PM Narendra Modi : భారత్ ఆర్థిక వ్యవస్ధ బలంగా, నిలకడగా ఉంది
ట్రంప్‌కి కౌంటర్ ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ;
భారతదేశ ఆర్థిక వ్యవస్ధ చాలా బలమైనదని, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగే క్రమంలో భారత ఆర్థిక వ్యవస్ధ ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. భారత్ ఆర్థిక వ్యవస్ధతో పాటు రష్యా ఆర్థిక వ్యవస్ధలు డెడ్ ఎకానమీ లాంటివని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు మన దేశంలో కలకలం సృష్టించాయి. ట్రంప్ చేసిన అసంబద్ధ వ్యాఖ్యలకు కౌంటర్ అన్నట్లుగా నేడు శనివారం ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ ట్రంప్‌కి ఘాటు రిప్లై ఇచ్చారు. ప్రధాని మోడీ సొంత నియోజకవర్గం వారణాసిలో శనివారం జరిగిన కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల కార్యక్రమంలో మోడీ భారత్ ఆర్థిక వ్యవస్ధ స్ధితిగతులను ప్రస్తావించారు. భారత్ ఆర్థిక వ్యవస్ధ బలంగా, నిలకడగా ఉందని, మోడే అతిపెద్ద ఆర్థిక వ్యవస్ధగా ఎదిగేందుకు దూసుకుపోతోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్ధితుల్లో అంతర్జాతీయంగా అనేక దేశాల్లో ఆర్థిక గందరగోళ పరిస్ధితులు ఉన్నాయని పరోక్షంగా ట్రంప్ సుంకాల నిర్ణయాన్ని ఎత్తి చూపారు. భారత్ ప్రయోజనాలకు అవసరమైన చర్యలు మా ప్రభుత్వం తప్పినసరిగా తీసుకుంటుందని ప్రధాని స్పష్టం చేశారు. ఇందు కోసం అన్ని పార్టీలు ముందుకు వచ్చి స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెంచేలా తీర్మానం చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.