్కో లావాదేవీకి, ఒక వ్యక్తికి రోజులో పంపే మొత్తానికి, అన్ని డిజిటల్ చెల్లింపులకు కలిపి రోజువారీ పరిమితిని కస్టమర్లే నిర్ణయించుకోవచ్చు. యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి సేవలను అవసరమైన సమయాల్లోనే పనిచేసేలా నియంత్రించుకోవచ్చు. డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ కార్డులకూ ఈ సదుపాయాలు వర్తిస్తాయి. ఏటీఎం, దుకాణాల్లో కార్డు చెల్లింపులు, ఆన్లైన్ కొనుగోళ్లు, కాంటాక్ట్‌లెస్ పేమెంట్లకు వేర్వేరు పరిమితులు పెట్టుకోవచ్చు.
పెద్ద మొత్తంలో డబ్బు పంపితే నమ్మకమైన వ్యక్తి అనుమతి
ట్రస్టెడ్ పర్సన్ మెకానిజం పేరుతో మరో భద్రతా సదుపాయాన్ని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఇందులో 18 ఏళ్లు నిండిన నమ్మకమైన వ్యక్తిని ఖాతాదారుడు ఎంపిక చేసుకోవచ్చు. నిర్ణయించిన పరిమితికి మించి డబ్బు పంపేటప్పుడు ఆ వ్యక్తికి సమాచారం వెళ్తుంది. అతను గంటలోగా అనుమతి ఇస్తేనే, బ్యాంకు తనిఖీల తర్వాత లావాదేవీ పూర్తవుతుంది. తిరస్కరించినా, స్పందించకపోయినా చెల్లింపు రద్దవుతుంది. ఈ సదుపాయం స్వచ్ఛందం. నమ్మకమైన వ్యక్తికి ఖాతా బ్యాలెన్స్, పెట్టుబడుల వివరాలు కనిపించవు. అలాగే అతను స్వయంగా డబ్బులు పంపలేడు. యూపీఐ, దుకాణాల్లో చేసే చెల్లింపులు, ముందుగా నిర్ణయించిన పునరావృత చెల్లింపులకు ఈ విధానం వర్తించదు. దీన్ని ప్రారంభించడానికి ముందు 24 గంటల విరామం ఉంటుంది.
కొత్త ఖాతాల్లో డిజిటల్ పేమెంట్లు ముందుగా నిలిపివేత
కొత్తగా బ్యాంకు ఖాతా తెరిచినప్పుడు డిజిటల్ చెల్లింపుల సదుపాయాలను మొదట నిలిపి ఉంచాలని ఆర్బీఐ సూచించింది. కస్టమర్ అనుమతి ఇచ్చిన తర్వాతే వాటిని ప్రారంభించాలి. స్టాప్ స్విచ్, పేమెంట్ పరిమితుల నియంత్రణలను మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎంలు, బ్యాంకు శాఖల్లో అందుబాటులో ఉంచాలి. ఈ సదుపాయాల్లో మార్పులు చేసినప్పుడు కస్టమర్లకు ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా సమాచారం ఇవ్వాలి.
బ్యాంకుల నిర్లక్ష్యానికీ బాధ్యత
బ్యాంకుల భద్రతా లోపాలు, మోసాలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు 24 గంటల వ్యవస్థ లేకపోవడం, ఫిర్యాదులపై సకాలంలో స్పందించకపోవడం, బ్యాంకు వ్యవస్థలో లోపాలు, ఉద్యోగులు లేదా బ్యాంకు నియమించిన వ్యక్తుల కుమ్మక్కు వల్ల మోసం జరిగితే బ్యాంకు బాధ్యతను నిర్ణయించేలా నిబంధనలను విస్తరించాలని ఆర్బీఐ ప్రతిపాదించింది.
ఈ ముసాయిదా ప్రకారం కొన్ని బ్యాంకు నిర్లక్ష్యానికి సంబంధించిన నిబంధనలు 2027 జనవరి 1 నుంచి, ప్రధాన భద్రతా మార్పులు 2027 జూలై 1 నుంచి అమలు చేయాలని ప్రతిపాదించారు. అయితే ఇవి తుది నిర్ణయాలు కావు. డిసెంబర్ 14 వరకు అందిన అభిప్రాయాలను పరిశీలించిన తర్వాత ఆర్బీఐ తుది నిబంధనలను ప్రకటించనుంది.