Bullet Train : భారతదేశపు మొదటి బుల్లెట్ ట్రైన్‌కు జపాన్ షిన్‌కాన్సెన్ టెక్నాలజీ.. దాని స్పెషాలిటీ ఇదే

దాని స్పెషాలిటీ ఇదే;

Update: 2025-08-30 11:09 GMT

Bullet Train : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జపాన్‌లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో జపాన్ టెక్నాలజీ వల్ల భారతదేశానికి కలగబోయే ప్రయోజనాలపై అందరి దృష్టి పడింది. జపాన్ సాంకేతిక నైపుణ్యానికి చాలా ప్రసిద్ధి చెందింది. వారి ఉత్పత్తులు క్వాలిటీలో ఎటువంటి రాజీ పడవు. భారతదేశపు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లకు జపాన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ముంబై, అహ్మదాబాద్ మధ్య హై స్పీడ్ రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు, దీనికి జపాన్ షిన్‌కాన్సెన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.

ఏమిటీ షిన్‌కాన్సెన్ టెక్నాలజీ?

షిన్‌కాన్సెన్ అనేది జపాన్ బుల్లెట్ ట్రైన్. ఇది ఒక ప్రత్యేకమైన హై-స్పీడ్ రైలు సిస్టమ్. ఇది 1964లో ప్రారంభమైంది. ఇది ప్రపంచంలోనే మొదటి హై-స్పీడ్ రైల్వేగా గుర్తింపు పొందింది. ఈ రైలు కోసం ప్రత్యేకంగా స్టాండర్డ్ గేజ్‌లో రైలు పట్టాలను నిర్మించాలి. ఈ పట్టాలపై షిన్‌కాన్సెన్ రైలు గంటకు సుమారు 300 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. గత ఆరు దశాబ్దాలుగా ఈ రైలులో ఒక్క ప్రమాదం కూడా జరగలేదు. ఈ రైళ్లు చాలా తక్కువ శబ్దాన్ని చేస్తాయి. తేలికైన అల్యూమినియం లోహంతో వీటిని తయారు చేశారు. బోగీ లోపల విశాలమైన స్థలం ఉంటుంది.

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్

ముంబై, అహ్మదాబాద్ మధ్య 508 కి.మీ. పొడవైన హై-స్పీడ్ రైలు వ్యవస్థను నిర్మిస్తున్నారు. ఈ రైలు మార్గం స్టాండర్డ్ గేజ్‌లో నిర్మించబడుతుంది. షిన్‌కాన్సెన్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ రైలు ప్రాజెక్ట్ 2030 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ మార్గంలో నడిచే రైళ్లు సరికొత్త షిన్‌కాన్సెన్ ఈ5 సిరీస్‌కు చెందినవి. జపాన్, భారతదేశంలో ఈ5 మోడల్ ఒకేసారి విడుదల అవుతుందని భావిస్తున్నారు. ఈ రైలు గంటకు 320 కి.మీ. వేగంతో వెళ్లగలదు. ముంబై, అహ్మదాబాద్ మధ్య ఉన్న 500 కి.మీ. దూరాన్ని ఈ రైలు కేవలం 2-3 గంటల్లో చేరుకుంటుంది. ఈ మార్గంలో 21 కి.మీ. సముద్రం లోపల సొరంగం కూడా ఉంటుంది. అంటే, ఈ రైలు సముద్రం లోపల సొరంగం గుండా వెళుతుంది.

Tags:    

Similar News